
పెనమలూరు ‘దేశం’ అతలాకుతలం
జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దెబ్బకు స్థానికంగా పార్టీ విలవిల్లాడుతోంది.
- వీడని వర్గపోరు
- బోడే ప్రసాద్‌కు చుక్కెదురు
- ప్రచారానికి వైవీబీ, పద్మావతి వర్గాలు దూరం
- మూడు గ్రూపులు, ఆరు వర్గాలుగా టీడీపీ సతమతం
- సమన్వయంతో వైఎస్సార్‌సీపీకి పెరిగిన గాలి
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దెబ్బకు స్థానికంగా పార్టీ విలవిల్లాడుతోంది. సీటు సిగపట్టులో కోట్లు కుమ్మరించిన వ్యక్తికే ప్రాధాన్యత ఇచ్చారన్నా ప్రచారం గుప్పుమనడంతో పార్టీలోని వర్గపోరు కత్తులు నూరుతోంది.
నియోజకవర్గంలో తీవ్రరూపం దాల్చిన మూడు గుళ్లాట ఆ పార్టీని ముప్పుతిప్పలు పెడుతోంది. ఇంతకీ పెనమలూరు టీడీపీలో మూడు గ్రూపులు, ఆరు వర్గాలుగా మారిపోవడానికి కారణం ఏమిటంటే అందరి వేళ్లు చంద్రబాబు వైపే చూపిస్తున్నాయి. ప్రజల్లో పలుచనై పార్టీ కేడర్‌కు దూరమౌతున్న పెనమలూరు టీడీపీ దుస్థితికి కారణాలనేకం ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పెనమలూరు నియోజకవర్గంపై తొలి నుంచి తెలుగుదేశం పార్టీ భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుంచి నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ, నారా లోకేష్, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పోటీకి దిగుతారన్న ప్రచారం ముమ్మరంగా జరిగింది. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మంత్రాంగం, చంద్రబాబు నిర్ణయం వెరసి పెనమలూరులో టీడీపీకి గడ్డుకాలం దాపురించేలా చేశాయి.
పెనమలూరు సీటు కోసం తొలి నుంచి మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్, చలసాని వెంకటేశ్వరరావు(పండు) సతీమణి పద్మావతి, బోడే ప్రసాద్ ఆశించారు. అనేక సందర్భాల్లో సీటు కోసం పోటాపోటీ సమీకరణలు, పైరవీలు సాగాయి. ఓ సందర్భంలో హైదరాబాద్‌లో చంద్రబాబు సమక్షంలో పెనమలూరు తెలుగు తమ్ముళ్లు గ్రూపులుగా విడిపోయి కొట్లాటకు దిగారు. నేతలు సీటు కోసం కుస్తీపడితే తమ్ముళ్లకు మాత్రం తలలు పగిలాయి.
మొదట్నుంచి పండును తీవ్రంగా వ్యతిరేకించిన వైవీబీ రాజేంద్రప్రసాద్ సీటు కోసం రాజీపడ్డారు. చివరకు వైవీబీ, చలసాని పండు సతీమణి పద్మావతి రాజీఫార్మూలాకు వచ్చారు. దీంతో గతం నుంచి వైరీవర్గాలుగా ఉండే వైవీబీ, పద్మావతి ఇద్దరూ చంద్రబాబును కలిసి తామిద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ ఇస్తే సహకరిస్తామని, బోడే ప్రసాద్‌కు ఇవ్వొద్దని అల్టిమేటం ఇచ్చారు.
తీరా ఎంపీ సుజనా చౌదరి రాయబేరంతో బోడే ప్రసాద్‌కే పెనమలూరు టికెట్‌ను ఖరారు చేయడంతో తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. రూ.5కోట్లు ఇస్తే పెనమలూరు టీడీపీ టికెట్ ఇచ్చారని ఆ పార్టీ వారే ఆవేదన చెందుతున్నారు. హైటెక్ సీఎం అంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు సెల్ మెస్సేజ్‌లు, సెల్ ఫోన్‌ల ద్వారా సమాచారం తీసుకుని వాటిని పరిగణలోకి తీసుకోకుండా సీటు కేటాయించిన తీరు పెనమలూరు టీడీపీ పుట్టి ముంచుతుందని ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నారు.
ప్రచారానికి వైవీబీ, పద్మావతి దూరం..
పెనమలూరు నియోజకవర్గంలో ఒక పర్యాయం స్వతంత్ర అభ్యర్థిగా, రెండు పర్యాయాలు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చలసాని వెంకటేశ్వరరావు(పండు)కి బోడే అనుచరుడిగా ఉండే వారు. అటువంటి బోడే ప్రసాద్ ఇప్పుడు టికెట్ తెచ్చుకుని పండు వర్గాన్ని టార్గెట్ చేయడంతో వర్గపోరు రాజుకుంది. దీంతో పండు అనుచర వర్గం అంతా బోడేను ఓడించేందుకు కంకణం కట్టుకుంది.
పండు భార్య పద్మావతి, అల్లుడు దేవినేని గౌతమ్‌తోపాటు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ సైతం బోడే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. మామను వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టిన చంద్రబాబు... సీటు విషయంలో పెనమలూరు టీడీపీనీ దెబ్బతీశారని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. దీంతో పలువురు టీడీపీ శ్రేణులు ఆ పార్టీని వీడే యోచనలో ఉన్నట్టు సమాచారం. త్వరలోనే పలువురు నేతలు వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్లు సమాచారం.
ప్రచారంలో వైఎస్సార్‌సీపీ ‘గాలి’..
తెలుగుదేశం పార్టీలో వర్గపోరు ముప్పుతిప్పలు పెడుతుంటే మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం కీలక నేతలు సమన్వయంతో ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. తొలి నుంచి ఇక్కడ వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా పడమటి సురేష్‌బాబు పార్టీ కోసం పనిచేశారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో ఇక్కడ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు తనయుడు డాక్టర్ కేవీఆర్ విద్యాసాగర్‌కు కేటాయించారు.
సీటు రాలేదని పడమటి సురేష్‌బాబు ఏ మాత్రం నిరూత్సాహ పడకుండా వైఎస్.జగన్‌మోహనరెడ్డి సీఎం కావాలనే లక్ష్యంతో విద్యాసాగర్‌తో సమన్వయంతో పనిచేస్తున్నారు. రోజువారీగా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సాగర్, పడమటి సురేష్‌బాబు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తూ పార్టీ గెలుపు కోసం శ్రేణుల్ని సమన్వయంతో ముందుకు నడిపిస్తున్నారు. కొత్తగా ఈ నియోజకవర్గానికి వచ్చిన సాగర్‌ను సైతం ప్రజలు నిండు మనస్సుతో ఆదరిస్తుండటం విశేషం.
దీనికితోడు ఇప్పటి వరకు పెనమలూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన తాజామాజీ మంత్రి కొలుసు పార్థసారథి వైఎస్సార్‌సీపీలో చేరి మంచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీచేస్తున్న సంగతి తెల్సిందే. దీంతో సారథి ఎంపీ అభ్యర్థి కావడంతో పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీకి అదనపు బలం చేకూర్చినట్టు అయ్యింది. వైఎస్సార్‌సీపీ నేతలు సమన్వయంతో ముందుకు సాగడంతో ఆ పార్టీ శ్రేణుల్లో సర్వత్రా ఉత్సాహం ఉప్పొంగుతోంది.