Bag missing
-
Vizag: పోగొట్టుకున్న విలువైన బ్యాగు.. గంటల వ్యవధిలో
విశాఖపట్నం: మహిళ పోగొట్టుకున్న విలువైన బ్యాగును గంటల వ్యవధిలో చేధించి తిరిగి ఆమెకు విశాఖపట్నం నగర పోలీసులు అందించారు. బుధవారం సాయింత్రం సుమారు 04.30 గంటల సమయంలో కే.భారతి అనే మహిళ భీమిలి నగరంపాలెం నుంచి ఎం.వీ.పీ సర్కిల్ వరకు ఒక పాసింజర్ ఆటో ఎక్కింది. సర్కిల్ వద్ద ఆటో దిగే సమయంలో తనతో పాటు తెచ్చిన బ్యాగును తీసుకోవడం మర్చిపోయి , కొంత సమయం తర్వాత ఆమె బ్యాగును మర్చిపోయినట్లు గుర్తించి చుట్టుప్రక్కల ఆటో కోసం వెతుకగా కనపడకపోవడంతో ఎం.వీ.పీ క్రైమ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ బ్యాగులో 5 తులాల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి వస్తువులు, 18,000 నగదు ఉన్నాయని తెలిపారు. తక్షణం స్పందించి.. ఆమె తెలిపిన వివరాలు ఆధారంగా కానిస్టేబుల్ పీ.హరి, అప్పుఘర్ ఆటో స్టాండ్‌లో ఉండే దూడ సత్యనారాయణ అనే ఒక ఆటో డ్రైవర్ సహాయంతో సదరు ఆటోను కనిపెట్టారు. సదరు ఆటో డ్రైవర్ ఆర్. కొండలరావు అలియాస్ రాజు కూడా స్వచ్ఛందంగా బ్యాగ్‌ను అప్పగించడానికి వస్తున్నట్లు తెలిపారు. గురువారం అడిషనల్ డీజీపీ, కమీషనర్ ఆఫ్ పోలీస్ అండ్ అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ డా. ఏ.రవి శంకర్ చేతుల మీదుగా బాధితురాలికు ఆమె బ్యాగును అందజేసి , బ్యాగ్ కనిపెట్టడంలో ప్రతిభ కనబర్చిన ఎంవీపీ కానిస్టేబుల్ పి.హరిని మెరిట్ సర్టిఫికెట్ ఇచ్చి అభినందించారు. అదే విధంగా బ్యాగును కనిపెట్టడంలో సహాయం చేసిన సత్యనారాయణ, స్వచ్ఛందంగా బ్యాగును అప్పగించిన రాజును ప్రత్యేకంగా అభినందించి క్యాష్ రివార్డులు అందజేశారు. చదవండి: ఈనాడు ట్యాబ్ కథనంపై మంత్రి బొత్స ఫైర్ -
Hyderabad: రెండు కేజీల బంగారు నగల బ్యాగు మిస్సింగ్
హైదరాబాద్: నగరంలో భారీ ఎత్తున్న బంగారం అదృశ్యమైన కేసు నమోదు అయ్యింది. ముంబై నుంచి తీసుకొస్తున్న రెండు కేజీల బంగారు నగల బ్యాగ్ మాయమైంది. దీంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. ముంబై బోరివాలి(ముంబై) నుంచి ఆభరణాలు ఉన్న బ్యాగుతో సోమవారం ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్ బస్సులో బయలుదేరారు. అమీర్‌పేట్ వచ్చేసరికి మెలుకువ రావడంతో చూడగా.. బ్యాగ్ కనిపించలేదు. దీంతో విషయాన్ని ముంబైలోని నగలవ్యాపారికి తెలియజేశారు. అతను సైఫాబాద్ పోలీసులను ఆశ్రయించగా.. కేసును పంజగుట్ట పోలీసులకు బదలాయించారు. కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కే నాగయ్య.. బృందాలుగా విడిపోయిన పోలీసులు బోరివాలి-హైదరాబాద్ మధ్య సీసీటీవీఫుటేజీల ఆధారంగా కేసును చేధించే పనిలో నిమగ్నమయ్యారు. -
‘బంగారు’ బ్యాగు కథ సుఖాంతం!
అనంతపురం , గుంతకల్లు: రైలు ప్రయాణం చేస్తూ బ్యాగు పోగొట్టుకున్న దంపతులకు తిరిగి ఆ బ్యాగును ఆర్పీఎఫ్ పోలీసులు అప్పగించిన ఘటన గురువారం గుంతకల్లులో చోటు చేసుకుంది. సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను ఆ దంపతులకు అప్పగించారు. ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాసరావు తెలిపిన మేరకు.. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన రమేష్ లక్ష్మీనరసయ్య, ప్రసన్న దంపతులకు ఈ యేడాది నవంబర్ 21న వివాహమైంది. రమేష్ మహారాష్ట్రలోని పూణె నగరంలో విమానగర్లో ఉన్న ఐటీ కంపెనీలో క్యాంటీన్ నిర్వహిస్తున్నాడు. రమేష్ దంపతుల స్వగ్రామం కనిగిరి. వివాహానంతరం అత్తగారింట్లో పండుగ ముగించుకున్న రమేష్ దంపతులు పూణె నగరానికి వెళ్లడానికి కోయంబత్తూరు – లోకమాన్యతిలక్ టెర్మినల్ (రైలు నం–11014) కుర్లా ఎక్స్‌ప్రెస్ రైలుకు టిక్కెట్లు రిజర్వేషన్ చేయించుకున్నారు. బుధవారం కనిగిరి నుంచి హుబ్లీ ప్యాసింజర్ రైలులో బయలుదేరి రాత్రి 9.30 గంటల ప్రాంతంలో గుంతకల్లు రైల్వే జంక్షన్ చేరుకున్నారు. గుంతకల్లు నుంచి కుర్లా ఎక్స్‌ప్రెస్ రైలులో పూణె నగరానికి వెళ్లాల్సి ఉంది. అయితే రమేష్ దంపతులు పొరపాటున కుర్లా ఎక్స్‌ప్రెస్ రైలుకు బదులుగా బెంగుళూరు – ముంబై ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలు (నం–11302) రాత్రి 12.30 గంటల సమయంలో ఎక్కారు. వీరిని రైలులో విధి నిర్వహణలో ఉన్న టీటీఈ ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. కుర్లా ఎక్స్‌ప్రెస్ రైలేనా? కాదు ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలు అని చెప్పడంతో రమేష్ దంపతులు హడావుడిగా రైలు నుంచి దిగారు. రైలు దిగే సమయంలో రమేష్ దంపతులు తీసుకొచ్చిన 6 లగేజ్ బ్యాగుల్లో పొరపాటున ఒక దాన్ని ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లోనే వదిలేశారు. వదిలేసిన బ్యాగులో సుమారు 20 తులాల బంగారం, అర కిలో వెండి ఆభరణాలతో పాటు రూ.15 వేల నగదు ఉందంటూ లబోదిబోమన్నారు. స్టేషన్‌లోని ప్లాట్‌ఫారంపై కన్నీరు మున్నీరవుతున్న రమేష్ దంపతులను ఆర్పీఎఫ్ ఎస్ఐ హర్షవర్ధన్ విచారించారు. అప్రమత్తమైన ఎస్ఐ హర్షవర్ధన్ ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ క్రైం పార్టీ హెడ్ కానిస్టేబుల్ దేవప్రకాష్, కానిస్టేబుల్ ఈరే‹ష్‌లకు బ్యాగు గురించి సమాచారం అందించారు. వారు రైలంతా గాలించి ఆఖరికి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. రమేష్ దంపతులను గురువారం ఉదయం 6.30 గంటల సమయంలో ఆర్పీఎఫ్ పోలీసుస్టేషన్‌కు పిలిపించి పోగొట్టుకున్న బ్యాగును అందజేశారు. సంతోషంగా ఉంది ఒక రైలుకు బదులు మరొక రైలు ఎక్కి బంగారం, వెండి ఆభరణాలు, నగదు ఉన్న బ్యాగు పోగొట్టుకోవడం ఎంతో బాధ కల్గించింది. ఆర్పీఎఫ్ పోలీసుల చాకచక్యం, అప్రమత్తతో 6 గంటల్లోనే మా ఆభరణాలు దొరకడంతో చాలా సంతోషంగా ఉంది.–రమేష్ లక్ష్మీనరసయ్య దంపతులు -
ఆటో డ్రైవర్ నిజాయితీ
కూసుమంచి: హైదరాబాద్ వెళుతున్న ఓ మహిళ తన బ్యాగును పాలేరు ప్రాంతంలో పోగొట్టుకోగా అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌కు బ్యాగ్ దొరకగా పోలీసుల ద్వారా ఆమెకు అందించి తన నిజాయితీని చాటుకున్నాడు. వివరాలిలా ఉన్నా యి. నల్గొండ జిల్లా తిప్పర్తి గ్రామానికి చెందిన మంగమ్మ అనే మహిళ హైదరాబాద్‌లో ఉంటోంది. తన యజమాని కుటుంబ సభ్యులతో కలిసి ఖమ్మం రాగా, ఆమె కూడా వారితో వచ్చింది. తిరిగి ఈ నెల 1వ తేదీ రాత్రి కారులో హైదరాబాద్ బయలుదేరారు. ఈ క్రమంలో పాలేరు సమీపంలోకి రాగానే ఒకరికి వాంతుల కావడంతో కారును రోడ్డుపక్కన నిలిపారు. ఈ క్రమంలో మంగమ్మ కారు దిగుతుండగా తన చేతిలోని బ్యాగు కిందపడి పోయింది. దీన్ని ఆమె గమనించలేదు. వారు తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. అటువైపు నుంచి వస్తున్న పాలేరుకు చెందిన ఆటో డ్రైవర్ దాట్ల నాగరాజుకు బ్యాగు దొరకగా, పోలీసులకు అప్పగించాడు. బ్యాగులోని ఫోన్నంబర్ల ఆధారంగా బ్యాగు మంగమ్మదిగా గుర్తించి ఆమెకు ఎస్ఐ రఘు సమాచారం అందించారు. ఆదివారం ఎస్ఐ సమక్షంలో బ్యాగును ఆమెకు అందజేశారు. బ్యాగులో ఆరు తులాల బంగారు వస్తువులతో పాటు సెల్ఫోన్లు, కొంత నగదు ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. తనకు దొరికిన బ్యాగును నిజాయితీగా అప్పగించిన ఆటో డ్రైవర్ నాగరాజును ఎస్ఐ, సిబ్బంది అభినందించారు. బాధితురాలు కృతజ్ఞతలు తెలిపింది. -
ప్రయాణికులు పోగొట్టుకున్న బ్యాగు అందజేత
వికారాబాద్: రైలులో ఓ బ్యాగు అనుమానస్పదంగా కనిపించడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు బ్యాగును పరిశీలించి ప్రయాణికులు దానిని పోగొట్టుకున్నట్టు గుర్తించి చివరికి వారికి అందజేశారు. వికారాబాద్ ఆర్పీఎఫ్ ఎస్సై ఎంబీ. రాథోడ్ కథనం ప్రకారం వివరాలు.. విశాఖపట్నం నుంచి ముంబయి వెళ్లే ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం మధ్యాహ్నం సమయంలో కాజీపేట రైల్వేస్టేషన్లో భార్గవ్ కుటుంబం ముంబయి వెళ్లడానికి రైలు ఎక్కింది. వీరు బీ2లో సీట్లు బుక్ చేసుకోగా రైలు ఎక్కిన సమయంలో బీ1లో ఎక్కారు. అక్కడి నుంచి బీ2లోకి వచ్చి తమ సీట్లలో కూర్చున్నారు. ఈ క్రమంలో లగేజ్‌లో నుంచి ఒక బ్యాగును బీ1లోనే మరిచిపోయారు. రైలు సికింద్రాబాద్ దాటి వికారాబాద్ వస్తుండగా కొందరు ప్రయాణికులు బ్యాగ్ అనుమానస్పదంగా ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వికారాబాద్‌కు రైలు చేరుకోగానే ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు బ్యాగును స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అందులో పది తులాల వరకు బంగారు ఆభరణాలు, దుస్తులతోపాటు ఓ వివాహ ఆహ్వాన పత్రిక లభించింది. పెండ్లికార్డులో ఉన్న నంబర్‌కు ఫోన్ చేసి బ్యాగు పోగొట్టుకున్న వారి వివరాలు సేకరించారు. అనంతరం వారికి ఫోన్ చేసి బ్యాగు వికారాబాద్ పీఎస్‌లో ఉందని వారికి తెలియజేశారు. దీంతో వారు మంగళవారం వికారాబాద్ ఆర్పీఎఫ్ పీఎస్‌కు చేరుకోగా పోలీసులు భార్గవ్‌కు చెందిన విలువైన వస్తువులతో కూడిన బ్యాగును అందజేశారు. ఈ సందర్భంగా భార్గవ్ పోలీసులకు «కృతజ్ఞతలు తెలిపి ఆనందం వ్యక్తం చేశారు. రైలులో ప్రయాణిస్తున్నపుడు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై రాథోడ్ సూచించారు. -
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బ్యాగు మాయం
శంషాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి బ్యాగు మాయమైంది. బుధవారం ఉదయం ముంబై నుంచి శంషాబాద్‌కు వచ్చిన అబ్బసలాం అనే వ్యక్తి బ్యాగు కనిపించక పోవడంతో అతను ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాగులో పాస్‌పోర్ట్, సెల్‌ఫోన్, విలువైన వస్తువులు ఉన్నాయని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు సీసీ ఫుటేజీను పరిశీలిస్తున్నారు. -
ఎరగా విసిరింది 12 పదినోట్లు..ఎగరేసుకుపోయింది 12 లక్షలు
కాకినాడ క్రైం : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ స్థానిక మెయిన్రోడ్లో బుధవారం సినీ ఫీక్కీలో చోరీ జరిగింది. రూ.పది నోట్లు కారు వద్ద చల్లిన దొంగ కారు లోపల రూ.12 లక్షలతో ఉన్న బ్యాగ్‌ను పట్టుకుని ఉడాయించాడు. బాధితుడైన వ్యాపారి, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ శాంతినగర్‌కు చెందిన కొండాపు సూర్యనారాయణరెడ్డి హోటల్ వ్యాపారం చేస్తుంటాడు. అతడు పద్మాలయ గృహమందిర్ యజమానికి రూ.12 లక్షలు ఇవ్వడానికి బుధవారం ఉదయం 11 గంటలకు మెయిన్ రోడ్డులోని శ్రీనికేతన్ వద్దకు వచ్చాడు. ఈ లోపు ఓ ఆగంతకుడు కారు చుట్టూ రూ.పది కొత్త నోట్లు చెల్లాచెదురుగా పడేశాడు. అప్పటికీ సూర్యనారాయణరెడ్డి కారు డోరు కూడా తెరవకుండా తాను డ్రైవర్ సీట్లో, సొమ్ములు తెచ్చిన బ్యాగును ఆ పక్కసీటులో పెట్టి కూర్చున్నాడు. ఆగంతకుడు ఇంతలో కారు తలుపు తట్టడంతో సూర్యనారాయణరెడ్డి తలుపు తెరిచాడు. అప్పటికే కిందపడేసిన రూ.పది నోట్లు చూపిన ఆగంతకుడు ‘మీ డబ్బులే.. కింద పడిపోయాయి.. తీసుకోండి..’ అన్నాడు. సూర్యనారాయణరెడ్డి చెల్లాచెదురుగా పడి ఉన్న నోట్లను తీస్తుండగా ఆగంతకుడు కారులోని నగదు బ్యాగ్ కాజేసి పరారయ్యాడు. కిందపడి ఉన్న 12 నోట్లను జేబులో పెట్టుకున్న సూర్యనారాయణరెడ్డి తీరా చూస్తే కారులోని నగదు బ్యాగ్ కనబడలేదు. చుట్టుపక్కల గాలించినా ఆగంతకుడి జాడలేదు. విషయం తెలిసిన స్థానికులూ అతడికి తోడైనా ఫలితం లేకపోయింది. దీంతో సూర్యనారాయణరెడ్డి టూ టౌన్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టూ టౌన్ సీసీఎస్ ఎస్సై ఎం.జానకీరామ్ కేసు నమోదు చేశారు. కాకినాడ క్రైం డీఎస్పీ పిట్టా సోమశేఖర్, ఎస్డీపీఓ సూర్యదేవర వెంకటేశ్వరరావు, టూ టౌన్ ఎస్హెచ్ఓ డీఎస్ చైతన్యకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏమరుపాటుగా ఉండొద్దు : డీఎస్పీ బ్యాంకులు, ఇతర ప్రాంతాల్లో డబ్బు పట్టుకు వెళ్లే వారి దృష్టిని మళ్లించడానికి దుండగులు రకరకాల ఎత్తులు వేస్తారని, అందుకే ఏమరుపాటుగా ఉండరాదని క్రైం డీఎస్పీ సోమశేఖర్ సూచించారు. పరిచయం లేని వ్యక్తులు మాటకలిపేందుకు ప్రయత్నిస్తే వెంటనే విషయం పసిగట్టాలన్నారు. మహిళల మెడల్లో బంగారు ఆభరణాల చోరీకి కూడా ఇదే కారణమన్నారు. తమిళనాడు, నగరి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ముఠాలు ఇలాంటి చోరీలు, దోపిడీలకు పాల్పడుతున్నట్టు అనుమానిస్తున్నామన్నారు. అనుమానం కలిగేలా ప్రవర్తించే వారి గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. వ్యాపారులు అధిక మొత్తంలో ఒంటరిగా సొమ్మును తరలించడం, మహిళలు ఆభరణాలు మెడలో వేసుకుని ఒంటరిగా తిరగడం శ్రేయస్కరం కాదన్నారు.