సభపై విశ్వాసం ఎలా? | How faith in the congregation? | Sakshi
Sakshi News home page

సభపై విశ్వాసం ఎలా?

Published Tue, Jul 15 2014 12:20 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

సభపై విశ్వాసం ఎలా? - Sakshi

సభపై విశ్వాసం ఎలా?

→ మైనార్టీ ఎమ్మెల్యేకే రక్షణ లేకుంటే ఎలా ?
→  సభ్యుడు దాడికి గురైనా  స్పీకర్ పరామర్శించరా ?
→  ఎంపీటీసీల కిడ్నాప్, ఎమ్మెల్యే ముస్తఫాపై దాడిపై విచారణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల డిమాండ్
→  స్పీకర్ నియోజక వర్గంలోనే దాడి జరగడం దారుణం : జ్యోతుల నెహ్రూ
→  సభ్యుని హక్కులుకాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంది : ఉమ్మారెడ్డి
→  ఎమ్మెల్యే అని చెప్పినా దాడి చేశారు : ముస్తఫా
→  జగన్ నేతృత్వంలో ప్రజలకు అండగా నిలుస్తాం : అంబటి
 
 సాక్షి, గుంటూరు: శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నియోజకవర్గంలోనే మైనార్టీ ఎమ్మెల్యేకు రక్షణ లేకుంటే ఎలా, ఒక మైనార్టీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో దాడికి గురైతే స్పీకర్ పరామర్శించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, శాసనసభపై ఎమ్మెల్యేలకు ఎలా విశ్వాసం కలుగుతుందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఆదివారం మేడికొండూరు వద్ద ఎంపీటీసీల కిడ్నాప్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాపై చేసిన దాడులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. సోమవారం గుంటూరులో సమావేశమైన ఆ పార్టీ నాయకులు ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో నిరసన  వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు జరగకుండా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో కార్యకర్తలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. తొలుత వైఎస్సార్‌సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ శాసనసభను పరిరక్షించాల్సిన స్పీకర్ నియోజక వర్గంలోనే ఇలాంటి సంఘటన జరగడం దారుణమన్నారు. ైమైనార్టీ ఎమ్మెల్యే ముస్తఫాపై దాడి జరిగితే  విచారించకపోవడం మరింత దురదృష్టకరమన్నారు. ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకువెళ్లి నిలదీస్తామన్నారు. శాసనసభలోకి నమ్మకంతో అడుగు పెట్టాలంటే స్పీకర్ స్వచ్ఛందంగా విచారణ జరిపి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో దుష్ట సంప్రదాయానికి తెరతీస్తున్నారన్నారు. జిల్లాలో ఇంతదారుణం జరిగినా చంద్రబాబు స్పందించక పోవడానికి కారణమేమిటని ప్రశ్నించారు. తాము బలమైన ప్రతిపక్షంగా ఉన్నామని ఎవరికీ  భయపడాల్సిన అవసరం లేదంటూ. జరిగిన సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మైనార్టీ ఎమ్మెల్యేపై దాడి జరిగితే ఆ  సభ్యుని హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని గుర్తు చేశారు.

జీవితంలో ఎన్నడూ చూడలేదు... ముస్తఫా, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే

ముఖానికి ముసుగులు వేసుకున్న కొంతమంది దాడి చేసేందుకు రాగా తన గన్‌మెన్‌లు ఎమ్మెల్యే అని చెప్పినా వినకుండా ఘోరంగా సినీ తరహాలో రాళ్లు, కర్రలతో దాడిచేశారు. ఈప్రభుత్వానికి న్యాయమెక్కడుంది. వాళ్లే ఈ విధంగా వ్యవహరిస్తే ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది. పట్టపగలు సంఘటన జరిగితే రక్షణ ఇవ్వలేకపోతే వారు ప్రజలకు ఏంన్యాయం చేస్తారు. రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి  చెబుతారు.

ఆటవిక పాలనలో ఉన్నామా...   అంబటిరాంబాబు, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి

ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా, ఆటవిక పాలనలో ఉన్నామా, అనే అనుమానం కలుగుతోంది. ముప్పాళ్లలో 12 మంది ఎంపీటీసీల్లో 7 మంది వైఎస్సార్ సీపీ వైపు ఉన్నారు. స్పష్టమైన మెజార్టీ ఉంది. 4వ తేదీ ఎన్నికను బలవంతంగా వాయిదా వేయించారు. 13వ తేదీ వరకు ఎంపీటీసీలు అనేక చోట్ల తలదాచుకున్నారు. చివరకు మా వద్దకు వస్తే వారిని వెంట తీసుకెళ్తుండగా, దాడిచేసి వారిని కిడ్నాప్ చేశారు. శాసనసభ స్పీకర్, సీఎంలకు ముప్పాళ్ల ఎంపీపీ పీఠమే కావాల్సి వచ్చిందా, ఈ దౌర్జన్యాన్ని చూస్తూ ఊరుకోం. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రజలకు అండగా నిలుస్తాం. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారితే న్యాయం ఎక్కడ జరుగుతుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement