ఆస్పత్రి నుంచి రోగికి విముక్తి
Published Sun, Sep 29 2013 3:35 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : చికిత్సకు అయిన డబ్బులు చెల్లించలేదని ఓ రోగిని ఆస్పత్రివర్గాలు నిర్బంధించిన సంఘటన హన్మకొండలో శనివారం వెలుగు చూసింది. అయితే సదరు ఆస్పత్రి వర్గాలు మాత్రం తాము ఏ రోగిని నిర్బంధించలేదని పేర్కొం టున్నారు. వివరాలిలా ఉన్నాయి. వరంగల్ ప్రాంతానికి చెందిన తుమ్మ కోటేశ్వర్‌రావు ఫ్రాంక్రియాస్ వ్యాధితో బాధపడుతూ సుబేదారిలో ఓ ఆస్పత్రిలో ఈ నెల 10న చేరారు. ఈ నెల 26న బిల్లులు చెల్లించి డిశ్చార్జీ కావాల్సిందిగా అతడికి ఆస్పత్రి వర్గాలు తెలి పాయి. అయితే తమ వద్ద అంతమొత్తంలో డబ్బు లేదని, తగ్గించాలని కోరినట్లు రోగి కోటేశ్వర్‌రావు విలేకరులకు వివరించారు. రూ.52 వేలు బిల్లు వేశారని, అంత బిల్లు చెల్లించలేనని తన వద్ద డబ్బులు లేవని చెప్పినా వినలేదన్నారు.
చివరకు తన భార్య పుస్తెల తాడు, చెవి కమ్మలు అమ్మగా రూ.40 వేలు వచ్చాయన్నారు. అందులో నుంచి రూ.30 వేలు చెల్లిస్తానని చెప్పినట్లు తెలిపారు. మిగతా రూ.5 వేలతో మందులు కొనుగోలు చేస్తానని, మరో రూ.5 వేలు కుటుంబ ఖర్చులకు అవసరమని వేడుకున్నట్లు వివరించాడు. మిగతా మొత్తానికి పోస్ట్ డేటెడ్ చెక్ ఇస్తానని చెప్పినా వదిలిపెట్టకుండా రాత్రిపూట బయటకు వెళ్లకుండా గురు, శుక్రవారాల్లో రాత్రి తనను రూంలో బంధించారని వాపోయాడు. పగలు మాత్రం డోర్ తీసిపెడుతున్నారని వివరించారు. శనివారం వచ్చి రూ.30 వేలు తీసుకెళ్లారని, అయినా మిగతా సొమ్ము చెల్లిస్తేనే ఆస్పత్రి నుంచి పంపిస్తామని చెప్పారన్నారు. తాను మునిసిపల్ కాంట్రాక్టర్‌నని తనకు బిల్లులు వచ్చేది ఉందన్నా రు. తాను చెక్ ఇస్తానని చెప్పిన వినలేదన్నారు. కనీసం తనకు రెండు రోజుల నుంచి ఆహారం కూడా ఇవ్వడం లేదన్నారు. తనను చూడలేక ఇతర వార్డుల్లో ఉన్న వారు రొట్టె ఇచ్చారని చెప్పారు. కాగా విలేకరులు వచ్చిన విషయం తెలుసుకున్న ఆస్పత్రి యాజమాన్యం తుమ్మ కోటేశ్వర్‌రావును ఎట్టకేలకు వదిలేసింది. ఈ విషయమై ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా తాము ఏ రోగిని బంధించలేదని చెప్పడం గమనార్హం.
Advertisement
Advertisement