బాధితుల దరికి ‘ఆపన్న హస్తం’
జగ్గంపేట : గూడు చెదిరి, గుండె చెదిరిన హుదూద్ తుపాను బాధితులకు లక్ష కిలోల బియ్యం పంపిణీ చేయాలని కంకణం కట్టుకున్న ‘వైఎస్ జగన్ ఆపన్న హస్తం’ స్వచ్ఛంద సేవాసంస్థ లక్ష్యాన్ని సాధించింది. విశాఖ జిల్లాలో తుపాను బాధితుల కడగండ్లకు చలించిన సంస్థ అధ్యక్షుడు, జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్‌కుమార్ వారి కోసం తలపెట్టిన ఈ బృహత్కార్యానికి అనేకులు సహకరించారు. అనుకున్న మేరకు లక్ష కిలోల బియ్యం సేకరణ పూర్తి కావడంతో 20 కిలోల చొప్పున 5 వేల కుటుంబాలకు అందించేందుకు ప్యాకెట్లలో నింపారు. వాటితో వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, పార్టీ శాసనసభాపక్ష నేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జగ్గంపేట నుంచి గురువారం విశాఖ జిల్లాకు బయల్దేరిన పది లారీలకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు జెండా ఊపారు. వాటిని యలమంచిలి, అరకు, పాడేరు తదితర ప్రాంతాలలో బాధితులకు అందజేస్తామని సంస్థ అధ్యక్షుడు నవీన్ తెలిపారు. ఈ సందర్భంగా నెహ్రూ విలేకరులతో మాట్లాడుతూ తుపాను బాధితులను ఆదుకోవాలన్న తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు భారీ ఎత్తున సేకరించిన బియ్యాన్ని గిరిజన బాధితులకు ఎక్కువగా పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలోని పార్టీ నాయకులు, అభిమానులు, దాతలు బియ్యం సమకూర్చారని, ఒక్క జగ్గంపేట నియోజకవర్గం నుంచే నాలుగు లారీల బియ్యం వచ్చిందని చెప్పారు.
డ్వాక్రా మహిళల కన్నీటి ఫలితమే ‘హుదూద్’ విధ్వంసం
ఆడపడుచు కన్నీరు పెట్టుకుంటే అనర్థమని హైందవ ధర్మం చెబుతుందని, రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు కన్నీరు పెట్టుకుంటున్నారని ఇది మంచిది కాదని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి నెహ్రూ అన్నారు. ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖపట్నం హుదూద్ తుపానుకు దెబ్బ తినడానికి ఆడపడుచుల కన్నీరే కారణన్నారు. డ్వాక్రా, రైతు రుణాలు తక్షణమే మాఫీ చేయాలని తాము నిర్వహించిన ధర్నాలకు అనూహ్య స్పందన లభిందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జక్కంపూడి రాజా, సుంకర చిన్ని, అల్లు రాజబాబు, కత్తిపూడి శ్రీను, సీల రమణ, సోమవారం రాజు, రమణారెడ్డి, జనపరెడ్డి బాబు, జీను మణిబాబు, పాలచర్ల సత్యనారాయణ, ఒమ్మి రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.
అచ్యుతాపురంలో
బియ్యం పంచిన నవీన్
అచ్యుతాపురం(విశాఖ జిల్లా) : ‘వైఎస్ జగన్ ఆపన్న హస్తం’ స్వచ్ఛంద సంస్థ తరఫున తూర్పు గోదావరి జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో సేకరించిన లక్ష కిలోల బియ్యం గురువారం విశాఖ జిల్లాకు చేరింది. అందు లో 30 టన్నుల బియ్యం యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ తరఫున విశాఖ జిల్లాలో పలు ప్రాంతాలకు సహాయం అందిస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రకటనలు చేయడం మినహా నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. ప్రగడ మాట్లాడుతూ గ్రామాల్లో బాధితులను గుర్తించి సాయం అందిస్తామన్నారు. అచ్యుతాపురానికి చెందిన కొందరు బాధితులకు నవీన్ చేతుల మీదుగా బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా నాయకులు జమీల్, జంగారెడ్డి జేమ్స్, జంపన రవివర్మ, మండల వైఎస్సార్ సీపీ నాయకులు లాలం రాంబాబు, శ్రీనుబాబు, కోన లచ్చన్నాయుడు, పిన్నంరాజు వాసు, నర్మాల కుమార్, ద్వారపురెడ్డి బాపు, కొరుప్రోలు చిన్నారావు, దాసరి లక్ష్మణరావు పాల్గొన్నారు.