సాక్షి, అమరావతి: వీక్లీ ఆఫ్ ఇవ్వడంతో పోలీసుల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసినట్టుగానే వేతనాల పెంపుతో హోంగార్డుల జీవితాల్లోనూ కొత్త వెలుగులు ఉదయించాయి. వేతనాల పెంపుతోపాటు అనేక ప్రయోజనాలు కూడా కల్పించడంతో దుర్భర పరిస్థితుల నుంచి ధైర్యంగా విధులు నిర్వర్తించగలుగుతున్నామంటూ హోంగార్డులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పోలీసులతో సమానంగా కష్టపడుతూ చాలీచాలని జీతాలతో తాము విధులు నిర్వర్తించామని.. ఇప్పుడు తమ కష్టాలు తీరుతున్నాయని చెబుతున్నారు.
తొలి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం
జూన్ 10న నిర్వహించిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే హోంగార్డులకు వేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హోంగార్డుల రోజువారీ వేతనాన్ని రూ.600 నుంచి రూ.710కి పెంచింది. దీంతో వారి నెల జీతం రూ.18 వేల నుంచి రూ.21,300కు పెరిగింది. పెంచిన వేతనాన్ని అక్టోబర్ 1 నుంచి వర్తింపచేయాలని ఉత్తర్వులిచ్చింది. వేతన పెంపుతో రాష్ట్రవ్యాప్తంగా 16,616 మందికి మేలు కలుగుతుంది.
వేతనం పెంపుతోపాటు మరెన్నో ప్రయోజనాలు
ఇప్పటివరకు పోలీసులకు మాత్రమే అమలవుతున్న బీమాను హోంగార్డులకు వర్తింపజేస్తూ తాజాగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హోంగార్డు అకాల మరణం చెందితే రూ.30 లక్షలు, తీవ్రవాదుల దాడుల్లో చనిపోతే మరో రూ.10 లక్షలు కలిపి రూ.40 లక్షలు ఇవ్వనుంది. ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షలు పరిహారం అందిస్తుంది. హోంగార్డు చనిపోతే అంత్యక్రియల కోసం ఇచ్చే మొత్తాన్ని రూ.1,000 నుంచి రూ.10 వేలకు పెంచింది. అంతేకాకుండా వారి ఆరోగ్య సంరక్షణ కోసం అతి త్వరలోనే హెల్త్ కార్డులను కూడా మంజూరు చేయనుంది. నిబంధనల ప్రకారం.. అర్హత ఉన్న హోంగార్డులకు గృహనిర్మాణ పథకంలో ఇళ్లు కేటాయించే ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తోంది.
జీవితంలో మరిచిపోలేం
– ఎస్.గోవిందు, హోంగారŠుడ్స అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హోంగార్డుల వేతనాలు పెంచి సీఎం వైఎస్ జగన్ మా మనసు గెలుచుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోలేదు. వైఎస్ జగన్ చేసిన మేలును మా జీవితంలో మరిచిపోలేం.
ప్రతినెలా ఒకటినే జీతం అందుతోంది
అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే వేతనాలు పెంచడం పట్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ప్రతి నెలా ఒకటినే మాకు జీతం అందుతోంది. దీంతో కుటుంబ సమస్యలు తీరుతున్నాయి.
- సీహెచ్.శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ పీఆర్‌వో, హోంగార్డు అసోసియేషన్ గుంటూరు రూరల్
సీఎంను జీవితాంతం గుర్తుంచుకుంటాం
కాళ్లరిగేలా తిరిగినా చంద్రబాబు మమ్మల్ని ఆదుకోలేదు. చివరకు పాదయాత్రలో వైఎస్ జగన్‌ను కలిశాం. ‘అన్నా మన ప్రభుత్వం వచ్చాక మీ వేతనాలు పెంచుతాం’ అని ఆయన మాకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మాట నిలబెట్టుకుని మా కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఆయనను మా జీవితాంతం గుర్తుంచుకుంటాం.
– రూప్‌కుమార్, హోంగార్డు, చిత్తూరు
Comments
Please login to add a commentAdd a comment