ఇంటి దొంగల టాలెంట్
సాక్షి ప్రతినిధి, రామచంద్రపురం :రామచంద్రపురం మున్సిపాలిటీ జనాభా 43 వేల పైమాటే. పట్టణంలో నివసిస్తున్న కుటుంబాల సంఖ్య 17వేలు. మున్సిపాలిటీ అంచనా ప్రకారం ఆస్తిపన్ను వసూలు చేయాల్సిన భవనాలు 10వేల 500 వరకు ఉన్నాయి. మున్సిపాలిటీ గుర్తించి డిమాండ్ నోటీసులు జారీచేసిన భవనాల యజమానుల నుంచి ఆస్తిపన్నులు వసూలుకు ఉపక్రమించిన సిబ్బంది చేతివాటం చూపించి రూ. లక్షలు దిగమింగేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2013-2014 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డిమాండ్ నోటీసుల ప్రకారం అర్థ సంవత్సరానికి సుమారు కోటి రూపాయలు వసూలు కావాల్సి ఉంది. మూడు పద్ధతుల్లో జరుపుతున్న వసూళ్ల ప్రక్రియలో కొందరు బిల్లుకలెక్టర్‌లు ప్రజల నుంచి సొమ్ములు వసూలుచేసి మున్సిపాలిటీ రశీదులు ఇచ్చి సొమ్ము మాత్రం మున్సిపల్ ఖాతాలో జమచేయలేదని తెలియవచ్చింది.
మున్సిపల్ బిల్లు కలెక్టర్‌లు పట్టణంలో ఇంటింటికీ నేరుగా వెళ్లి డిమాండ్ నోటీసుల మేరకు పన్నులు జమ చేసుకుని రసీదులు ఇస్తుంటారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో కూడా ఆస్తిపన్నులను కట్టించుకుని రసీదులు ఇచ్చారు. ఈ రెండు పద్ధతుల్లో వసూలు సందర్భంగానే సొమ్ము పక్కదారి పట్టించారని విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారాన్ని బట్టి తెలియవచ్చింది. ఇక మూడో పద్ధతి మీ సేవా కేంద్రాలు. వీటి ద్వారా పన్నులు వసూలు చేసి మున్సిపల్ ఖాతాకు ఆన్‌లైన్ ద్వారా జమ చేస్తుంటారు. వీటిలో పైన పేర్కొన్న రెండు పద్ధతుల్లో జరిగిన వసూళ్లలోనే అవకతవకలు చోటుచేసుకున్నాయని నమ్మకమైన వర్గాల ద్వారా తెలిసింది.
ఆస్తిపన్నులు వసూలుచేసే ఏడుగురు బిల్లు కలెక్టర్‌లలో ముగ్గురు ఈ అవినీతి బాగోతంలో కీలకపాత్ర పోషించారని మున్సిపల్ వర్గాలు చెబుతున్నాయి. డిమాండ్ నోటీసుల మేరకు ఇంటింటికీ వెళ్లి వసూలు చేసిన సొమ్ము, మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్‌లలో ప్రజలు జమ చేసిన ఆస్తిపన్నులకు సంబంధించిన సొమ్ముల్లోనే అవినీతి చోటుచేసుకుందనే విషయం మున్సిపల్ అధికారులకు ఆలస్యంగా తెలిసింది. బిల్లుల వసూలు పుస్తకంలో కౌంటర్ ఫాయిల్, రశీదుల వారీగా లెక్కలేయగా సుమారు రూ.48 లక్షలకు లెక్కా పత్రం లేకుండా పోయిందని సమాచారం. నేరుగా ఇళ్లకు వెళ్లి బిల్లు కలెక్టర్లు వసూలు చేసిన ఆస్థిపన్నులకు రశీదులు ఇచ్చినా ఆన్‌లైన్‌లో జమ చేయకుండా నొక్కేశారు. కార్యాలయ కౌంటర్‌లో జమ చేసుకున్న బిల్లుల సొమ్ము సైతం ఆన్‌లైన్ చేయకుండా గోల్‌మాల్ చేశారంటున్నారు.
పురపాలక సంఘం పరిధిలో అసెస్‌మెంట్‌లను ఇటీవల పరిశీలించిన బిల్లు వసూళ్ల విభాగ అధికారులకు ఈ విషయం అవగతమైంది. పాత అసెస్‌మెంట్లతో పాటు కొత్తవాటిలో సొమ్ము పక్కదారి పట్టినట్టు ఒక అధికారి మున్సిపల్ ఉన్నతాధికారులకు తెలియచేయగా, గుట్టుచప్పుడు కాకుండా అంతర్గతంగా ఇద్దరు దిగువ స్థాయి అధికారులతో ఆరా తీయించారని తెలియవచ్చింది. అనంతరం ఈ వ్యవహారంపై నివేదిక అందచేయాలని ఇద్దరు అధికారులకు కమిషనర్ జీవరత్నం రెండురోజుల క్రితం బాధ్యత అప్పగించారని చెబుతున్నారు.
మున్సిపాలిటీలో జరుగుతున్న బాగోతం బయటకు పొక్కడంతో పట్టణంలో ఎవరిమట్టుకు వారు చెల్లించిన సొమ్ము ఆన్‌లైన్‌లో జమ అయిందో లేదో తెలుసుకునేందుకు కార్యాలయంలోని కౌంటర్ వద్ద క్యూ కడుతున్నారు. వారికి బిల్లు కలెక్టర్‌లు ఇచ్చిన రసీదులను పట్టుకుని కార్యాలయానికి వచ్చి తమ సొమ్ము జమ అయ్యిందా లేదా తేల్చి చెప్పాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయంలోని పన్నుల వసూలు కౌంటర్‌ను ఇటీవల మూసేయడం ఈ అవినీతి బాగోతం వాస్తవమనే విషయాన్ని స్పష్టం చేస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు.
కార్యాలయంలోని కౌంటర్ మూసివేయడంపై స్థానికులు నిలదీస్తుంటే అధికారులు నోళ్లు వెళ్లబెడుతున్నారు. మున్సిపల్ కమిషనర్ ఎం.జీవరత్నంను ‘సాక్షి’ ఈ అంశంపై వివరణ కోరగా ఆస్తిపన్నుల వసూలులో అవకతవకలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు రావడం వాస్తవమేనన్నారు. ఇదే విషయమై మున్సిపాలిటీలో ఆస్తిపన్నులకు సంబంధించిన రికార్డులు పరిశీలిస్తున్నామని చెప్పారు. అవన్నీ అవకతవకలు కాకపోవచ్చునని, రికార్డుల్లో పొరపాట్లు దొర్లి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.