పదేళ్లుండి వెళ్లిపొమ్మంటావా: మైసూరారెడ్డి
‘‘దేశంలోని ఇతర మహా నగరాలకు హైదరాబాద్ దీటుగా, తలమానికంగా నిలవాలన్న ఆకాంక్షతో మూడు ప్రాంతాల వారూ దాన్ని మహానగరంగా తీర్చిదిద్దారు. అలాంటి నగరంలో తాత్కాలికంగా పదేళ్లుండి తర్వాత వెళ్లిపొండని చెప్పడానికి నోరెలా వచ్చింది?’’ అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎం.వి.మైసూరారెడ్డి మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ కష్టించి నిర్మించిన హైదరాబాద్ నేడు దేశంలోని ఏ మహా నగరానికీ తీసిపోదని, అలాంటి నగరాన్ని వేరొకరికి ఇచ్చేస్తామనడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘యాభై ఏళ్లుగా అందరూ కష్టించి అభివృద్ధి చేసుకున్న ఆంధ్రప్రదేశ్‌ను చీల్చాలని కేవలం ఒక్క సోనియానే అనుకున్నారు. ఏమ్మా! అది నీ ఆస్తా? నీ సొంతమా? నీ సొంత జాగీరా? నీకు 33మంది ఎంపీలను ఇచ్చి, యూపీఏ సర్కారును రాష్ట్ర ప్రజానీకం నిలబడెతే నువ్వు చేసిన ఘనకార్యం, నువ్వు చేసిన మెహర్బానీ రాష్ట్రాన్ని చీల్చడమేనా?’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘మీ సొత్తో, మీ బాబు సొత్తు కాదు కదా! విభజించడానికైతేనేం, తుంచడానికైతేనేం...! మీ సొత్తయితే, ఇటలీ నుంచి తీసుకొచ్చిందైతే, మీరు నిర్మించిందైతే మీ బుద్ధి ప్రకారం పంచండి. మేమెవరమూ అడగం. కానీ ఇది ప్రజల సొత్తు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలే తప్ప మీ కుమారుడికి పది సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేస్తామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఒప్పుకోరు’’ అని సోనియాకు తేల్చిచెప్పారు. ‘‘పాపం సోనియా పుత్ర రత్నానికి ఆంధ్రప్రదేశ్‌లోపది సీట్లు కావాలట! ఏం, ఆ పది సీట్లను మీరు ముష్టెత్తుకుంటే ఇచ్చేవాళ్లం కదా! ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని ఇంత క్షోభ పెట్టడం దేనికి?’’ అంటూ ధ్వజమెత్తారు. ఢిల్లీలో బుధవారం వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ధర్నాలో మైసూరా ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలను, ప్రధానిని, కేంద్ర మంత్రులను, చంద్రబాబును, టీడీపీ నేతలను వాగ్బాణాలతో, వ్యంగ్యాస్త్రాలతో తూర్పారబట్టారు.
వెలకట్టి కొనేదా సమైక్యం?
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై మైసూరా నిప్పులు చెరిగారు. ‘‘తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి ఆయన. అలాంటిది, విభజనపై కాంగ్రెస్ నిర్ణయం ప్రకటించాక అది పార్టీ నిర్ణయమా, ప్రభుత్వ నిర్ణయమా అనే తేడా కూడా తెలియకుండా విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడారు. రూ.4 లక్షల కోట్లిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారట! వెలకట్టి, విలువ కట్టి కొనగలిగేదా సమైక్యమనేది, రాజధాని అనేది, నీళ్ల సమస్య అనేది? పైగా ఏపీఎన్జీవోల సంఘం వారు వెళ్లి మద్దతు కోరితే, తాను ఉత్తరమిచ్చానని, వెనక్కి తీసుకోలేనని బాబు చెప్పారు. ప్రజల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని మాట్లాడాలే తప్ప, ‘నేనేదో ఒక ఉత్తరం ఇచ్చాను, దానికి కట్టుబడి ఉంటా’నని చెప్పడమేమిటి? మీరు కట్టుబడి ఉంటే మీ పార్టీ ఎంపీలు ఏం చేస్తున్నారు? నికృష్టంగా, పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగలో తొక్కేలా, అంతా ఈసడించుకునేలా, అసహ్యించుకునేలా పార్లమెంటులో మాత్రం ధర్నాలు చేశారు. నిసిగ్గుగా సస్పెండ్ చేయించుకున్నారు. అయినా సిగ్గు లేదు. నిజానికి ఇంత చేయాల్సిన ఖర్మ పట్టలేదు. ఆ రోజు బుద్ధి లేక ఇచ్చానంటూ ముక్కుచెంపలు వేసుకుని, ప్రజాస్వామ్య సంప్రదాయాల ప్రకారం ఉత్తరాన్ని వెనక్కు తీసుకో. ప్రజానీకమంతా సంతోషిస్తారు’’ అని బాబుకు హితవు పలికారు. ‘‘కానీ బాబు అది చేయరట. బెల్లంకొట్టిన రాయిలా ఇంట్లోనే ఉంటారట. అందరూ వీధుల్లో పడాలట. అరవాలట. ఇదేం పద్ధతయ్యా? ఓ పార్టీకి అధ్యక్షుడివి, రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన వ్యక్తివి... ఇదేనా నీకుండాల్సిన బుద్ధి?’’ అంటూ కడిగి పారేశారు.
ధృతరాష్ట్రుడినీ మించిన ప్రధాని
సోనియా చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఆర్థికమంత్రి చిదంబరం నడక ఎలా ఉంటుందో మైసూరా హావభావసహితంగా చూపించారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాల్సిన చిదంబరం నిర్వాకం వల్లే డాలర్ రేటు 67 రూపాయలు అయ్యిందన్నారు.‘‘సాయంత్రానికి అది 68 అవుతుందేమో! ఎందుకంటే చిదంబరం వయసు 68 ఏళ్లట’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘మరొకాయన ఉన్నారు. మన ప్రధాని. ఆయనకన్నా ధృతరాష్ట్రుడన్నా నయమేమో. ధృతరాష్ట్రునికి కళ్లు కనిపించవు గానీ చెవులు బాగా వినిపిస్తాయి. కానీ ప్రధానికి చెవులు వినపడవు. కళ్లు కనపడవు. ఆయన వయసు 75 ఏళ్లు. కాబట్టి పెట్రోలు ధరను రూ.75కు తీసుకెళ్లాడు. డాలర్‌ను కూడా 75 రూపాయలు చేసేదాకా ఆయన శాంతించేట్టు లేరు. రెండింటి ధరా రూ.100 చేస్తే బాగుంటుందని ఎవరో అన్నారట. కానీ ప్రధాని మాత్రం, ‘అబ్బబ్బే... నాకంత టైం లేదు. టైముంటే చేసి ఉండేవాడిని. నాకు 75 ఏళ్లు. పదవి మరో ఆరు నెలలే ఉంది’ అన్నారట’’ అంటూ వ్యంగ్య బాణాలతో అలరించారు.
అందరికీ సమస్యలు చెప్పాం...
రాజధాని సమస్య, నీటి సమస్యలు, ఇతర సమస్యలపై జగన్ తరఫున, పార్టీ తరఫున రాష్ట్రపతి, ప్రధానితో పాటు దేశంలోని పలు పార్టీలను కలిశామని మైసూరా గుర్తు చేశారు. అసోం గణ పరిషత్, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, బీజేడీ, సీపీఐ, సీపీఎం, ఎన్‌సీపీ, బీజేపీ, ఏఐడీఎంకే నాయకులకు అన్నీ వివరించాం. అందరూ ఒక్కటే మాట అంటున్నారు. ఇది తప్పుడు నిర్ణయమని చెబుతున్నారు. ప్రజలందరి మనోభావాలను తెలుసుకోకుండా నిర్ణయం తీసుకున్నారంటూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీ నిర్ణయంపై ఒకసారి పునరాలోచన చేయండి’’ అని ఆయన కేంద్రం పెద్దలను కోరారు. నదీ జలాలను పంచడం అంత సులభం కాదని, పంచాలంటే సోనియాకు చేతకాదని అన్నారు.
ఉద్యోగ, కుల, ప్రజా సంఘాల మద్దతు
వైఎస్ విజయమ్మ నేతృత్వంలో జరిగిన ధర్నాకు ఏపీఎన్జీవోతోపాటు యువజన, విద్యార్థి జేఏసీ, జాతీయ దళిత హక్కుల సంఘం, స్థానిక తెలుగు సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ మాట్లాడుతూ... సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగుతున్నా కాంగ్రెస్‌కు చీమకుట్టినట్లయినా లేదని విమర్శించారు. సీమాంధ్ర పోరాటానికి మద్దతు తెలిపే పార్టీల వెంట తాము ఉంటామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని దళిత హక్కుల సంఘం జాతీయ సమన్వయ కర్త ఆనందరావు డిమాండ్ చేశారు. సమన్యాయం పాటించాలని దీక్ష చేపట్టిన పార్టీ ఒక్క వైఎస్సార్‌సీపీయే అన్నారు. మరోవైపు సామాజిక తెలంగాణ జేఏసీ నేతలు దేవని సతీష్‌కుమార్, గాలి వినోద్‌కుమార్ విజయమ్మను కలిసి వినతి పత్రాన్ని అందచేశారు.
సోనియా.. నోరెలా వచ్చింది?
Published Thu, Aug 29 2013 1:37 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement