
చుట్టుగుంట సెంటర్ వద్ద వైన్ షాపు పైభాగంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ పోస్ట్‌మెట్రిక్ హాస్టల్
విద్యార్థులకు హాస్టల్ అవస్థలు తప్పడం లేదు. గుంటూరు నగరం నడిబొడ్డున చుట్టుగుంట ప్రాంతంలో ఓ వైన్‌షాపుపైన సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని నిర్వహించడం పలు విమర్శలకు తావిస్తోంది. అది కూడా పగిలిపోయిన రేకులతో, అపరిశుభ్రత వాతావరణంతో దర్శనమిస్తోంది. ఈ పోస్ట్‌మెట్రిక్ వసతిగృహం కలెక్టరేట్‌కు, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉండటం గమనార్హం.
లక్ష్మీపురం(గుంటూరు): పేద విద్యార్థుల ఉన్నత చదువులే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వసతి గృహం నిర్వహణలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. కనీస వసతులు లేని భవనానికి వేల రూపాయల అద్దెలు చెల్లిస్తున్నారు. తాగేందుకు నీరు, ఉండేందుకు సరైన నీడ లేక విద్యార్థులు అందులో కష్టాలు ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే... గుంటూరు నగరం నడిబొడ్డున చుట్టుగుంట ప్రాంతంలో ఓ వైన్‌షాపుపైన సాంఘిక సంక్షేమ వసతి గృహం నిర్వహిస్తున్నారు. భవనం పైభాగంలో పగిలిపోయిన రేకులు, అపరిశుభ్రతతో నడుస్తున్న ఈ పోస్ట్‌మెట్రిక్ వసతిగృహం కలెక్టరేట్‌కు, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాలకు కూతవేటు దూరంలోనే ఉంది. నిత్యం ఈ హాస్టల్ మీదుగానే రాష్ట్ర మంత్రులు, జిల్లా స్థాయి అధికారులు రాకపోకలు సాగిస్తుంటారు.
కాని ఈ హాస్టల్ వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ప్రభుత్వం ఈ వసతి గృహానికి నెలకు రూ.50 వేలు చెల్లిస్తోంది. నాలుగేళ్లుగా ఆ భవనంలో హాస్టల్ నడుపుతున్నారు. ఈ వసతి గృహంలో ఇంటర్ నుంచి పీజీ, ఇంజినీరింగ్, బీటెక్ విద్యార్థులు ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌లతో విద్యాభ్యాసం చేస్తూ, ఇక్కడ ఉంటారు. ఈ హాస్టల్ పర్యవేక్షణ అంతా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, జాయింట్ డైరెక్టర్ చూడాల్సి ఉంది. ఈ హాస్టల్‌లో 100 మంది విద్యార్థులకు వసతి గృహాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి జిల్లా వాసి అయినప్పటికీ ఈ హాస్టల్ దుస్థితి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం హాస్టల్ అని బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. అడిగే నాథుడు ఎవరూ లేకపోవడంతో ఏడాదికి రూ.6 లక్షలు అద్దె వసూలు చేస్తున్న భవన యజమాని కనీస మరమ్మతులు కూడా చేయించడంలేదు. మురుగు గురించి పట్టించుకోకుండా బ్లీచింగ్ చల్లి సరిపెడుతున్నారు. వర్షం పడితే పుస్తకాలు, దుస్తులు తడిచి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పైకప్పు రేకులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అవి ఎక్కడ ఊడిపడతాయోనని వణికిపోతున్నారు. మరుగుదొడ్లు, తాగునీటి వసతి లేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment