ఇంకెన్నాళ్లీ నిరీక్షణ? | how many years hope? | Sakshi
Sakshi News home page

ఇంకెన్నాళ్లీ నిరీక్షణ?

Published Thu, Oct 15 2015 1:47 AM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM

ఇంకెన్నాళ్లీ నిరీక్షణ?

ఇంకెన్నాళ్లీ నిరీక్షణ?

ఏటా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం.. అన్న పాలకుల మాటలు నిరుద్యోగులు నిజమేనని నమ్మారు. చెప్పినట్టే నోటిఫికేషన్ ఇవ్వడంతో సంబరపడిపోయారు. పొట్ట పోసుకునేందుకు అప్పటి వరకు చేస్తున్న చిన్నా చితకా ఉద్యోగాలు వదిలేసి పరీక్షలకు సిద్ధమయ్యా రు. కొందరైతే అప్పు చేసి మరీ కోచింగ్ సెంటర్లలో చేరి డీఎస్సీ కోసం శిక్షణ పొందారు. పరీక్షలు ముగిశాయి. ఆ వెంటనే కీ విడుదలైంది. మార్కులు అంచనా వేసుకున్న ప్రతిభావంతులు తమకు ఉద్యోగం ఖాయమని, ఇక బాధ్యతలు స్వీకరించమే తరువాయి అని భావిం చారు. మెరిట్ జాబితా కోసం ఆర్నెల్ల నిరీక్షిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కనికరించలేదు. కోర్టు మెట్లెక్కినా.. మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించినా వీరి ఆశలు మాత్రం ఫలించలేదు.      - వినుకొండ టౌన్
 
గత ఏడాది నవంబర్‌లో నోటిఫికేషన్...
 జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల భ ర్తీకి గత ఏడాది నవంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటికే రెండేళ్ల నుంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో వేలాది రూపాయలు పెట్టి కోచింగ్‌లకు వెళ్లారు. 951 పోస్టులకు గాను జిల్లా అధికారులకు 33,365 దరఖాస్తులు అందాయి. ఈ ఏడాది మే 9, 10, 11 తేదీల్లో   పరీక్షలు నిర్వహించారు. అనంతరం పాథమిక, తుది కీలను కూడా విడుదల చేశారు. తుది కీలో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులు ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు. కానీ అక్కడి నుంచి ప్రక్రియను ప్రభుత్వం  ముందుకు తీసుకెళ్లడం లేదు. దీంతో జిల్లాలో డీఎస్సీ పరీక్షలు రాసిన 33 వేల మంది అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. జిల్లా ర్యాంకర్లకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని తెలిసి, ప్రైవేటు యాజమాన్యాలు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో వారు ఖాళీగా కాలం గడుపుతుంటే మరి కొందరు ర్యాంకర్లు కూలి పనులకు వెళ్తున్నారు. బాబొస్తే జాబొస్తుందని నమ్మిన నిరుద్యోగులు నిలువునా మునిగిపోతున్నారు.

 హైకోర్టు, ట్రిబ్యునల్‌లో కేసులు..
 ప్రతి డీఎస్సీకీ అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించటం సహజం. కానీ 2014 డీఎస్సీ మాత్రం ప్రత్యేకం. సుమారు 1836  కేసులు హైకోర్డు, ట్రిబ్యునల్‌లో అభ్యర్థులు దాఖలు చేశారు. టెట్ కం టీఆర్టీ రద్దు చేయాలనే ప్రధానమైన కేసును ఆగస్టు 6న హైకోర్డు కోట్టి వేసింది. మిగిలిన కేసులన్నీ ప్రభుత్వం విడుదల చేసిన తుది కీలపై ట్రిబ్యునల్‌లో దాఖలైనవే. వీటిని కుదించి 23 కేసులుగా ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. గత డీఎస్సీల్లోనూ కోర్టు కేసులు ఉన్నప్పటికీ తుది తీర్పుకు లోబడి నియామకాలు చేపట్టారని, ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టంలేని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆల్యం చేస్తోందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నిరుద్యోగుల గోడు ఆలకించి డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల చేయాలని కోరుతున్నారు.
 
 అప్పుచేసి కోచింగ్ తీసుకున్నా..
 లక్షరూపాయలు అప్పుతీసుకుని నేనూ నా భార్య కోచింగ్ తీసుకున్నాం. స్కూల్ అసిస్టెంట్ సోషలోలో నాకు 145.97 మార్కులు వచ్చాయి. జిల్లాలో 9వ ర్యాంకు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాలు ఇవ్వకపోవడంలో తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లిస్తూ ఖాళీగా ఉన్నాను.నిరుద్యోగుల గోడు విని మెరిట్ జాబితా విడుదల చేసి నియామకాలు చేపట్టాలి.      - కె.బి.ఎన్.శేఖర్, జిల్లా 9వ ర్యాంకు,
 ఎస్‌ఎ సోషల్
 
మంత్రులకు విన్నవించాం...
 నియామకాలు చేపట్టాలని మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చాం. 2012 డీఎస్సీ మూడు నెలల్లోనే ప్రక్రియా ముగిసింది. ఈ డీఎస్సీకి మాత్రం ఎదురు చూపులు తప్పడం లేదు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే వెంటనే ఇవ్వవచ్చు.
 - వి.అనిల్‌కుమార్, ఎస్‌జీటీ అభ్యర్థి
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement