బ్యాగును అందజేస్తున్న నాగరాజు
కూసుమంచి: హైదరాబాద్ వెళుతున్న ఓ మహిళ తన బ్యాగును పాలేరు ప్రాంతంలో పోగొట్టుకోగా అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌కు బ్యాగ్ దొరకగా పోలీసుల ద్వారా ఆమెకు అందించి తన నిజాయితీని చాటుకున్నాడు. వివరాలిలా ఉన్నా యి. నల్గొండ జిల్లా తిప్పర్తి గ్రామానికి చెందిన మంగమ్మ అనే మహిళ హైదరాబాద్‌లో ఉంటోంది.
తన యజమాని కుటుంబ సభ్యులతో కలిసి ఖమ్మం రాగా, ఆమె కూడా వారితో వచ్చింది. తిరిగి ఈ నెల 1వ తేదీ రాత్రి కారులో హైదరాబాద్ బయలుదేరారు. ఈ క్రమంలో పాలేరు సమీపంలోకి రాగానే ఒకరికి వాంతుల కావడంతో కారును రోడ్డుపక్కన నిలిపారు. ఈ క్రమంలో మంగమ్మ కారు దిగుతుండగా తన చేతిలోని బ్యాగు కిందపడి పోయింది.
దీన్ని ఆమె గమనించలేదు. వారు తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. అటువైపు నుంచి వస్తున్న పాలేరుకు చెందిన ఆటో డ్రైవర్ దాట్ల నాగరాజుకు బ్యాగు దొరకగా, పోలీసులకు అప్పగించాడు. బ్యాగులోని ఫోన్‌నంబర్ల ఆధారంగా బ్యాగు మంగమ్మదిగా గుర్తించి ఆమెకు ఎస్‌ఐ రఘు సమాచారం అందించారు.
ఆదివారం ఎస్‌ఐ సమక్షంలో బ్యాగును ఆమెకు అందజేశారు. బ్యాగులో ఆరు తులాల బంగారు వస్తువులతో పాటు సెల్‌ఫోన్లు, కొంత నగదు ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. తనకు దొరికిన బ్యాగును నిజాయితీగా అప్పగించిన ఆటో డ్రైవర్ నాగరాజును ఎస్‌ఐ, సిబ్బంది అభినందించారు. బాధితురాలు కృతజ్ఞతలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment