అమ్మాయిలు అదరగొట్టారు!
ఉత్తీర్ణతలోనూ, అత్యధిక మార్కుల్లోనూ వారే టాప్
బాలికలు 69.52 శాతం, బాలురు 61.87 శాతం పాస్
మొత్తం 65.57 శాతం ఉత్తీర్ణత నమోదు
గతేడాది కంటే స్వల్పంగా పెరుగుదల
మొదటి స్థానంలో కృష్ణా.. చివరలో మెదక్, ఆదిలాబాద్
ఫలితాలు విడుదల చేసిన గవర్నర్ సలహాదారు సలావుద్దీన్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అమ్మాయిలు అదరగొట్టారు. ఉత్తీర్ణతపరంగానే కాకుండా అన్ని గ్రూపుల్లోనూ అత్యధిక మార్కులు సాధించి సత్తా చాటారు. ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో శనివారం ఈ ఫలితాలను గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ మహ్మద్ విడుదల చేశారు. ద్వితీయ సంవత్సర పరీక్షలకు రెగ్యులర్, ప్రైవేటు కలిపి మొత్తం 9,54,156 మంది విద్యార్థులు హాజరుకాగా.. 5,69,571 మంది (59.69 శాతం) ఉత్తీర్ణులయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 65.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు 69.52 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 61.87 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోల్చితే ఈసారి రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగింది. 82 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలువగా, 49 శాతం ఉత్తీర్ణతతో మెదక్, ఆదిలాబాద్ జిల్లాలు చివరి స్థానంలో ఉన్నాయి. ఎంపీసీలో వేయి మార్కులకుగాను 994 నుంచి 990 మార్కులు సాధించినవారు 11 మంది ఉండగా, వారిలో ఎనిమిది మంది అమ్మాయిలే కావడం విశేషం. ఇక బైపీసీలో అత్యధిక మార్కులు 989 సాధించినవారు ఎనిమిది మంది ఉండగా, అందులో ఏడుగురు బాలికలే. ఎంసీఈ, సీఈసీ, హెచ్‌ఈసీల్లో కూడా వారే ముందంజలో ఉన్నారు.
25 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ...
ఈనెల 25 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సెకండరీ విద్య ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సర పరీక్షలు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. పర్యావరణ విద్య పరీక్ష మే 19న ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు ఉంటుందని పేర్కొన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు మే 20 నుంచి 24 వరకు ఉంటాయని చెప్పారు. ఇందుకోసం విద్యార్థులు ఈనెల 9లోగా పరీక్ష ఫీజు చెల్లించి, దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే ప్రస్తుత పరీక్ష ఫలితాలకు సంబంధించిన మార్కుల మెమోలను ఈనెల 7లోగా ఆర్‌ఐఓ కార్యాలయాల నుంచి తీసుకోవాలని ప్రిన్సిపాళ్లకు సూచించారు. వాటిలో ఏమైనా తప్పులు, పొరపాట్లు ఉంటే, జూన్ 1వ తేదీలోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈనెల 9లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలను http://bieap.gov.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని వివరించారు.