కథ అడ్డం తిరిగింది..
ఆటో డ్రైవర్ మృతిలో కొత్త మలుపు
భార్యే ప్రియుడితో కలసి చంపిందని బంధువుల ఆరోపణ
పారిపోతుండగా పట్టుకుని పోలీసులకు అప్పగింత
తొండంగి: కథ అడ్డం తిరిగింది.. ఐదు రోజుల కిందట జరిగిన ఆటో డ్రైవర్ మృతి కేసులో కొత్త కోణం బయట పడింది.. భార్యే ప్రియుడితో కలసి చంపిందని బంధువులు అనుమానిస్తుండగా, వారిద్దరూ పారిపోతుండగా బంధువులు, గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తొండంగి మండలం ఏవీ నగరంలో గురువారం చర్చనీయాంశమైంది. మృతుని సోదరుడు, సోదరి, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఏవీ నగరం గ్రామానికి చెందిన బత్తిన మధుబాబు (38)కు ఇదే గ్రామానికి చెందిన అతని మేనమామ డేగల ప్రకాష్ కుమార్తె శిరీషతో 2014లో వివాహం జరిగింది.
వీరికి ఆరేళ్ల జాయ్ అనే పాప ఉంది. ఆటో డ్రైవర్‌గా మధుబాబు జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి తమ్ముడు కిషోర్, చెల్లెలు ఝాన్సీరాణి ఉన్నారు. తల్లిదండ్రులు చాలాకాలం కిందట మృతి చెందారు. కాగా కిషోర్ కాకినాడ ఆర్టీసీలో మెకానిక్‌గా చేస్తున్నాడు. శిరీష నర్సుగా కొంత కాలం కిందట కత్తిపూడి రిఫరల్ ఆస్పత్రిలో పనిచేసింది. అక్కడ పనిచేసిన సమయంలో శంఖవరం మండలం శృంగవరం గ్రామానికి చెందిన పీతల ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలిసిన మధుబాబుకు, శిరీషల మధ్య తరచూ మనస్పర్థలు వచ్చాయి.
దీంతో భర్తను విడిచి శిరీష హైదరాబాద్‌లో చెల్లెలు ఇంటికి కుమార్తెను తీసుకుని వెళ్లిపోయింది. 20 రోజుల కిందట శిరీష హైదరాబాద్‌లో కుమార్తె జాయ్‌ను ఉంచి మళ్లీ ఏవీ నగరంలోని మధుబాబు ఇంటికి వచ్చింది. ఈ నెల 17న మధుబాబుకు బీపీ తక్కువగా ఉందని కత్తిపూడిలో రిఫరల్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు శిరీష 18న కాకినాడలో ఉంటున్న మరిది కిషోర్‌కు తెలిపింది. దీంతో ఏవీ నగరంలో తన స్నేహితుడిని ఆస్పత్రికి వెళ్లమని చెప్పి అనంతరం కిషోర్ ఆస్పత్రికి చేరుకున్నాడు. అనంతరం మధుబాబుకు పలు పరీక్షలు చేయాలని వైద్యులు సూచించడంతో శుక్రవారం ఏవీ నగరంలో ఇంటికి వచ్చారు. ఆ రోజంతా ఆరోగ్యంగానే మధుబాబు గ్రామంలో తిరిగాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
శనివారం ఉదయం చనిపోయాడని శిరీష అతని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారంతా కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. మధుబాబు ఒంటిపై గాయాలున్నట్టు కిషోర్ చూసి శిరీష ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో ఐదు రోజుల అనంతరం బుధవారం అర్ధరాత్రి శిరీషతో అక్రమ సంబంధం ఉన్న పీతల ప్రశాంత్ గ్రామంలోకి రావడం, వీరిద్దరూ పారిపోతుండగా పట్టుకున్నామని మృతుని సోదరుడు కిషోర్, చెల్లెలు భర్త చిన్న తెలిపారు. పట్టుబడిన వారిని పోలీసులకు అప్పగించారు. అక్రమ సంబంధం కారణంగా ప్రియునితో కలసి తన అన్నను హతమార్చారని కిషోర్, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధుబాబు మృతి మిస్టరీగా మారింది.
అనుమానాస్పద మృతిగా కేసు
ఏవీ నగరంలో మధుబాబు మృతిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్టు ఎస్సై జగన్మోహన్‌రావు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహిస్తామన్నారు. కేసు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment