బాధితులతో.. పరిహాసం
విజయనగరం కంటోన్మెంట్: ఇటీవల వచ్చిన హుద్‌హుద్ పెను తుపానుతో జిల్లా అతలాకుతలమయింది. తుపాను బీభత్సంతో రూ.2,995 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికార గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. గతంలోని నష్టాలకు బాధితులకు అందజేయాల్సిన పరిహారాలకే దిక్కులేని పరిస్థితుల్లో ఇప్పుడీ భారీ నష్టానికి సాయమందే అవకాశం ఉందా? అని బాధితులు వాపోతున్నారు. గతంలో రావాల్సిన పలు పంట నష్ట పరిహారాలు అందక రైతులు అప్పుల పాలవుతూ ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క ఈ ఏడాది వేసవిలో వడగాడ్పులు భారీగా వీయడంతో వందలాది మంది మృతి చెందారు. మృతుల్లో 140 మందిని ప్రభుత్వం గుర్తించి వారికి లక్ష రూపాయల చొప్పున పరిహారం బాధిత కుటుంబాలకు అందజేస్తామని ప్రకటించింది.
కానీ నేటికీపరిహారం అందలేదు. దీనికి సంబంధించిన ఫైళ్లు ఇంకా పెండింగ్‌లోనే ఎందుకు ఉంచారో అర్థం కావడం లేదు. జిల్లా అధికార యంత్రాంగం కూడా ఈ పరిహారాలపై పెద్దగా పట్టించుకోలేదని బాధిత కుటుం బాలు వాపోతున్నాయి. మే,జూన్ నెలల్లో వీచిన వడగాడ్పులకు మృతి చెందిన వారికి పరిహారాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం కమిటీని నియమించింది. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, డాక్టర్, తహశీల్దార్‌లు కమిటీగా ఎండ వేడిమి తాళలేక వారంతా మృతి చెందారని నివేదించినప్పటికీ ప్రభుత్వం పరిహారాలు ఇప్పటికీ ఇవ్వలేదు. ఇంటికి పెద్ద దిక్కు అయిన వారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా విధులు నిర్వహిస్తుండగా ఎండధాటికి తాళలేక మృతి చెందినప్పటికీ పరిహారం ప్రకటించి ఇప్పటికీ ఇవ్వలేదని ఆయా కుటుంబాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంతవరకు ప్రభుత్వం ప్రక టించిన పరిహారం అందలేదని 69ఏళ్ల వృద్ధురాలు కలెక్టరేట్‌కు వచ్చి వాపోయింది. నెల్లిమర్ల మండలం తాళ్లపూడి పేటకు చెందిన తాళ్లపూడి నారాయణమ్మ మిద్దె ఇంట్లో నివసిస్తోంది. వర్షాలకు మిద్దె ఇంటి గోడ కూలిపోవడంతో కాలు విరిగిపోయిందని నారాయణమ్మ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం క్షతగాత్రులకు రూ.50వేలు, కేంద్ర ప్రభుత్వం మరో రూ.50వేలు ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తే అధికారులు కేవలం రూ.15వేలు మాత్రమే ఇస్తామంటున్నారని వృద్ధురాలి అల్లుడు ఆరోపించాడు. ఇప్పటికే తమ అత్తకు చికిత్స కోస వేలాది రూపాయలు ఖర్చయ్యాయని, ప్రభుత్వాలు ప్రకటించిన పరిహారాన్ని వెంటనే అందజేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరాడు. గ్రామానికి చెందిన కార్యదర్శి రూ.3వేలు ఇస్తే పూర్తి పరిహారం ఇస్తానన్నాడని తీవ్రంగా ఆరోపించాడు. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.