నేటి నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు
జిల్లాలో166 కేంద్రాలు
32,285 మంది విద్యార్థులు
నాలుగు విడ తలుగా పరీక్షలు
నాలుగు ఫ్ల్లయింగ్ స్క్వాడ్ బృందాలు
విశాఖపట్నం : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రయోగ పరీక్షలు గురువారం ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 166 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అర్బన్‌లో 91, రూరల్‌లో 58, ఏజెన్సీలో 17 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాలుగు విడతలుగా జరిగే ఈ పరీక్షలకు తొలి విడత 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరగనున్నాయి. 18 నుంచి 22 వరకు రెండో విడత, 23 నుంచి 27 వరకు మూడో విడత, 28 నుంచి మార్చి 4 వరకు నాల్గో విడత పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలుంటాయి. ఈ పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా 32,285 మంది హాజరుకానున్నారు. ఎంపీసీ 25,647 మంది, బైపీసీ 6,638 మంది విద్యార్థులు ప్రయోగ పరీక్షల్లో పాల్గొంటున్నారు. ప్రాక్టికల్స్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, ఆర్‌ఐవో, డీవీఈవో, ఆర్‌జేడీ, రెవెన్యూ బృందాలు పరీక్షలను పర్యవేక్షిస్తాయి.
మాల్ ప్రాక్టీస్ జరగకుండా ప్రత్యేక చర్యలు
ప్రాక్టికల్స్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలో పరీక్షలు నిర్వహిస్తున్న 166 కేంద్రాల్లో వీడియో రికార్డ్ చేయనున్నారు. ఏ కళాశాల విద్యార్థులకు అదే కళాశాలలో పరీక్ష నిర్వహించడం వల్ల ఈ పద్ధతి ప్రవేశపెట్టారు. తమ కళాశాల ఉత్తీర్ణత శాతం మెరుగుపరచడానికి, ఎక్కువ మార్కుల సాధనకు కొన్ని కళాశాలలు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నాయి. అందుకే పరీక్ష గదుల్లో వీడియో రికార్డ్ ద్వారా విద్యార్థులు ప్రయోగాలు ఏ విధంగా చేస్తున్నారో తెలుసుకుంటారు. ఏజెన్సీలో మాల్ ప్రాక్టీస్ జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు.