అన్నవరం (తూర్పుగోదావరి జిల్లా) : పెట్టింది తిని, మారు మాట్లాడకుండా డబ్బులిచ్చి పోవాల్సిందే మరి ఆ హోటల్‌కి వెళ్తే! ఆ హోటల్ తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆలయానికి సమీపంలో ఉంది. శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన 20మంది భక్తులు అన్నవరం వెళ్లారు. ఈ క్రమంలోనే ఆలయానికి సమీపంలోని ఒక హోటల్‌లో భోజనం చేసేందుకు వెళ్లారు. అయితే భోజనం సరిగా లేకపోవడంతో భక్తులు సదరు హోటల్ యజమానిని నిలదీశారు. దీంతో హోటల్ యజమాని సిబ్బందితో కలిసి భక్తులపై దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.