లేని కీడుకు లబ్ధి కోసం.. | Hudhud 'storm damage | Sakshi
Sakshi News home page

లేని కీడుకు లబ్ధి కోసం..

Published Thu, Dec 4 2014 12:45 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM

లేని కీడుకు లబ్ధి కోసం.. - Sakshi

లేని కీడుకు లబ్ధి కోసం..

పిఠాపురం : గాలీవానకు నేలమట్టమైన ఇళ్లు కొన్ని. కడలి కడుపులో కలిసిపోయిన ఇళ్లు కొన్ని. ‘హుద్‌హుద్’ తుపాను దెబ్బకు నిలువనీడ కోల్పోయిన నిజమైన బాధితులు ఎండకు ఎండి, చలికి వణుకుతూ.. మళ్లీ గూళ్లు సమకూర్చుకునేందుకు సర్కారు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు స్వార్థపరులు ఇదే అదనుగా పావులు కదిపారు. నిక్షేపంలా ఉన్న ఇళ్లు కూడా హుద్‌హుద్ తాకిడికి ధ్వంసమైనట్టు చూపుతూ పరిహారాన్ని దండుకోవడానికి చూస్తున్నారు. ఈ అక్రమానికి అధికార పార్టీ నాయకులు సూత్రధారులు. తుపాను సమయంలో తూతూమంత్రంగా సహాయక చర్యలు చేపట్టి, వాటికైనా ఖర్చును రూ.లక్షల్లో చూపుతున్న అధికారులే అధికార పార్టీ వారి పన్నాగానికి దన్నుగా నిలుస్తున్నారు. నష్టపోని ఇళ్లను నాశనమైనట్టు రికార్డులు సృష్టించి, సర్కారు సొమ్ము దుర్వినియోగానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ‘హుద్‌హుద్’ తాకిడికి కొత్తపల్లి మండలంలో 156 గృహాలు ధ్వంసమైనట్టు అధికారులు నివేదికలు తయారు చేశారు.
 
 బాధితులకు నష్టపరిహారం మంజూరు చేయాలని కోరుతూ నివేదికలను ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి పంపారు. అలాగే తుపాను వేళ బాధితులకు భోజన వసతి సౌకర్యాలు కల్పించడానికి రూ.4 లక్షలు ఖర్చు చేసినట్టు లెక్కలు చూపిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు, వారి కనుసన్నల్లో పరిహారానికి అర్హులైన వారి జాబితాలు తయారు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అధికారుల నివేదికలను అనుసరించి బాధితులు ఒక్కొక్కరికీ ముందస్తుగా రూ.5 వేల నష్టపరిహారం మంజూరు కాగా పంపిణీకి రంగం సిద్ధమైంది. పంపిణీ అనంతరం ప్రభుత్వం జాబితాల్లోని బాధితుల్లో ఎస్సీలకు రూ.లక్ష, ఎస్టీలకు రూ.1.05 లక్షలు, బీసీ, ఓసీలకు రూ.75 వేలు కేటాయించి, ఆ మొత్తానికి దాతల నుంచి సేకరించే సొమ్ములో రూ.3 లక్షల చొప్పున జోడించి, ఐఏవై గృహాలతో మోడల్ కాలనీ నిర్మించనుంది. దీంతో ఆ లబ్ధి తమ వారికే చెందేలా  అధికారపార్టీ నేతలు పావులు కదిపారు. అనుచరుల పేర్లను ఇళ్లు కోల్పోయిన బాధితులుగా రాయించారు.
 
 సీఆర్‌జెడ్ పరిధిలోని ఇళ్లకూ నష్టమని నివేదిక..
 నిజానికి హుద్‌హుద్ తాకిడికి మండలం కోనపాపపేటలో సుమారు 50 గృహాలు ధ్వంసమయ్యాయి. అదే ఊళ్లో కొన్ని గృహాలు సముద్రకోతకు గురయ్యాయి. కొత్తపల్లి మండలంలో ఎక్కడా ఇళ్లు పాక్షికంగా కూడా దెబ్బతిన్న దాఖలాలు లేవు. కానీ మండలం మొత్తం మీద 156 గృహాలు దెబ్బ తిన్నట్టు అధికారులు నివేదికలు ఇచ్చారు. ప్రస్తుతం అధికారులు తయారు చేసిన జాబితాలో గతంలో ఉప్పాడ శివారు మాయాపట్నంలో అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన వారిని చేర్చడం అనర్హులకు చోటు కల్పించారన్న నిజాన్ని బయటపెడుతోంది. ఈ అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు సుబ్బంపేట వద్ద స్థలాలు కేటాయించి పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. కాగా సముద్రానికి 500 మీటర్ల దూరం (కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్‌జెడ్)లో ఎలాంటి నిర్మాణాలు జరపకూడదని కచ్చితమైన నిబంధన ఉండగా అధికారులు ఆ పరిధిలోని కొన్ని ఇళ్లకు నష్టం జరిగిందంటూ నివేదికలు ఇవ్వడం గమనార్హం.
 
 క్షేత్రస్థాయిలో గృహ నిర్మాణశాఖ విచారణ
 ఇళ్లు కోల్పోయిన వారి జాబితాల  విషయంపై స్థానిక తహశీల్దారు రియాజ్ హుస్సేన్‌ను వివరణ కోరగా తాను ఇటీవలే బాధ్యతలు చేపట్టానన్నారు. నివేదికలపై విచారణ జరుగుతోందని, అనర్హులుంటే తొలగిస్తామని చెప్పారు. కాగా రెవెన్యూ అధికారుల నివేదికపై విచారణ నిర్వహించిన గృహనిర్మాణశాఖాధికారులు  ఇళ్లు దెబ్బతిన్న బాధితుల జాబితాలో 56 మంది అనర్హులేనని  తేల్చారు. వారిలో ఎక్కువ మంది ఇదివరకు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారేనంటున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహిస్తున్నామని, ఇంకా ఎవరైనా అనర్హులున్నా బయటపడుతుందని ఆ శాఖ ఏఈ సోమిరెడ్డి తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement