జిల్లాలో అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి అది. నిత్యం వైద్య సేవలు కోసం వందలాది మంది ఇక్కడకు వస్తారు. పేరుకు పెద్దాస్పత్రి అయినప్పటికీ ఇక్కడ అనేక సమస్యలు నెలకొన్నాయి. పరికరాలు లేక కొన్ని సేవలు అందడం లేదు. ఉన్నా...కొన్ని పరికరాలు మూలకు చేరడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి వేళ స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలున్నాయి. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ కె.సీతారామరాజు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. ఆస్పత్రిలో పలు వార్డులను, ఓపీ విభాగాలను పరిశీలించారు. రోగులు, వారి బంధువులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు.
సూపరింటెండెంట్: అమ్మా నాపేరు సీతారామరాజు. నేను సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను, సాక్షి తరఫున వీఐపీ రిపోర్టర్‌గా వచ్చాను. మీపేరేంటి, ఏసమస్యతో ఎక్కడకు వచ్చారు?
రోగి: నాపేరు లెంక రమణమ్మ సార్. మాది గజపతినగరం గ్రామం. బీపీ ఉందని ఇక్కడకు వచ్చాను
సూపరింటెండెంట్: డాక్టర్‌గారు వచ్చారా ?, బాగా చెక్ చేశారా?
రోగి రమణమ్మ: డాక్టర్‌గారు వచ్చారు. బాగానే చూశారు.
సూపరింటెండెంట్: డాక్టర్ గారు కసురుకుంటున్నారా ?, ప్రేమగా మాట్లాడుతున్నారా?
రమణమ్మ : బాగానే మాట్లాడుతున్నారు. కసురుకోవడం లేదు.
సూపరింటెండెంట్: ఏమ్మా మీదేఊరు? ఏసమస్యతో వచ్చారు?
రోగి : నాపేరు భవాని. మాది అయ్యన్నపేట గ్రామం సార్. కడుపునొప్పిగా ఉండడంతో వచ్చాను.
సూపరింటెండెంట్: చికిత్స ఏ విధంగా చేస్తున్నారు?
భవాని: చికిత్స బాగానే చేస్తున్నారు. మందులు కూడా ఇచ్చారు.
సూపరింటెండెంట్: బాబు మీదే గ్రామం. ఆస్పత్రికి ఎందుకు వచ్చారు?
రోగి: నాపేరు కె.రమేష్. మాది బీజే పాలెం గ్రామం. బీపీ ఉందని వచ్చాను.
సూపరింటెండెంట్: పారిశుద్ధ్యం ఏవిధంగా ఉంది. మరుగుదొడ్లులో నీటి సరఫరా ఉందా, సిబ్బంది ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా?
రమేష్: ఎవరూ డబ్బులు అడగలేదు. మరుగుదొడ్లలో నీరు వస్తోంది. పారిశుద్ధ్యం బాగానే ఉంది
సూపరింటెండెంట్ : ఏమ్మా మీది ఏ ఊరు. ఏ సమస్యతో ఇక్కడకు వచ్చావు?
రోగి : బాబు నా పేరు రెడ్డి కమలమ్మ. మాది చింతలవలస గ్రామం. పాము కరవడంతో ఇక్కడకు వచ్చాను.
సూపరింటెండెంట్: ఎప్పుడు కరిచింది, ఎన్ని గంటల్లోగా చేరారు, ఏవిధంగా వచ్చారు?
కమలమ్మ : గురువారం రాత్రి 7 గంటలకు పాము కరిచింది. రాత్రి 2 గంటలకు కేంద్రాస్పత్రికి వచ్చాను. 108 ద్వారా ఆస్పత్రికి వచ్చాను.
సూపరింటెండెంట్ : సిస్టర్ మీపేరేంటి, వార్డులో సమస్యలు ఏవైనా ఉన్నాయా?
సునీత స్టాఫ్ నర్స్ : సార్ నాపేరు సునీత. ఎమర్జెన్సీ వార్డులో ఏసీలు నెలరోజులుగా పనిచేయడం లేదు సార్. మెమోలు రాశాం. అయినా బాగు చేయలేదు.
సూపరింటెండెంట్ : రెండు మూడు రోజుల్లో ఏసీలు బాగు చేయిస్తాం. రోగులకు ఇబ్బంది కలగకుండా చూస్తాం.
సూపరింటెండెంట్ : డాక్టర్ మీ పేరేంటి. క్యాజువాలీటీలో సేవలు ఏవిధంగా అందిస్తున్నారు.
డాక్టర్: సార్ నాపేరు శర్మ. క్యాజువాలీటికి వచ్చిన వారికి సకాలంలో సేవలు అందిస్తున్నాం, సేవలు అందించడంలో ఏమాత్రం అలసత్వం వహించడం లేదు.
సూపరింటెండెంట్: బాబు ఆస్పత్రికి ఎందుకు వచ్చావు?
రోగి: సార్ డయాలసిస్ చేసుకుని ఇంటికి వెళుతుండగా బస్సు దిగినప్పుడు కాలు విరిగింది. చికిత్స చేయించుకోడానికి వచ్చాను.
సూపరింటెండెంట్ : ఇప్పుడే వచ్చావా. ఇంతకు మందు ఎప్పుడైనా వచ్చావా. వైద్యులు బాగాచూస్తున్నారా?
రోగి: ఇప్పటికి రెండు సార్లు వచ్చాను సార్. హెచ్‌ఐవీ ఉందని చెప్పి ముట్టుకోకుండా మందులు రాసి పంపిస్తున్నారు. బాధ భరించ లేకపోతున్నాను సార్.
సూపరింటెండెంట్: బాధపడుకు నీకు వైద్యం జరిగేలా చూస్తాను. హెచ్‌ఐవీ రోగులకు కూడా వైద్యం జరిగేలా చర్యలు తీసుకుంటాం.
సూపరింటెండెంట్ : డాక్టర్‌గారు మీపేరేంటి, మీ దగ్గరకు ఎంతమంది రోగులు వస్తారు. ఏయే వ్యాధులతో ఎక్కువ మంది వస్తారు?
డాక్టర్ సౌజన్య : సార్ నాపేరు సౌజన్య. రోజుకు 30 నుంచి 40 మంది వరకు పిల్లలు వస్తారు. ఎక్కువగా జ్వరాలు, జలుబు, దగ్గు, మరీ ముఖ్యంగా రక్తహీనతతో ఎక్కువ మంది వస్తున్నారు.
సూపరింటెండెంట్ : రక్తహీనతతో వచ్చే వారికి ఎటువంటి సూచనలు ఇస్తున్నారు?
డాక్టర్ సౌజన్య: అందుబాటులో ఉన్న ఆకుకూరలు, కాయగారులు, పండ్లు వంటి ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నాను.
సూపరింటెండెంట్ : డాక్టర్ గారు మీ పేరేంటి, నెలకు మీ దగ్గరకు ఎంతమంది మందుల కోసం వస్తుం టారు. మెరుగైన సేవలు అందించడానికి సౌకర్యాలు అదనంగా కావాలా?
డాక్టర్ : సార్ నా పేరు సత్యనారాయణ. నా దగ్గరకు మానసిక సమస్యలతో నెలకు 300 మంది వరకు వస్తారు. మరొక మానసిక వైద్యుడు, సోషల్ వర్కర్ కావాలి. మానసిక రోగులకు ప్రత్యేక వార్డు, ఎంఆర్‌ఐ స్కాన్, ఈసీటీ పరికరం కావాలి.
సూపరింటెండెంట్ : మానసిక వైద్యుడు, సోషల్ వర్కర్ నియామకం కోసం, ఎంఆర్‌ఐ స్కాన్ పరికరం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం. ప్రత్యేక వార్డు ఏర్పాటు చేస్తాం.
సూపరింటెండెంట్: బాబు నీ పేరేంటి ఎక్కడ నుంచి వచ్చాం. నీ సమస్య ఏంటి?
రోగి : సార్ నాపేరు మహేష్, మాది పద్మనాభం గ్రామం. నాకు సుగర్ వ్యాధి ఉంది. గత ఎనిమిదేళ్లుగా బాధపడుతున్నాను. నీరసంగా ఉంటుంది. నడవడానికి ఇబ్బందిగా ఉంది
సూపరింటెండెంట్ : పిల్లలో సుగర్ వ్యాధి రావడం చాలా అరుదు. ఇటువంటి పిల్లలకు చికిత్స అందించడానికి అవసరమైన అన్ని మందులు ఆస్పత్రిలో ఉన్నాయి.
