హస్తినలో వేడెక్కుతున్న రాష్ట్ర రాజకీయం
ఒకవైపు వర్షాలతో అంతా చల్లగా ఉంటే, హస్తినలో మాత్రం రాష్ట్ర రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నాయకులు, ఎంపీలు కలిసి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఇంట్లో సమావేశమయ్యారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో, సభలో వ్యవహరించాల్సిన తీరుపై వారు చర్చించినట్లు సమాచారం. సోమవారం సభలో సీమాంధ్ర ఎంపీలు తీవ్రస్థాయిలో ఆందోళన చేయడం వల్లే సభ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే మంగళవారానికి వాయిదాపడిన విషయం తెలిసిందే. ఉభయ సభల్లోనూ కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు ఒత్తిడి వ్యూహాన్ని పటిష్ఠంగా అమలుచేయడంతో ఇటు లోక్సభ, అటు రాజ్యసభ కూడా వాయిదా పడ్డాయి. అందువల్ల, మంగళవారం కూడా సభలో గట్టిగా ఒత్తిడి తేవాలని, అవసరమైతే అసలు తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కూడా వీల్లేకుండా అడ్డుకోవాలని వారు చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక ఎంపీల వ్యూహాలకు దన్నుగా తమవంతు పాత్ర పోషించేందుకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, సాకే శైలజానాథ్, కోండ్రు మురళీమోహన్ హస్తిన పయనమయ్యారు. హస్తినలో అధిష్ఠానం పెద్దల వద్ద మరోసారి తమ వాదన గట్టిగా వినిపించాలని వీరు భావిస్తున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో ఉధృతంగా సాగుతున్న నిరసనల వివరాలను వారికి వివరించాలని అనుకుంటున్నారు. కనీసం సెల్ఫోన్లు రీచార్జి చేయించుకోడానికి కూడా దుకాణాలు తెరవట్లేదంటే ఆగ్రహం ఎంత తీవ్రస్థాయిలో ఉందో చూడాలని సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు మంత్రులకు ముందే చెప్పి పంపించినట్లు సమాచారం.
జైపాల్ ఇంట్లో టీ-ఎంపీలు
ఇలా ఉంటే, మరోవైపు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు కూడా హస్తినలో వ్యూహరచన సిద్ధం చేసుకుంటున్నారు. కేంద్రం తెలంగాణ ప్రక్రియను ప్రారంభించిందని, ఆ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం ఒక ప్రకటన కూడా చేయడంతో కాస్త సంతోషంగానే ఉన్నా, సీమాంధ్ర ఎంపీలు సభను అడ్డుకుంటున్న తీరు చూసి కాస్త ఆందోళన చెందారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలని వారంతా నిర్ణయించారు. కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి నేతృత్వంలో ఈ మేరకు తగిన వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నారు. సభలో తమ సొంత పార్టీకే చెందిన సీమాంధ్ర ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు తాము ఎలా వ్యవహరించాలన్న విషయంపై కూడా వారు చర్చించినట్లు తెలుస్తోంది.
మొత్తమ్మీద ఇరు ప్రాంతాలకు చెందిన పార్లమెంటు సభ్యులు వ్యూహ ప్రతివ్యూహాలు రచించుకుంటూ ఢిల్లీ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు.