ఎరగా విసిరింది 12 పదినోట్లు..ఎగరేసుకుపోయింది 12 లక్షలు
కాకినాడ క్రైం : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ స్థానిక మెయిన్‌రోడ్‌లో బుధవారం సినీ ఫీక్కీలో చోరీ జరిగింది. రూ.పది నోట్లు కారు వద్ద చల్లిన దొంగ కారు లోపల రూ.12 లక్షలతో ఉన్న బ్యాగ్‌ను పట్టుకుని ఉడాయించాడు. బాధితుడైన వ్యాపారి, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ శాంతినగర్‌కు చెందిన కొండాపు సూర్యనారాయణరెడ్డి హోటల్ వ్యాపారం చేస్తుంటాడు.
అతడు పద్మాలయ గృహమందిర్ యజమానికి రూ.12 లక్షలు ఇవ్వడానికి బుధవారం ఉదయం 11 గంటలకు మెయిన్ రోడ్డులోని శ్రీనికేతన్ వద్దకు వచ్చాడు. ఈ లోపు ఓ ఆగంతకుడు కారు చుట్టూ రూ.పది కొత్త నోట్లు చెల్లాచెదురుగా పడేశాడు. అప్పటికీ సూర్యనారాయణరెడ్డి కారు డోరు కూడా తెరవకుండా తాను డ్రైవర్ సీట్‌లో, సొమ్ములు తెచ్చిన బ్యాగును ఆ పక్కసీటులో పెట్టి కూర్చున్నాడు.
ఆగంతకుడు ఇంతలో కారు తలుపు తట్టడంతో సూర్యనారాయణరెడ్డి తలుపు తెరిచాడు. అప్పటికే కిందపడేసిన రూ.పది నోట్లు చూపిన ఆగంతకుడు ‘మీ డబ్బులే.. కింద పడిపోయాయి.. తీసుకోండి..’ అన్నాడు. సూర్యనారాయణరెడ్డి చెల్లాచెదురుగా పడి ఉన్న నోట్లను తీస్తుండగా ఆగంతకుడు కారులోని నగదు బ్యాగ్ కాజేసి పరారయ్యాడు. కిందపడి ఉన్న 12 నోట్లను జేబులో పెట్టుకున్న సూర్యనారాయణరెడ్డి తీరా చూస్తే కారులోని నగదు బ్యాగ్ కనబడలేదు. చుట్టుపక్కల గాలించినా ఆగంతకుడి జాడలేదు. విషయం తెలిసిన స్థానికులూ అతడికి తోడైనా ఫలితం లేకపోయింది. దీంతో సూర్యనారాయణరెడ్డి టూ టౌన్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టూ టౌన్ సీసీఎస్ ఎస్సై ఎం.జానకీరామ్ కేసు నమోదు చేశారు. కాకినాడ క్రైం డీఎస్పీ పిట్టా సోమశేఖర్, ఎస్‌డీపీఓ సూర్యదేవర వెంకటేశ్వరరావు, టూ టౌన్ ఎస్‌హెచ్‌ఓ డీఎస్ చైతన్యకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఏమరుపాటుగా ఉండొద్దు : డీఎస్పీ
బ్యాంకులు, ఇతర ప్రాంతాల్లో డబ్బు పట్టుకు వెళ్లే వారి దృష్టిని మళ్లించడానికి దుండగులు రకరకాల ఎత్తులు వేస్తారని, అందుకే ఏమరుపాటుగా ఉండరాదని క్రైం డీఎస్పీ సోమశేఖర్ సూచించారు. పరిచయం లేని వ్యక్తులు మాటకలిపేందుకు ప్రయత్నిస్తే వెంటనే విషయం పసిగట్టాలన్నారు. మహిళల మెడల్లో బంగారు ఆభరణాల చోరీకి కూడా ఇదే కారణమన్నారు.
తమిళనాడు, నగరి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ముఠాలు ఇలాంటి చోరీలు, దోపిడీలకు పాల్పడుతున్నట్టు అనుమానిస్తున్నామన్నారు. అనుమానం కలిగేలా ప్రవర్తించే వారి గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. వ్యాపారులు అధిక మొత్తంలో ఒంటరిగా సొమ్మును తరలించడం, మహిళలు ఆభరణాలు మెడలో వేసుకుని ఒంటరిగా తిరగడం శ్రేయస్కరం కాదన్నారు.