గుంటూరు ఘటనపై నివేదిక కోరిన హెచ్చార్సీ  | HRC asked Report on the incident at Guntur | Sakshi
Sakshi News home page

గుంటూరు ఘటనపై నివేదిక కోరిన హెచ్చార్సీ 

Published Wed, Sep 5 2018 4:09 AM | Last Updated on Wed, Sep 5 2018 4:09 AM

HRC asked Report on the incident at Guntur - Sakshi

ఫిర్యాదు పత్రాన్ని చూపుతున్న రెహమాన్‌

హైదరాబాద్‌: గుంటూరు బి.ఆర్‌.స్టేడియంలో ఆగస్టు 28న ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో ప్లకార్డులు ప్రదర్శించిన తొమ్మిది మంది యువకులపై జరిగిన హింసాత్మక సంఘటనలపై సమగ్ర నివేదికను అందజేయాలంటూ గుంటూరు అర్బన్‌ ఎస్పీకి మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సదస్సులో తమ నిరసనను శాంతియుతంగా తెలియజేసిన వారిపై కక్ష సాధింపు పద్ధతిలో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఆ యువకులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్‌.ఎ.రెహమాన్‌ గత నెల 31వ తేదీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఈ కేసును మంగళవారం హెచ్చార్సీ విచారణకు స్వీకరించింది. కేసు విచారణను అక్టోబరు 22వ తేదీకి వాయిదా వేసింది.

ఈ నేపథ్యంలో మంగళవారం హెచ్‌.ఎ.రెహమాన్‌ మాట్లాడుతూ సదస్సులో మైనార్టీల కోసం సీఎం చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపిస్తారని తొలుత అంతా ఆశించారన్నారు. అయితే ఆయన ప్రసంగంలో కొత్తదనం లేకపోవడంతో మైనార్టీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సభలో ప్లకార్డులు ప్రదర్శించారన్నారు. వారి ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన సీఎం అందుకు విరుద్ధంగా పోలీసులను ప్రయోగించి వారిని సభ నుంచి తీసుకెళ్లి చిత్ర హింసలకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముస్లింల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని, ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని  రెహమాన్‌ హెచ్చరించారు. 

సభలో నిరసన చేస్తే తప్పా 
సభలో హక్కులను కాలరాస్తున్నారని ప్లకార్డులతో నిరసన తెలియజేస్తే తప్పా.? అని ఏపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్‌ బాషా ప్రశ్నించారు. పార్లమెంటులో మీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలపలేదా.? మరి వారిని అరెస్టు చేసి కేసులు పెట్టలేదే అన్నారు. విజయవాడ పార్లమెంటరీ కో ఆర్డినేటర్‌ ఎస్‌కె.మహ్మద్‌ ఇక్బాల్‌ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలను టీడీపీ చిన్నచూపు చూస్తోందన్నారు. బాధిత యువకులను పలువురు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు పరామర్శించారు. హెచ్‌.ఎ.రెహమాన్‌ తో పాటు విజయవాడ పార్లమెంటరీ కో ఆర్డినేటర్‌ ఎస్‌కె.మహ్మద్‌ ఇక్బాల్, రాష్ట్ర నేతలు మహ్మద్‌ ఇసాక్, విజయవాడ అధ్యయన కమిటీ నిర్వాహకులు ఎం.ఎస్‌.బేగ్, కర్నూల్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి హఫీజ్‌ ఖాన్, నంద్యాల నియోజకవర్గం ఇన్‌ఛార్జి రవి శిల్పా ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement