జూన్ 18 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
27లోగా స్కూళ్లకు మార్కుల మెమోలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను వచ్చే నెల 18 నుంచి జూలై 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజు చెల్లింపు గడువు పెంచేది లేదని స్పష్టం చేశారు.
ఈ పరీక్షలకు సమయం తక్కువగా ఉందని, ఫెయిల్ అయిన విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే అవి తేలే వరకు వేచి చూడొద్దని, ముందుగా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించాలని సూచించారు. విద్యార్థుల మార్కుల మెమోలు, నామినల్ రోల్స్ అన్నీ ఈ నెల 27వ తేదీలోగా సంబంధిత పాఠశాలలకు పంపిస్తామని చెప్పారు. పాఠశాలల నుంచి పూర్తి సమాచారం అందని కారణంగా కొంతమంది విద్యార్థుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టినట్లు పేర్కొన్నారు. వాటిని త్వరలోనే ప్రకటించేందుకు చర్యలు చేపడతామన్నారు.
రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు 12 రోజుల గడువు
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం విద్యార్థులు 12 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. రీ కౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ. 500 చొప్పున ‘సెక్రటరీ టు ది కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, హైదరాబాద్, తెలంగాణ’ పేరున ఎస్‌బీహెచ్ లేదా ఎస్‌బీఐలో డీడీ తీసి అభ్యర్థన పత్రంతో దరఖాస్తు చేసుకోవాలి. ఇక రీ వెరిఫికేషన్ కోసం జిల్లాల్లోని డీఈవో కార్యాలయాల్లో వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కో సబ్జెక్టుకు రూ. 1000 చొప్పున చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారాన్ని www.bsetelangana.org వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
పూర్తి చేసిన దరఖాస్తు ఫారంపై సంబంధిత ప్రధానోపాధ్యాయుడితో ధ్రువీకరణ సంతకం చేయించి, హాల్‌టికెట్ జిరాక్స్ కాపీని జత చేసి, డీఈవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో అందజేయాలి. పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపించే దరఖాస్తులను స్వీకరించరు. రీ వెరిఫికేషన్‌లో గ్రేడ్ మారితేనే సవరించిన ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు. దీని కోసం దరఖాస్తు చేసిన వారు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.