గుంటూరు : నగరంలోఆదివారం జరిగిన పరువు హత్య తీవ్ర కలకలం సృష్టించింది. కులాంతర వివాహం చేసుకుందని కుమార్తెను తల్లి దండ్రులే కసాయిలుగా మారి దారుణంగా హత్య చేసిన ఘటన రాజేంద్ర నగర్ లో చోటు చేసుకుంది. పెళ్లి పారాణి ఆరకముందే దీప్తి అనే యువతిని తల్లి దండ్రులే హత్య చేసి పరారైయ్యారు. ప్రేమ వివాహం చేసుకున్నందుకు తన భార్యను అత్తా మామ హత్య చేశారని భర్త ఆరోపిస్తున్నాడు.
తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగికి చెందిన అనంతపల్లి నాగ సత్యనారాయణ, అరుశ్రీ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు కిరణ్‌కుమార్ హైదరాబాద్‌లో హెచ్‌సిఎల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ ఫిబ్రవరి 1న అమెరికా వెళ్ళాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసే సమయంలో 2011లో అదే కంపెనీలో పని చేస్తున్న గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం గోగులమూడికి చెందిన పచ్చల దీప్తితో పరిచయం ఏర్పడింది.
ఇరువురు పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. ఇందుకు కిరణ్‌కుమార్ తన తల్లి దండ్రులను ఒప్పించాడు. అయితే ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో దీప్తి తల్లి దండ్రులు పెళ్ళికి అంగీకరించలేదు. దీప్తికి తల్లి దండ్రులు పెళ్ళి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. వేరొకరిని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేని దీప్తి కిరణ్‌కుమార్‌కు ఫోన్ చేసి తనను పెళ్ళి చేసుకోకుంటే చనిపోతానని హెచ్చరించింది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం అమెరికా నుంచి వచ్చిన కిరణ్‌కుమార్ దీప్తిని వివాహం చేసుకున్నాడు. ఈ ప్రేమ వివాహాన్ని అంగీకరించని తల్లి దండ్రులు ఆసరాగా ఉంటామని నమ్మించి హత్య చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.