ఇంతలోనే ఎంత మార్పు..! | 'Hospital sleep behavior change in the Kamineni | Sakshi
Sakshi News home page

ఇంతలోనే ఎంత మార్పు..!

Published Tue, Feb 24 2015 1:17 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

'Hospital sleep behavior change in the Kamineni

‘ఆస్పత్రి నిద్ర’లో కామినేని వ్యవహార శైలి మార్పు
వైద్యులను పాజిటివ్‌గా చూపాలని మీడియాను కోరిన వైనం
ప్రచారం కోసమే మంత్రి హడావుడి  అంటూ విమర్శలు
 

లబ్బీపేట : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ‘ఆస్పత్రి నిద్ర’ అంతా షోగా మారింది. ఆస్పత్రుల్లో మార్పు కోసమే ఈ కార్యక్రమం చేపట్టానని మంత్రి చెప్పారు. అయితే, వైద్య సేవల్లో మార్పు ఏమోగానీ.. మంత్రి వ్యవహరశైలిలో మాత్రం కచ్చితంగా మార్పు వచ్చింది. ప్రభుత్వాస్పత్రులకు వెళ్లగానే అక్కడి వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ... వైద్య రంగం భ్రస్టు పట్టిందని మండిపడే మంత్రి... ఇందుకు విరుద్ధంగా ‘ఆస్పత్రినిద్ర’లో వైద్యులు, వైద్య సేవల విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని మీడియాను కోరడమే ఇందుకు నిదర్శనం. పదే పదే నెగిటివ్‌గా చూపించడం వల్ల ప్రయోజనం లేదని, పాజిటివ్‌గా స్పందిస్తే, అదే స్ఫూర్తితో మరింత మెరుగైన సేవలు అందించగలరని మంత్రి కామినేని పేర్కొన్నారు.

‘ఆస్పత్రి నిద్ర’ కొనసాగిందిలా..

ఆదివారం రాత్రి 9.10 గంటలకు ప్రభుత్వాస్పత్రికి వచ్చిన మంత్రి క్యాజువాలిటీని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత డయోగ్నోస్టిక్ బ్లాక్‌లో ఎగ్జామినర్ల కోసం ఏర్పాటుచేసిన గదిలో నిద్రకు ఉపక్రమించారు. సోమవారం ఉదయం ఆరు గంటలకు నిద్రలేచిన మంత్రి కొద్దిసేపు దినపత్రికలు చదివారు. తమ సమస్యలపై ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన వినతిపత్రాలు స్వీకరించారు. ఏడు గంటల సమయంలో ఆస్పత్రిలో సిద్ధం చేసిన వేడి నీటితో స్నానం చేసి, ఆల్పాహారం తీసుకున్నారు. 7.15 గంటలకు ఆస్పత్రిలోని వార్డుల పరిశీలన ప్రారంభించారు. క్యాజువాలిటీ, అక్యుట్‌మెడికేర్, మెడికల్, ఆర్ధోపెడిక్ వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. మంత్రి వస్తున్నట్లు ముందుగానే తెలియడంతో వార్డులోని పడకలపై కొత్త బెడ్‌షీట్‌లు వేయడంతోపాటు ఎక్కడా పారిశుధ్య సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తాను వచ్చినప్పుడు మాత్రమే కాదని, రోజూ శానినేషన్ ఇలాగే ఉండాలని అధికారులకు మంత్రి చెప్పారు.

ఏసీ గదిలో ఉంటే సమస్యలు ఎలా తెలుస్తాయి..

ఆస్పత్రి వార్డులో గానీ, కనీసం ప్రొఫెసర్ల గదిలో గానీ మంత్రి నిద్రకు ఉపక్రమిస్తే రోగుల ఇబ్బందులు తెలుస్తాయని, గెస్ట్‌లు, ఎగ్జామినర్ల కోసం నిర్మించిన ఏసీ గదిలో ఉంటే సమస్యలు ఎలా కనిపిస్తాయనే విమర్శలు వినిపిస్తున్నారు. వార్డులో రోగుల మధ్య గంటసేపైనా ఉంటే దోమల పోటు, గాలిలేక ఉక్కపోతతో అల్లాడుతున్న వైనం అర్థమయ్యేదని కొందరు సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఆస్పత్రికి సమీపంలోనే మంత్రి ఇల్లు ఉందని,  రోజూ ఉదయం వచ్చి తనిఖీలు చేసి ఆస్పత్రిలో మార్పు తీసుకురావొచ్చని, ఇక్కడికి వచ్చి ఏసీ గదిలో నిద్రకు ఉపక్రమిస్తే ఫలితం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మంత్రి ‘ఆస్పత్రి నిద్ర’ కారణంగా సిబ్బంది అంతా ఆయన చుట్టూ హడావుడిగా ఉండటంతో పలువురు రోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ప్రచారార్భటమే! :‘ఆస్పత్రి నిద్ర’ప్రచారార్భటమేనని, ప్రయోజనం ఏమీ లేదనే వాదన వినిపిస్తోంది. మంత్రి వైఖరి కూడా ఇందుకు బలాన్నిస్తోంది. ఆదివారం రాత్రి ఆస్పత్రికి వచ్చిన వెంటనే ప్రెస్‌మీట్ పెట్టిన మంత్రి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు వార్డులు పరిశీలిస్తానని తెలిపారు. ఉదయం మీడియా ప్రతినిధులు ఆస్పత్రికి చేరుకున్న తర్వాతే వార్డుల పరిశీలన ప్రారంభించిన మంత్రి, మీడియా వాళ్లు వార్డుల నుంచి బయటకు రాగానే మంత్రి సైతం వచ్చేశారు. దీంతో మంత్రి ప్రచారానికే పెద్దపీట వేశారనే విమర్శలకు బలం చేకూరినట్టయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement