బిల్డింగ్ ప్లాన్..ఇక ఆన్‌లైన్
పట్టణ ప్రణాళిక విభాగంలో సంస్కరణలకు తెరలేస్తోంది. ఇళ్లు, భవన నిర్మాణాలకు సంబంధించిన ప్లాన్ల మంజూరులో జాప్యాన్ని నివారించే దిశగా పురపాలక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇదే సందర్భంలో లంచాలకు అలవాటుపడిన అధికారులు, సిబ్బందిని గాడిలో పెట్టడంతోపాటు జవాబుదారీతనాన్ని, ఖజానాకు సమకూరే ఆదాయూన్ని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. అన్నీ అనుకూలిస్తే ప్లాన్లను అక్టోబర్ రెండో వారం నుంచి ఆన్‌లైన్ ద్వారా మంజూరు చేయూలనే యోచనలో ఉంది.
ఏలూరు : ‘ఇల్లు కట్టిచూడు...’ అనేది సామెత. ఇల్లు కట్టడం ఒక ఎత్తయితే.. ముందుగా ప్లాన్ అప్రూవల్ కోసం మునిసిపల్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరగక తప్పదు. ఇది లేదు.. అది లేదు.. ఆ వివరాలు ఇవ్వండి.. అంటూ అక్కడి ఉద్యోగులు చెప్పే మాటలతో ఇల్లు కట్టుకునేవాళ్లు పడే అవస్థలు అన్నీఇన్నీ కావు. అక్కడ కాసులిస్తే పనులు చకచకా నడిచిపోతాయని.. లేదంటే తికమక పెట్టేస్తారనే విషయాన్ని చాలామంది చెబుతుంటారు. ఇకపై ఇల్లు కట్టుకునే వారికి ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పురపాలక శాఖ భావిస్తోంది. ఇందుకోసం ఆన్‌లైన్ విధానాన్ని అమలుచేసే యోచనలో ఉంది. తద్వారా ఇళ్లు, భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్లాన్ల మం జూరులో జాప్యాన్ని నివారించడంతోపాటు, ప్రభుత్వ ఆదాయూనికి గండి పడకుండా చెక్ పెట్టవచ్చని భావిస్తోంది. ప్లాన్ల మంజూరు పెం డింగ్ పడటం వల్ల భవనాల నిర్మాణాలు రోజుల తరబడి నిలిచిపోతున్నాయి. దీంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పడిపోతోంది. దీనికి తోడు ఇళ్లు నిర్మించుకునే వారు సమర్పించే ప్లాన్లను ఉద్యోగులు వివిధ కారణాలతో తొక్కిపెడుతూ సొమ్ముల కోసం వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు.
వాస్తవంగా మునిసిపాలిటీల్లో అమలు చేస్తున్న సిటిజన్ చార్టర్ ప్రకారం భవన నిర్మాణానికి దరఖాస్తు చేసిన 15 రోజుల్లో ప్లాన్ మంజూరు చేయాల్సి ఉంది. ఇది జిల్లాలో ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. ప్లాన్ల కోసం ఇళ్లు కట్టుకునేవారు చెప్పులరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నా ప్రయోజనం కలగటం లేదు. మరోవైపు ప్లాన్ల మంజూరు వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నయి, ఇదే సందర్భంలో ప్రభుత్వానికి దక్కాల్సిన ఆదాయంలో కోత పడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే భవనాల యజమానుల నుంచి నిర్మాణ వ్యయంలో 10 శాతం సొమ్మును అపరాధ రుసుంగా వసూలు చేయూల్సి ఉంది. ఇదికూడా ఎక్కడా అమలు కావడం లేదు. వీటన్నింటికి చెక్ పెట్టేం దుకు ఇకపై ప్లాన్ల మంజూరు ప్రక్రియను ఆన్‌లైన్ చేసేందుకు పురపాలక శాఖ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం పురపాలక శాఖ ప్రాంతీ య సంచాలకులు (ఆర్‌డీ) కసరత్తు ప్రారంభించారు.
సాఫ్ట్‌వేర్, మార్గదర్శకాల కోసం ఎదురుచూపు
అక్టోబర్ రెండో వారం నుంచి ప్లాన్ల మంజూరులో ఆన్‌లైన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని మునిసిపల్ యంత్రాంగం భావిస్తోంది. దీనికి అవసరమైన సాఫ్ట్‌వేర్, కంప్యూటర్లను సమకూర్చడంతోపాటు మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది. ఆన్‌లైన్ విధానం అమలుపై పశ్చిమ, తూర్పు, కృష్ణా జిల్లాల టౌన్ ప్లానింగ్ అధికారులతో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ప్రాంతీయ సంచాలకులు డబ్ల్యూవీ రామకృష్ణారెడ్డి శనివారం రాజమండ్రిలో సమీక్ష నిర్వహించారు. మూడు జిల్లాల్లో 2,900 ప్లాన్లు మంజూరు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 2,225 ప్లాన్లు మాత్రమే మంజూరు చేసినట్టు ఈ సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఆన్‌లైన్ విధానం అమలుకు పట్టణ ప్రణాళికా విభాగం (టౌన్ ప్లానింగ్) అధికారులు సమాయత్తం కావాలని ఆయన ఆదేశించారు.