పేదల దశాబ్దాల కల నెరవేరనుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున అక్క చెల్లెమ్మలకు నివాసయోగ్యమైన ప్లాట్లు ఇచ్చేందుకు ఇళ్ల పట్టాలు సిద్ధమయ్యాయి. సువిశాలమైన రోడ్లు, విద్యుత్ సౌకర్యం, డ్రెయినేజీ వ్యవస్థతో ప్రైవేట్ లేఅవుట్లను తలపించే ప్లాట్లను సిద్ధం చేశారు. జిల్లాలో ఒకే రోజు 1.32 లక్షల మంది లబ్ధిదారులకు ఏకకాలంలో పట్టాలు అందించడానికి అధికార యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రమంలో రెవెన్యూ యంత్రాంగమంతా ప్లాట్లను సిద్ధం చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత రూ.లక్షల విలువైన స్థలాలను, ఇంత ఉదారంగా ప్రతి లబ్ధిదారు కుటుంబంలోని మహిళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి అందజేయనుండడంతో పల్లె నుంచి పట్టణాల వరకు పండగ వాతావరణం కనిపిస్తోంది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఈ నెల 8న ఇళ్ల పట్టాల పంపిణీ పండగ జరగనుంది. ఒకే రోజు పల్లె నుంచి పట్టణాల వరకు 1.32 లక్షల మందికి నివాస స్థలాల పట్టాలు అందజేయనున్నారు. ఇప్పటికే ప్లాట్లు, పట్టాలు సిద్ధం చేశారు. పది నియోజకవర్గాల్లో ఉన్న లబి్ధదారులు వారు నివసిస్తున్న ప్రాంతాల సమీపంలోనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది.
►ప్రభుత్వ భూమి లేని పక్షాన మార్కెట్ ధర చెల్లించి ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో అనేక చోట్ల విలువైన ప్రైవేట్ భూములను కూడా కొనుగోలు చేసి వెంచర్లుగా మార్చారు.
►ఆ స్థలంలో వెనువెంటనే ఇల్లు కట్టుకునేందుకు వీలుగా రోడ్లు, కాలువలు, విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
►లే అవుట్లలో 80 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
►జిల్లా వ్యాప్తంగా 3493.8 ఎకరాల భూమి అవసరం ఉండగా ఆ మేరకు భూమిని పూర్తిగా సిద్ధం చేశారు.
►సేకరించిన భూముల్లో 2,450 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, 950 ఎకరాల ప్రైవేట్ భూములను కొనుగోలు చేశారు.
►3,493 ఎకరాల భూముల్లో 1,407 లేఅవుట్లు వేయడంతో జిల్లాలో ప్రతి గ్రామంలోనూ ఓ లేఅవుట్ ఏర్పాటు అయింది.
►దరఖాస్తులను బట్టి సగటున 3 ఎకరాల విస్తీర్ణం నుంచి 100 ఎకరాల విస్తీర్ణం వరకు వెంచర్లు నిర్మించారు.
►లే అవుట్ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన గ్రావెల్‌తో చదును చేసి సంబంధిత తహసీల్దార్లు సిబ్బందితో కలిసి మార్కింగ్ నిర్వహించి ప్లాట్లుగా విభజించారు.
►రహదారుల నిర్మాణంతో సహా అన్ని పనులు పూర్తి చేశారు.
►జిల్లాలో ఇప్పటి వరకు ఉదయగిరి, వెంకటగిరి, సూళ్లూరుపేట, ఆత్మకూరు నియోజకవర్గాల్లో భూ సేకరణ పూర్తవడంతో పాటు వెంచర్ల నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో జరిగింది.
►మిగిలిన నియోజకవర్గాల్లో భూ సేకరణ పూర్తయి రహదారి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
►ఈ నెల 7వ తేదీకల్లా నూరు శాతం పూర్తిగా చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
►ఈ క్రమంలో జాతీయ రహదారి సమీపంలోనూ, రాష్ట్ర రహదారికి సమీపంలోని ఇతర విలువైన భూముల్లో వెంచర్లు నిర్మించారు.
అక్కచెరువుపాడులో భారీ లేఅవుట్
ప్రధానంగా జిల్లాలో భారీ లే అవుట్ నెల్లూరు నగర శివారులో రూపు దిద్దుకుంటుంది. మంత్రి అనిల్ కుమార్‌యాదవ్, కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు ప్రత్యేక శ్రద్ధతో నెల్లూరురూరల్ మండలంలోని అక్కచెరువుపాడులో వంద ఎకరాల విస్తీర్ణంలో భారీ లేఅవుట్‌ను సిద్ధం చేశారు. 4,500 ప్లాట్లను సిద్ధం చేశారు. ఇప్పటికే ప్లాట్ల మార్కింగ్ పూర్తి చేసి రహదారి నిర్మాణ పనులను పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 1.32 లక్షల మంది లబి్ధదారుల్లో అత్యధిక శాతం మంది నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల నుంచే ఉన్నారు. నెల్లూరు నగరంలో 14,703 మంది, నెల్లూరు రూరల్‌లో 16,319 (నగర పాలక సంస్థ పరిధి వరకు) మంది లబ్ధిదారులు ఉన్నారు. కావలి, ఆత్మకూరు, నాయుడుపేటల్లో భారీ లేఅవుట్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో అత్యధిక శాతం లేఅవుట్లు సగటున 20 ఎకరాల పైబడిన విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.
లబ్ధిదారుల జాబితా పెరుగుతుంది
జిల్లాలో అర్హులైన లబ్ధిదారుల జాబితా ఇంకా పెరిగే అవకాశం ఉందని జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. గడిచిన 15 రోజుల వ్యవధిలో 25,536 కొత్త దరఖాస్తులు అందాయని, వాటితో కలిపి కేవలం ఇళ్ల పట్టాల వరకే 1.32 లక్షల వరకు ఉందని మరికొంత మంది లబి్ధదారులు పెరిగే అవకాశం ఉందని, ఇందుకు అనుగుణంగా ముందస్తుగా స్థలాలు అవసరమైన చోట గుర్తించి రిజర్వులో పెడతామని చెప్పారు. 8వ తేదీన నూరు శాతం పట్టాల పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు.
– వినోద్‌కుమార్, జాయింట్ కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment