ప్రకృతిలో మానవుడితో అనేక రకాల జీవులు ఉన్నాయి. అన్ని రకాల జంతువులు, జీవజాలం మానవుడికి ఉపయోగపడుతున్నాయి. అయితే కొన్ని జీవులు, జంతువుల పట్ల మానవులు పక్షపాతధోరణి ప్రదర్శిస్తున్నారు. ఖరీదైన విదేశీ కుక్కలను కొనుగోలు చేసి వాటిని అపురూపంగా పెంచుకుంటున్నారు. అదే సందర్భంలో వీధుల్లో కనిపించే కుక్కల పట్ల వివక్ష చూపుతున్నారు. కొందరు అకారణంగా వాటిని చంపివేయడం, గాయ పరచడం చేస్తున్నారు. చాల వీధికుక్కలకు ఆహారం అందక, తాగడానికి నీరు లేక అవస్థలు పడుతున్నాయి. కరోనా వచ్చాక వీధి కుక్కల పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. ఇంతకు మునుపు హోటళ్లు, రెస్టారెంట్లలో మిగిలిన ఆహారం తెచ్చి వేసేవారు, ప్రస్తుతం హోటళ్లు, రెస్టారెంట్ల నడవటం గగనమై వీధి కుక్కలకు ఆదరణ, ఆహారం కరువైంది. ఈ నేపథ్యంలో వీధికుక్కలను ఆదరిస్తూ అక్కున చేర్చుకుంటున్నారు.. తిరుపతికి చెందిన సాప్ట్‌వేర్ ఇంజినీర్ ఉదయ. తన చిన్నతనం నుంచి తన తల్లిదండ్రులు, అవ్వా తాతలు వీధుల్లో తిరిగే ఆవులు, కుక్కలు, ఇతర జంతువులపై ప్రేమ చూపేవారు. వారి నుంచి ఈ సద్గుణాన్ని అందిపుచ్చుకున్న ఉదయ శ్రీ 10 సంవత్సరాల క్రితం బాణ సంచా పేలి శరీరం అంతా కాలి, కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్న ఒక వీధి కుక్కను అక్కున చేర్చుకొని దానిని బాగు చేయించి తానే పెంచుకోవడంతో పాటు దాని సంతతిని తన బంధువులకు ఇచ్చి పెంచుకొనేలా చేసింది. అంతే కాకుండా గత 10 సంవత్సరాలుగా తిరుపతి నగరంలో భవాని నగర్, అశోక్ నగర్, అలిపిరి బైపాస్ రోడ్డు, కపిల తీర్థం రోడ్డు, ఇస్కాన్ టెంపుల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో సుమారు 150 వీధి కుక్కలకు ఆహారం అందిస్తోంది. ఎవరి సహాయం కోసమో ఎదురుచూడకుండా తనకున్న ఆర్థిక వనరులతోనే వాటికి ఆహారం సిద్దం చేసి నిత్యం ఆటోలో వెళ్లి ఆయా ప్రాంతాల్లో వీ«ధికుక్కలకు ఆహారం పంచుతూ తనకున్న జంతుప్రేమను చాటుకొంటోంది. శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కలకు ఆహారం అందిస్తున్న ఉదయశ్రీని ‘సాక్షి’ పలుకరించింది. ఈ సందర్బంగా ఆమె పలు విషయాలు సాక్షికి వివరించింది. ఆమె చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే...
నా పేరు నవకోటి ఉదయశ్రీ. తిరుపతి నగర శివార్లలోని ఒక ప్రయివేట్ ఇంజినీరింగ్ కళాశాలలో 2014లో బీటెక్ పూర్తి చేశాను. బీటెక్ తర్వాత టీసీఎస్ సంస్థలో ఉద్యోగంలో చేరాను. మూడు సంవత్సరాలు పనిచేశాక ఉద్యోగం వదిలేశాను. ప్రస్తుతం తిరుపతిలోనే ఉంటున్నాను. నా తల్లిదండ్రులు, అవ్వతాతలకు జంతువులంటే ఎంతో ప్రేమ. అమ్మ శాంతి వీధి కుక్కలను, ఆవులను, ఇతర జంతువులను ఆదరించేవారు. వాటికి ఆహారం అందించేవారు. గాయపడిన జంతువులు కనిపిస్తే వాటికి వైద్యం అందించేవారు. చిన్న తనం నుంచి ఇది చూసిన నాకు జంతువులపై ఎంతో ప్రేమ కల్గింది. గత కొన్నేళ్లుగా అనేక వీధి కుక్కలు ఆహారం, నీరు దొరక్క వీధుల్లో రోదిస్తుండటం చూసి వాటికోసం ఏమైనా చేయాలనుకున్నాను. నా వంతు సాయంగా ఆహారం సిద్దం చేసి నగరంలోని వివిధ ప్రాంతాల్లోని సుమారు 150 వీధి కుక్కలకు అందిస్తున్నాను. నా స్వంత ఖర్చులతోనే ఈ పని చేస్తున్నాను. ఎక్కడైనా వీధి కుక్కలు, ఆవులు గాయపడి కనిపించినా వెంటనే బ్లూ క్రాస్ సంస్థ సహకారంతో వాటికి వైద్యం అందిస్తాను.
ఇందుకు అనిమల్ కేర్ లాండ్ సంస్థ నిర్వాహకులు డాక్టర్ శ్రీకాంత్ సహకారిస్తున్నారు. నా ప్రయత్నంలో కొన్నిసార్లు చికాకులు ఎదురవుతుంటాయి. అయినప్పటికీ ఆపలేదు. వీధికుక్కలు, ఇతర జంతువులు గాయపడతాయన్న కారణంగా చిన్నతనం నుంచి దీపావళి జరుపుకోవడం లేదు. నా ప్రయత్నానికి అమ్మ శాంతి ఎంతో సహకారం అందిస్తున్నారు. నా విజ్ఞప్తి ఏమిటంటే... కొన్ని కుక్కలు తప్పు చేశాయని అన్నిటిని ఆలాగే చూడటం భావ్యం కాదు. ఖరీదైన కుక్కల స్థానంలో వీటిని ఆదరిస్తే బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఆహారం, మురికి నీరు తాగడం వల్ల వాటికి గజ్జి, ఇతర వ్యాధులు సంభవిస్తున్నాయి. వాటికి ఆదరణ ఉంటే ఇలా ఉండవు. ప్రతి ఒక్కరూ ఒక వీధికుక్కనైనా దత్తత తీసుకుంటే బాగుంటుంది.
ఉదయశ్రీని ఆతృతతో చుట్టుముట్టిన వీధికుక్కలు
Comments
Please login to add a commentAdd a comment