కరోనా లాక్ డౌన్ కూలి లేకుండా చేసింది. కూలీల కడుపు ఎండగట్టేసింది. ఆఫీసులు మూసేశారు సరే!!. ఉద్యోగులకైతే జీతాలొస్తాయి. ఇంట్లో నుంచే పని చేస్తారు. మరి కూలీల సంగతో..? వేల కిలోమీటర్లు నడిచి సొంతిళ్లకు వెళ్లిపోవాలా? నడిచేటపుడు వారి ఆకలి దప్పుల సంగతేంటి? ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా ఒకటే కదా? వారూ ఈ దేశీయులే కదా..? వాళ్లను ఆదుకునేదెవరు? అందరివీ ప్రశ్నలే. అశోక్‌బాబు మాత్రం తానే జవాబు కావాలనుకున్నాడు. కొంతైనా జవాబుదారీ అవుదామనుకున్నాడు. ఆ ఆలోచనతోనే పుట్టుకొచ్చాయి కమ్యూనిటీ కిచెన్‌లు. పుణె, పింప్రీ– చించ్వాడ్‌లో రోజుకు 25 వేల మంది ఆకలి తీర్చటంతో మొదలై... ఇపుడు రోజూ లక్షన్నర మందికి భోజనంతో పాటు ఆశ్రయం కూడా కల్పిస్తున్నాయి. ఐఆర్‌ఎస్ అధికారిగా తన విధిని నిర్వర్తించటంతో ఆగిపోలేదు అశోక్‌బాబు. తన స్నేహితుల్ని కూడా ఇందులోకి లాగాడు. సివిల్ సర్వెంట్ల నెట్‌వర్క్ చాలా పెద్దది. శక్తిమంతమైందిlకూడా. అందుకే ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని ఎన్‌జీవోల సహకారంతో వీళ్లు తమ సేవల్ని అందించగలుగుతున్నారు.
పుణే, పింప్రి–చించ్వాడ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆసియా ఖండంలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడగా చెప్పాలి. ఎందుకంటే ఈ పరిసరాల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలతో పాటు పలు ఆటోమొబైల్ కంపెనీలన్నాయి. చక్కెర మిల్లుతో పాటు ఇతర మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లు, సాఫ్ట్‌వేర్ హబ్‌లు, ఇతర వాణిజ్య, వ్యాపార సంస్థలు ఎక్కువే ఉన్నాయి. వీటిలో పనిచేసే లక్షల మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారే. లాక్‌డౌన్ కారణంగా వీళం్లతా ఇబ్బందుల్లో పడ్డారు. కంపెనీలు మూసేయటం, నిర్మాణ కార్యకలాపాలు ఆగిపోవటంతో నిరాశ్రయులయ్యారు. తిండిలేక అలమటిస్తున్న వీరిని ఆదుకోవటానికి పుణె, షోలాపూర్, కొల్హాపూర్, సతారా, సాంగ్లీ జిల్లాలకు పుణె డీఆర్‌ఓ హోదాలో (రెవిన్యూ డివిజనల్ కమిషనర్) పనిచేస్తున్న దీపక్ మహిష్కర్ ఓ ఆలోచన చేశారు. కమ్యూనిటీ కిచెన్ భావనకు పురుడు పోశారు. ఆచరణ, పర్యవేక్షణ బాధ్యతలు ఐఆర్‌ఎస్ అధికారి నేలపట్ల అశోక్‌బాబుకు అప్పగించారు.
ప్రతి రోజూ స్వయంగా కిచెన్లకు...
కో–ఆర్డినేటర్‌గా నియమితులైన నాటినుంచి అశోక్ బాబు తనదైన శైలిలో సేవలు అందించటం మొదలెట్టారు. ముఖ్యంగా ప్రతిరోజూ పుణే డిప్యూటి కలెక్టరు, పుణే, పింప్రి–చించ్‌వడ్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర ్లతో సమన్వయం చేసుకునే వారు. రోజుకు కనీసం రెండు నుంచి మూడు కమ్యూనిటీ కిచెన్ సెంటర్లతోపాటు షెల్టర్ల వద్దకు నేరుగా వెళుతున్నారు. కూలీల్లో భయాన్ని పారదోలేందుకు ప్రయత్నిస్తూ... ఆహారం సరిగా అందిందో లేదో చూస్తున్నారు. పలువురికి బస కూడా ఏర్పాటు చేశారు.
ఇతర రాష్ట్రాల్లో...
ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగువారికి అశోక్‌బాబు తన వంతు సాయం అందిస్తున్నారు. తన మిత్రులతో పాటు ఎన్జీఓ సంస్థల సహకారంతో పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ప్రజలకు భోజనం, వీలైనంత వరకూ వసతి కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్, గుంటూరు, రాజమండ్రి, చిత్తూరు, తెలంగాణలోని హైదరాబాదు, మెదక్, సూర్యాపేట, గద్వాల్ ప్రాంతాలతో పాటు కర్ణాటక, పంజాబ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిషా, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తమ సేవలు అందుతున్నట్లు చెప్పారాయన.
గుంటూరు జిల్లా వినుకొండ నుంచి..
అశోక్‌బాబుది గుంటూరు జిల్లా. వినుకొండ తాలూకా మొగచిందలపాలెంలో పుట్టారు. వినుకొండలోని సెయింట్ మేరిస్, లయోల స్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించాక గుంటూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో డిప్లొమా చేసి, వరంగల్‌లో బీటెక్ చేశారు. 2010లో హైదరాబాద్‌లో కొన్నాళ్లు పనిచేశాక ముంబై రీజియన్‌లో ఐటీ జాయింట్ కమిషనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పుణే సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తూనే ఈ కమ్యూనిటీ కి చెన్ బాధ్యతలను చూస్తున్నారు. – గుండారపు శ్రీనివాస్ / చక్రవర్తి సాక్షి ముంబై/ పింప్రీ
25 వేల భోజనాలతో ప్రారంభం..
పుణే, పింప్రీ–చించ్వాడ్ పరిధిలో ఏప్రిల్ 16న కమ్యూనిటీ కిచెన్ సేవలను ప్రారంభించాం. మొదట సుమారు 25 వేల మందికి భోజనాలు అందించాం. ఈ సంఖ్య పెంచుతూ ఇపుడు 105 కమ్యూనిటీ కిచెన్‌ల ద్వారా రోజూ 1.50 లక్షల మందికిపైగా భోజనాలు అందిస్తున్నాం. అదేవిధంగా 57 షెల్టర్లలో సుమారు 70 వేల మందికి బస ఏర్పాటు చేశాం. – నేలపట్ల అశోక్‌బాబు ఐఆర్‌ఎస్, కో ఆర్డినేటర్, కమ్యూనిటీ కిచెన్ సెంటర్స్
Comments
Please login to add a commentAdd a comment