ఈసారికి ఇంతే!
జి.సిగడాం: విత్తనాల సరఫరాపై రైతులు పెట్టుకున్న ఆశలను అధికారులు వమ్ము చేశారు. జిల్లాలో అత్యధికంగా వినియోగించే 1001, స్వర్ణ రకం విత్తనాల సరఫరా ముగిసిపోయిందని, ఈ సీజనుకు ఇక ఆ విత్తనాలు సరఫరా కావని సాక్షాత్తు వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ బి.వి.ఎస్.సి.హరి స్పష్టం చేయడంతో రైతులు ఖంగుతిన్నారు. అరకొర విత్తనాలు సరఫరా చేసి.. అయిపోయిందంటే ఎలా అని అధికారులు నిలదీశారు. శనివారం వ్యవసాయ అధికారులు జి.సిగడాం వచ్చినప్పుడు ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
స్థానిక పీఏసీఎస్‌లో శుక్రవారం విత్తనాల సరఫరా సందర్భంగా రేగిన గందరగోళం.. అధికారులను రైతులు నిర్బంధించిన నేపథ్యంలో శనివారం ఉదయం వ్యవసాయ శాఖ జేడీ, తదితరులు ఇక్కడికి వచ్చారు. పీఏసీఎస్ విత్తన గిడ్డంగిని జేడీ పరిశీలించి విత్తనాల పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం రైతులనుద్దేశించి మాట్లాడుతూ జిల్లాకు 1001 రకం విత్తనాలు 17వేల క్వింటాళ్లు, స్వర్ణ రకం 3,932 క్వింటాళ్లు రాగా వాటిని ఇప్పటికే రైతులకు అందించామన్నారు. జి.సిగడాం మండలానికి సంబంధించిన 1001 రకం 430 క్వింటాళ్లు, సాంబమసూరి 387 క్వింటాళ్లు వచ్చాయని చెప్పారు. జిల్లాలో 1001, స్వర్ణ రకం విత్తనాలు ఇక సరఫరా చేయలేమన్నారు. రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల విత్తనాల సమస్య తలెత్తిందని పేర్కొన్నారు.
నిలదీసిన రైతులు
విత్తనాలు పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని చెప్పి ఇప్పుడు చేతులెత్తేయడమేమిటని పలువురు రైతులు అధికారులను నిలదీశారు. 1001, స్వర్ణ విత్తనాలపై జేడీ వ్యాఖ్యలపై విత్తనాల కోసం వచ్చిన కాయల రమణారావు, దుర్గాసి గౌరీ, రమణ, సీతంనాయుడులతోపాటు 10 గ్రామాలకు చెందిన రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాంతమంతా వర్షాధారమని 1001, స్వర్ణ రకానికే ఈ భూములు అనుకూలిస్తాయని మిగతా రకాలు పండవని వాపోయారు. ఎన్ని రాయితీలు ఇచ్చినా వేరే రకం విత్తనాలు వేసే పరిస్థితి లే దన్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మండలానికి ప్రత్యేకంగా 1001, స్వర్ణ విత్తనాలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
బందోబస్తు మధ్య విత్తనాల పంపిణీ
కాగా మండలానికి వచ్చిన 156 బస్తాల 1001 రకం విత్తనాలను పోలీస్ బందోబస్తు మధ్య శనివారం పంపిణీ చేశారు. శుక్రవారం ఈ విత్తనాల పంపిణీ చేపట్టగా వివాదం ఏర్పడ టంతో శనివారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఉదయం 7 గంటలకు స్థానిక వ్యవసాయ అధికారి కె.హైమావతి, సిబ్బంది సమక్షంలో పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు పాస్ పుస్తకంపై ఒక బస్తా చొప్పున పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ మోహనరావు, ఏడీ ఎన్.విద్య, తహశీల్దార్ ఎస్.మోహనరావు, ఎంపీడీవో కె.హేమసుందరరావు, ఏఈవోలు బి.పద్మావతి, శ్యామల సుధారాణి తదితరులు పాల్గొన్నారు.