విజయనగరం క్రైం, న్యూస్‌లైన్ : పోలీసు శాఖలో హోంగార్డుల సేవలు ప్రశంసనీయమైనవని ఎస్‌పీ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. హోంగార్డుల 51వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరిచారు. అనంతరం ఎస్‌పీ మాట్లాడుతూ పోలీసులతో సమానంగా అన్ని రకాలైన విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు ఎంతో సహాయకారులుగా హోంగార్డులు వ్యవహరిస్తున్నారని కొనియూడారు. స్వచ్ఛంద సేవకులుగా హోంగార్డులు వివిధ రాష్ట్రాల్లోని పోలీసులకు తమ వంతు సహకారం అందిస్తున్నారని కొనియూడారు. శాంతిభద్రతల పరిరక్షణలో కూడా వారి పాత్ర మరువలేనిదన్నారు. తమ సేవలతో సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటూ ముందంజ వేస్తున్నారని చెప్పారు. ప్రస్తుత సమాజంలో హోంగార్డులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. క్రమశిక్షణతో వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించకుని భవిష్యత్‌లో కూడా హోంగార్డులు ఈ విధమైన సహాయ సహకారం పోలీసు శాఖకు అందించాలని కోరారు. జిల్లాలో పని చేస్తున్న హోంగార్డుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పరేడ్‌కు టీం కమాండర్‌గా ఆర్‌ఎస్‌ఐ ఎల్.హిమగిరి వ్యవహరించారు. కార్యక్రమంలో విజయనగరం అదనపు ఎస్‌పీ టి.మోహనరావు, డీఎస్‌పీ ఎస్.శ్రీనివాస్, ఏఆర్ డీఎస్‌పీ జి.శ్రీనివాసరావు, ఆర్‌ఐలు ఎస్వీ అప్పారావు, పి.నాగేశ్వరరావు, ఒకటో పట్టణ సీఐ కె.రామారావు, రెండో పట్టణ సీఐ పి.ముత్యాలనాయుడు, డీసీఆర్‌బీ సీఐ జి.రామకృష్ణ, ఎస్.కోట సీఐ బుచ్చిరాజు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు ఎంవీఆర్ సింహాచలం, ఇతర పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.
హోంగార్డుల సేవలు ప్రశంసనీయం
Published Sat, Dec 7 2013 3:57 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM
Advertisement