విమానాశ్రయ ఏర్పాటుకు గనుల దెబ్బ!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో ఏర్పాటు చేయనున్న ప్రాంతీయ విమానాశ్రయానికి పదే పదే అడ్డంకులు ఎదురవుతున్నాయి. మొదట్లో విమానాశ్రయ ఏర్పాటుకు టెండర్లు పిలిస్తే ఒక్కరూ ముందుకు రాలేదు. తాజాగా విమానాశ్రయానికి ఇవ్వాల్సిన భూముల్లో అపారమైన ఖనిజాల నిల్వలు ఉన్నాయని గనులశాఖ అంటోంది. ఇంత విలువైన భూములు కేటాయించడం సరికాదని గనులశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ ప్రదేశంలో విమానాశ్రయ ఏర్పాటు చేస్తే మంచిదని సూచిస్తున్నారు.
ప్రస్తుతం ఏర్పాటు చేయాలనుకున్న ప్రాంతంలో ఖనిజ నిల్వలున్న భూములను ఇవ్వలమేని ఆ శాఖ తేల్చిచెబుతోంది. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ భూములను ఇవ్వాల్సిందేనని అంటోంది. మరోవైపు కర్నూలు జిల్లాలో ప్రాంతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తానని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న ప్రభుత్వం.. నిధుల కేటాయింపులో మాత్రం మొండిచేయే చూపింది. ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా నిధులు విదల్చలేదు. మొత్తం మీద కర్నూలు జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు ప్రక్రియ కాస్తా ఒక్క అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారిపోయింది.
ఖనిజ నిల్వలున్నాయి...!
కర్నూలుకు కేవలం 17 కిలోమీటర్ల దూరంలో సుమారు 2,760 ఎకరాల విస్తీర్ణంలో ప్రాంతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేతవరం, పుడిచెర్ల, ఒర్వకల్లు, కన్నమదకల గ్రామాల పరధిలో ఏర్పాటు కానున్న పారిశ్రామిక హబ్‌లో భాగంగా ఈ విమానాశ్రయం ఏర్పాటు కానుంది. అయితే, విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన భూముల్లో ఖనిజ నిల్వలు ఉన్నాయని భూగర్భ గనులశాఖ అధికారులు ఒక నివేదిక తయారుచేశారు.
ఖనిజ సంపద ఉన్న భూములను విమానాశ్రయ ఏర్పాటుకు కేటాయించడం సరికాదని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో గనులశాఖ స్పష్టంగా పేర్కొన్నట్టు తెలిసింది. విమానాశ్రయ ఏర్పాటు కోసం ప్రత్యామ్నాయ భూములను చూసుకోవడం మంచిదని కూడా అభిప్రాయపడినట్టు సమాచారం. మరోవైపు ఈ భూముల్లో ఖనిజాల అన్వేషణకుగానూ లెసైన్సు కోసం ఎవరైనా దరఖాస్తు చేస్తే సమస్యలు కూడా తప్పవన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మాత్రం ఇవే భూములు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.
ఆదీ నుంచి అడ్డంకులే...!
కర్నూలు విమానాశ్రయానికి మొదటి నుంచి అడ్డంకులే ఎదురవుతున్నాయి. వాస్తవానికి జిల్లాకో ప్రాంతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి భావించారు. ఇందులో భాగంగా ఆయన హయాంలోనే కర్నూలు జిల్లాలో ప్రాంతీయ విమానాశ్రయ ఏర్పాటుకు రంగం సిద్ధమయ్యింది. ఇందుకోసం ఆయన టెండర్లు కూడా పిలిచారు. అయితే, మొదటిసారి టెండర్లు పిలిచినప్పుడు ఎవరూ ముందుకు రాలేదు. టెండరులో పేర్కొన్న మేరకు రాయితీలు ఇస్తే తమకు పెద్దగా లాభసాటి కాదని భావించినందువల్లే ప్రైవేటు సంస్థలు ముందుకు రాలేదు.
ఈ నేపథ్యంలో విమానాశ్రయ ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు అదనపు రాయితీలు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు అప్పట్లో రాష్ట్ర కేబినెట్ కూడా తీర్మానం చేసింది. ఈ అదనపు రాయితీలతో మళ్లీ టెండర్లు పిలిచేందుకు కూడా ప్రక్రియ ముందుకుసాగింది. ఈ పరిస్థితుల్లోనే వైఎస్సార్ మరణించారు. ఫలితంగా విమానాశ్రయ ఏర్పాటు ప్రక్రియ కాస్తా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిపోయింది.
బడ్జెట్‌లో నిధులూ లేవు...!
కర్నూలు జిల్లాలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తానని తాజాగా తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగంలో చూపిన కరుణ అంకెల్లో మాత్రం ఆయన చూపలేకపోయారు. అటు విజయవాడ గన్నవరంతో పాటు ఇటు తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా విస్తరణ కోసం బడ్జెట్‌లో నిధులను కేటాయించిన ప్రభుత్వం.. కర్నూలు విమానాశ్రయానికి మాత్రం తాజా బడ్జెట్‌లో ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. మొత్తం మీద కర్నూలు విమానాశ్రయం మీద ప్రభుత్వం శీతకన్ను వేసిందన్న అభిప్రాయం జిల్లా వాసుల్లో వ్యక్తమవుతోంది.
ఆశలు ఎగిరేనా..!
Published Sat, Mar 14 2015 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM
Advertisement
Advertisement