నా సీట్లో ఎలా కూర్చుంటారు?
నా సీట్లో ఎలా కూర్చుంటారు?
Published Wed, Jun 25 2014 3:08 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
సంతకవిటి: టీడీపీ నేతల అత్యుత్సాహంపై స్థానిక పీఏసీఎస్ అధ్యక్షుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎస్.వి.రమణారావు మండిపడ్డారు. పీఏసీఎస్ కేంద్రంతో ఏమాత్రం సంబంధంలేని టీడీపీ మండల నేత కొల్ల అప్పలనాయుడు తన సీట్లో ఎలా కూర్చుంటారని ప్రశ్నించారు. మంగళవారం రమణారావు విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ముందుచూపుతోనే ఎక్కువగా విత్తనాలు కావాలని ప్రతిపాదనలు పంపించామని, కానీ ప్రభుత్వం సరఫరా చేయలేకపోయిందని చెప్పారు. ఈ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈనెల 23న టీడీపీ నేతలు కేంద్రం వద్దకు చేరుకుని రభస చేసి అధికారులను తప్పుదోవ పట్టించుతున్నారని విమర్శించారు. పీఏసీఎస్‌లోకి రావడమే కాకుండా అధికారులను చెలాయించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఏ పదవి లేని నాయకుడు నేరుగా నా సీట్లోకి వచ్చి కూర్చోవడమేమిటని ప్రశ్నించారు. చేతనైతే పరపతి ఉపయోగించి విత్తనాలు వచ్చేలా చేయాలన్నారు. రభసపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెడతాన్నారు.
జేడీకి ఫిర్యాదు
అనంతరం అక్కడకు వచ్చిన జిల్లా వ్యవసాయ శాఖ సంచాలకుడు హరిని కలిసి వివరాలు అందించారు. అధికారులు ఇచ్చిన రశీదుల మేరకే విత్తనాలు వెళ్లాయని, ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకోలేదని, బ్లాక్‌లో విత్తనాలు వెళ్లలేదని చెప్పారు. విత్తనాల పంపిణీకి ముందే టీడీపీ నేతలు వ్యవసాయశాఖ అధికారి వద్ద రశీదులు తీసుకుని విత్తనాలు రైతులుకు అందకుండా చేసేందుకు ప్రయత్నించారని, చివరకు రాద్ధాంతం చేసి రైతులును, ఉన్నతాధికారులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు.
విత్తనాల పంపిణీపై జేడీ ఆరా
ఇదిలా ఉండగా విత్తనాల పంపిణీ విషయమై జేడీ హరి పలువురు రైతుల వద్ద ఆరా తీశారు. ఈ సందర్భంలో టీడీపీ నేత గండ్రేటి కేసరితో పాటు పలువురు రైతులు అక్కడకు చేరుకుని తమకు రశీదులు ఉన్నాయని, విత్తనాలు ఇప్పించాలని కోరారు. మరోవైపు వైఎస్సార్ సీపీ నేతలు కూడా అక్కడకు చేరుకుని దొంగ రశీదులు తీసుకొచ్చిన వారిపై చర్యలు చేపట్టాలని, టీడీపీ నేతలు కాకుండా రైతులకు న్యాయం జరగిందా? లేదా? అనే అంశంపై ఆరాతీయాలని కోరారు. అందరికీ న్యాయం చేస్తామని జేడీ హామీ ఇచ్చారు. ఆయన వెంట ఏడీ వైకుంఠరావు, ఏవో రంగారావు, సీఈవో విజయ్‌కుమార్ ఉన్నారు.
Advertisement