
పందుల బెడద.. పట్టించుకోరా?
అసెంబ్లీలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి
సాక్షి, కర్నూలు: కర్నూలులో పందుల బెడద గురించి ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కర్నూలులో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. వాటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పందుల సంచారం మామూలుగా ఉండదు. అక్కడి చిన్న పిల్లలున నోట కరుకుచుకుని వెళ్లిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఓ సారి అప్పుడు పుట్టిన శిశువును పంది నోట కరుచుకుని వెళ్లడంతో గాయపడిన ఆ పసిగుడ్డు అనంతరం చనిపోయింది.
మూడు సార్లు ఇలా పందులు పిల్లలను కరిచి గాయపరిచాయని, చర్యలు తీసుకోవాలని అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. అందుకే మరోసారి అసెంబ్లీలో చెప్పాల్సి వస్తోంది. కర్నూలు నగరంలోనూ ఈ సమస్య ఎక్కువగా ఉంది. కనిపిస్తే కాల్చి చంపాలనే ఉత్తర్వులు ఉన్నా.. అధికారులు ఆ మేర చర్యలు తీసుకోవడం లేదు. కనీసం మీరైనా చర్యలకు సిఫార్సు చేయాలని’ అన్నారు. అయితే సమస్య లేవనెత్తిన మంత్రి కామినేని శ్రీనివాస్ సరైన సమాధానం చెప్పకుండా.. కుక్కలకు కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయిస్తామన్నారు.
హాస్టళ్లు అధ్వానంగా ఉన్నాయి..
ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
ఆలూరు నియోజకవర్గంలో హాస్టళ్లు అధ్వానంగా ఉన్నాయని, వాటిలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కోరారు. గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో అయన మాట్లాడుతూ.. ‘నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ హాస్టళ్లు మొత్తం 18 ఉన్నాయి. వీటిలో బీసీ హాస్టళ్లు 8 ఉండగా.. అందులో ఐదు ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఎస్సీ వసతి గృహాలు 10 ఉండగా.. ఒకటి ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్నారు. అయితే ఈ హాస్టళ్లకు సరైన ప్రహరీలు లేవు.
మరుగుదొడ్ల సౌకర్యం లేదు. తాగునీటి సమస్య ఉంది. ఇక ప్రభుత్వ భవనాలు సైతం శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటి స్థానంలో కొత్తగా భవనాలు నిర్మించాలి. విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామంటున్న ఒకవైపు ప్రభుత్వం చెబుతున్నా.. హాస్టళ్ల దుస్థితి చూస్తే ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానించాల్సిన పరిస్థితి. ఇక హాస్టళ్లలో విద్యార్థులకు సన్న బియ్యం సరఫరా చేస్తామంటున్నారు కానీ.. ఇప్పటికీ వారికి రేషన్ బియ్యమే వండిపెడుతున్నారు. ఇది దారుణం’ అని ఎమ్మెల్యే జయరాం ప్రశ్నించారు. ఇందుకు మంత్రి రావెల కిషోర్‌బాబు స్పందిస్తూ నిధులు విడుదల చేసి హాస్టళ్లను నిర్మిస్తామని చెప్పారు.