హెచ్‌డీఎస్ సమావేశంలో ప్రశ్నించిన జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు
ప్రొద్దుటూరు క్రైం: ఏడు నెలల తర్వాత జరిగే సమావేశానికి రావడానికి కలెక్టర్, డీసీహెచ్‌ఎస్‌కు తీరిక లేదా.. వాళ్లిద్దరూ లేకుంటే మీటింగ్ జరపడం ఎందుకు అని జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటి సమావేశంలో జెడ్పీ చైర్మన్ గూడూరు రవి మాట్లాడుతూ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి డీసీహెచ్‌ఎస్ ఎందుకు రాలేదని సూపరింటెండెంట్‌ను అడిగారు.
ఈ మీటింగ్‌లో జరిగే విషయాలపై, తీర్మానాలపై ఎవరు బాధ్యత తీసుకుంటారు.. మీరు తీసుకుంటారా అని చైర్మన్ ప్రశ్నించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రిమ్స్ తర్వాత పెద్ద ఆస్పత్రిలో జరిగే ముఖ్యమైన సమావేశానికి కలెక్టర్ రాకుంటే సమావేశం జరపడం ఎందుకన్నారు. ఈ ఆస్పత్రిలో ఇద్దరు గైనకాలజిష్టులను నియమిస్తే సగం సమస్యలు తీరుతాయని అన్నారు. కలెక్టర్ సహకారం లేదు.. ప్రభుత్వం పట్టించుకోదు.. అలాంటప్పుడు సమస్యలు ఎలా తీరుతాయని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
7 నెలలకు సమావేశం జరపడం ఏంటి..
మూడు నెలలకోసారి జరగాల్సిన సమావేశం ఏడు నెలల తర్వాత జరిగితే ఎలా అని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి అన్నారు. కలెక్టర్, డీసీహెచ్‌ఎస్‌లు సమావేశానికి రాకపోవడం వారి బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమన్నారు. మహిళా వైద్యులు లేకపోవడం వల్ల ఇక్కడ వైద్య సేవలు కుంటుపడుతున్నాయన్నారు.
సమావేశాన్ని అడ్డుకున్న ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు
ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు జయశ్రీ, అన్వేష్ తదితరులు సమావేశాన్ని అడ్డుకున్నారు. ఆస్పత్రిలోని స్కానింగ్, గైనకాలజిస్టుల కొరత, ఎక్స్‌రే మిషన్ పనిచేయడం లేదని అనేక సార్లు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా పరిష్కరించే నాథుడే కరువయ్యారన్నారు. మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి మాట్లాడుతూ ఆస్పత్రి సమస్యలపై తాము కూడా ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు. మే నెల 8న మరోసారి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరగాలని సభలో తీర్మానించారు.
ఎజెండాలోని పలు అంశాలను సభ ముందు పెట్టి ఆమోదం పొందారు. సమావేశంలో ఎంపీపీ మల్లేల ఝాన్సీరాణి, రాజుపాళెం జెడ్పీటీసీ సభ్యురాలు గుత్తి మంజుల, మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ వైవీ స్వరూప్‌కుమార్‌రెడ్డి, రోటరీ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రాజారామ్మోహన్‌రెడ్డి, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ రాకుంటే ఎలా !
Published Wed, Apr 29 2015 4:14 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
Advertisement