సూపరింటెండెంట్ : మీపేరేంటి, అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారా?
జూనియర్ అనలిస్టు భువనేశ్వరావు : సార్ నాపేరు భువనేశ్వరరావు. అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తున్నాం.
సూపరింటెండెంట్ : మీకు ఏవైనా సౌకర్యాలు కావాలా?
భువనేశ్వరావు : మరుగుదొడ్లు, గదలు చాలక ఇబ్బంది పడుతున్నాం.
సూపరింటెండెంట్ : అదనంగా గదులు, మరుగుదొడ్లు నిర్మిస్తాం.
సూపరింటెండెంట్ : మీపేరేంటి, రోగులకు మెరుగైన సేవలు అందించడానికి మీకు ఏమైనా సౌకర్యాలు కావాలా?
ల్యాబ్ టెక్నీషయన్ : సార్ నాపేరు ఆచారి. ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాను. సెల్‌కౌంటర్, ఎలక్ట్రకల్ ఎనలేజర్ వంటి ఆధునాతన సౌకర్యాలు ఉంటే మెరుగైన వైద్య సేవలు అందించగలిగాం.
సూపరింటెండెంట్ : లేబరేటరీలో మెరుగైన సేవలు అందించడానికి అధునాతన పరికరాలు ఏర్పాటు చేస్తాం.
సూపరింటెండెంట్ : మీపేరేంటి, నెలకు ఎంత రక్తం సేకరిస్తున్నారు,
డాక్టర్ : సార్ నాపేరు సత్యశ్రీనివాస్. బ్లడ్‌బ్యాంక్‌లో నెలకు 300 యూనిట్ల వరకు రక్త సేకరణ చేస్తున్నాం. 600 యూనిట్ల వరకు రక్తం అవసరం పడుతుంది. రక్తదానంపై ఇంకా అవగాహన పెరగాల్సి ఉంది
సూపరింటెండెంట్ : మీపేరేంటి, ఇక్కడకు ఎందుకు వచ్చారు?
సామాజిక కార్యకర్త: సార్ నాపేరు రవూఫ్. నేను సామాజిక కార్యకర్తను.
సూపరింటెండెంట్: రక్తం కొరత తీర్చడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి?
రవూఫ్ : రక్తదానం ప్రస్తుతం జిల్లా కేంద్రానికే పరమితమైంది. అలా కాకుండా జిల్లాలో ఉన్న 34 మండలాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలి
సూపరింటెండెంట్ : 34 మండలాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటాను.
సూపరింటెండెంట్ : సిస్టర్ మీపేరేంటి, రాత్రి వేళల్లో ఆస్పత్రిలో అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలు ఉన్నాయి?
స్టాఫ్ నర్స్ : నాపేరు అనురాధ సార్, రాత్రి వేళల్లో అత్యవసర కేసులు గురించి మాట్లడానికి క్యాజువాలీటికి వెళతాం. ఆ తర్వాత వచ్చేస్తాం
సూపరింటెండెంట్ : కొంతమంది స్టాఫ్‌నర్స్‌లు రాత్రి వేళల్లో అందుబాటులో ఉండడం లేనట్టు తెలిసింది. ప్రతీ స్టాఫ్ నర్స్ వారికి కేటాయించిన వార్డుల్లో అందుబాటులో ఉండాలి.
సూపరింటెండెంట్ : బాబు నీపేరేంటి, ఎప్పుడు జాయిన్ అయ్యావు. ఏసమస్యతో వచ్చావు?
రోగి: సార్ నాపేరు మహేష్, కాలు విరగడంతో జనవరి నెలలో జాయిన్ అయ్యాను. ఇంతవరకు ఆపరేషన్ చేయలేదు.
సూపరింటెండెంట్: ఆపరేషన్ రెండు, మూడు రోజు ల్లో అయ్యేలా చర్యలు తీసుకుంటాం.
పెద్దాస్పత్రి.... సమస్యలతో కుస్తీ !
Published Sun, Mar 8 2015 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM
Advertisement
Advertisement