దీపావళి అంటేనే టపాకాయల పండుగ. ప్రపంచంలో ఎక్కువ మంది జరుపుకునే పండుగ దీపావళి. కొన్నేళ్లుగా ఇది కాలుష్యమయంగా మారుతోంది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని పర్యావరణ రహితంగా పండుగ చేసుకోవాలంటూ ఆదేశాలిచ్చే పరిస్థితికి వచ్చింది. వాతవరణ,శబ్ద కాలుష్యాన్ని నివారించి ఈ దీపావళిని పర్యావరణ హితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. చిత్తూరు, తిరుపతి, మదనపల్లెతోపాటు పుత్తూరు, నగరి లాంటి చిన్న పట్టణాల్లో కూడా వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయిలో ఉందని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో పండుగను పర్యావరణహితంగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని పర్యావరణ ప్రేమికులు..సంస్కృతి, సంప్రదాయాల్ని పరిరక్షించేవారు సూచిస్తున్నారు.
సాక్షి, చిత్తూరు అర్బన్ : దీపావళిలో బాణా సంచా కాల్చడం ఆనవాయితీగా వస్తోంది. టపాసులు కాలుస్తూ చీకట్లు తొలగిపోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. బాణా సంచా ఎంపిక, కాల్చడంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఏటా ఆస్తి.. ప్రాణ నష్టాలు చోటు చేసుకుంటున్నాయి. కాలుష్యం పెరుగుతోంది. పండుగకు మరో వారం రోజులే ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే చైతన్యపరచాలని ప్రకృతి ప్రేమికులు సూచిస్తున్నారు. పర్యావరణ హితంగా పండుగ చేసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇలా..
జిల్లావ్యాప్తంగా వాయు కాలుష్యం అనూహ్యంగా పెరిగిందని ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే దేశంలోనే స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించడంలో నాలుగో స్థానంలో ఉన్న చిత్తూరు లాంటి ప్రదేశాల్లో టపాకాయలను ఎక్కువగా కాల్చడం వల్ల గాలి కూడా కలుషితమయ్యే అవకాశం ఉంది.
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, సెంటర్ ఫర్ సైన్సు అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ ఈ) నిర్వహించిన సర్వేలో జిల్లాలో అత్యధికంగా తిరుపతిలో కాలుష్యం ఉన్నట్లు తేలింది. దీన్ని తగ్గించకపోతే పిల్లలు, వృద్ధులు, మహిళలు రాబోయే రోజుల్లో తీవ్ర ముప్పు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి తరుణంలో కాలుష్యం మరింత పెంచేలా బాణసంచా కాలిస్తే మన మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదముంది. రణగొణ ధ్వనులతో కూడిన బాణాసంచా పేలుళ్లతో వృద్ధులు, దీర్ఘకాలిక రోగులకు తీవ్రఇబ్బందులుంటాయి. చిన్నారులు, గర్భిణుల కు భద్రత ఇవ్వాలన్నా పర్యావరణహిత బాణసంచాలే మేలు.
కేంద్ర ప్రభుత్వం ఇలా..
► దీపావళిపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవనోపాధి సాగిస్తుంటాయి. వారి ఉ పాధిని దెబ్బతీయకుండా పర్యావరణానికి ఎటువంటి హాని జరగనివ్వకుండా ప్రజలు సంతోషంగా బాణాసంచా కాల్చేలా పర్యావరణ హిత వేడుకలకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది.
► పర్యావరణానికి..జీవ వైవిధ్యానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, పెట్రోలియం, మందుగుండు సామగ్రి భద్రతా సంస్థ, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖలు సంయుక్తంగా పనిచేయనున్నాయి.
► ఈనెల 5 నుంచి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా సీఎస్‌ఐఆర్‌చే తయారు చేసిన బాణసంచా అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
► కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్స్ (సీఎస్‌ఐఆర్) సంస్థ ద్వారా పర్యావరణహిత బాణాసంచా రూపకల్పన చేయించింది. ఈ సంస్థ మార్గదర్శకాలకనుగుణంగా బాణసంచా తయారీ ప్రక్రియ చేపడుతున్నారు. శబ్ధం.. కాలుష్యం తక్కువ వెదజల్లే క్రాకర్లు, వి ద్యుద్దీపాలతో కూడిన రంగుల పూలకుండీలు, పెన్సిళ్లు, చక్కర్లు, మిరుమిట్లు గొలిపే వాటిని తయారు చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా నకిలీలు రాకుండా అడ్డుకోనున్నారు.
రంగులు ఇలా...
బాణసంచా కాలిస్తే బోలెడు రంగులు వచ్చి ఆనందింపజేస్తాయి. మెగ్నీషియం, కాపర్, కాల్షియం, సోడియం, స్ట్రోనియం అల్యూమినియం, బేడియంను బాణసంచా తయారీకి వినియోగిస్తారు. వీ టిలో కాలుష్యం ఎక్కువ ఉంటుంది. ప్రమిదలతో కూడిన వెలుగులు మేలు. రంగుల బాణసంచా కాల్చాలంటే తక్కువ కాలుష్యం వెలువడే వాటినే ఎంచుకోవడం మంచిది.
ఎంపిక ఇలా.....
పెద్ద శబ్దాలొచ్చే బాణా సంచా కాల్చాలనే కుతూహలం పిల్లల్లో ఉంటుంది. ఏ చిన్నపొరపాటు జరిగినా వారు కళ్లు, చర్మ సంబంధ సమస్యల బారినపడే ప్రమాదముంది. దీనికి తోడు ధ్వని, వాతావరణ కాలుష్యాలకు ఆస్కారముంది. అదే బాణా సంచా ఎంపికలో వయసుల వారీగా జాగ్రత్తలు పాటిస్తే మంచిది.
► 3 నుంచి 5 ఏళ్ల వారికి – రంగుల అగ్గిపుల్లలు, పెన్సిళ్లు, తాళ్లు
► 6 నుంచి 12 ఏళ్ల వారికి – పెన్సిళ్లు, తాళ్లు, వెన్నముద్దలు, కాకరొత్తులు, భూచక్రాలు, పిస్తోళ్లు
►13 నుంచి 21 ఏళ్లవారికి – హైడ్రోజన్, బర్డ్స్, లక్ష్మీ, బుల్లెట్ బాంబులు, యాలీయాలీ టపాసులు, తాజ్, రెడ్‌ఫోర్డ్ బాంబులు
► 21 ఏళ్లకు పైబడిన వారికి చిచ్చుబుడ్లు, రంగుల ఫౌంటెన్లు, క్రాకర్ కింగ్స్, రాకె ట్లు, లక్ష్మీబాంబులు, రెడ్‌పోర్డు బాంబులు, డబుల్ సెవెన్స్ ఏకే 47, స్పీడ్ 2000, బుల్లెట్ ట్రైన్స్, గ్రాఫిక్ 180 తదితరాలు
► మహిళలకు – సింగిల్ సెల్స్, క్లాసిక్, స్ల్విర్ షవర్స్, స్టార్‌వార్స్, మూన్‌లైట్, రంగ్‌మేళా తదితర టపాసులు
ఆలోచనల్లో మార్పు రావాలి
► దీపావళి జరుపుకునే విధానంలో ప్రజల ఆలోచనా ధోరణి క్రమంగా మారుతూ వస్తోంది. ప్రభుత్వంతో పాటు కొన్ని సంస్థలు చేస్తున్న కృషితో పర్యావరణహిత దీపావళి సాకారమవుతుంది.
► జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పర్యావరణహిత దీపావళి జరుపుకునేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
► కాలుష్య నియంత్రణా మండలి కాలుష్య కారక పండుగ వద్దంటూ చైతన్య కార్యక్రమాలు ఏటా నిర్వహిస్తోంది.
అత్యవసర సేవలు
ఆనంద దీపావళి.. ఇదీ మనందరీ లక్ష్యం. అప్రమత్తతతోనే ప్రమాదాల నుంచి రక్షణ ఉంటుంది. పండుగ రోజు ఊహించని సంఘటనలు ఎదురైతే వెంటనే అగ్నిమాపక, పోలీసు, వైద్య, ఆరోగ్య శాఖలను సంప్రదించాలి. 100, 101 సేవల్ని వినియోగించుకోవచ్చు. అగ్నిమాపక శాఖ సేవలు ప్రత్యేకం. అందుకే ఆయా కార్యాలయాల ఫోన్ నంబర్లు దగ్గర ఉంచుకుని ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే వారి సేవలు పొందడం ద్వారా నష్టాల్ని నిలువరించుకోవచ్చు.
పర్యావరణాన్ని దెబ్బతీస్తే..
పర్యావరణాన్ని దెబ్బతీసేలా పండుగ చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్లుగా చోటుచేసుకున్న పరిణామాలు మనకు గుణపాఠంలా ఉన్నాయి. అక్కడ గాలి కాలుష్యానికి తోడు రసాయనాలతో కూడిన ప్రమాదకర బాణసంచా కా ల్చడంతో ప్రజలు ప్రాణాలు తోడేసేలా గాలి మారింది.
Comments
Please login to add a commentAdd a comment