దూసుకొస్తున్న హుదూద్
ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు పొంచి ఉన్న పెను తుపాను ముప్పు
12న విశాఖ-గోపాల్‌పూర్ మధ్య తీరాన్ని తాకే అవకాశం
విశాఖపట్నం/హైదరాబాద్/ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలపైకి హుదూద్ పెను తుపాను దూసుకొస్తోంది. అతి తీవ్రమైన ఈ తుపాను ఈ నెల 12న ఏపీ, ఒడిశాల తీరాన్ని తాకే అవకాశాలున్నాయి. రెండు రోజుల క్రితం బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా రూపం దాల్చి పెను తుపానుగా మారుతోంది. ఇది బుధవారం అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్‌బ్లెయిర్, లాంగ్ ద్వీపాలను దాటింది. అంతకంతకూ తీవ్ర రూపం దాలుస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాలవైపు వస్తోంది. ఏపీ, ఒడిశాల్లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు, పెను గాలులతో బీభత్సం సృష్టించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, ఒడిశాలోని గంజాం, పూరి, ఖుద్రా జిల్లాలపై 11వ తేదీ నుంచి దీని ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
విశాఖకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో..
హుదూద్ తుపాను ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో విశాఖపట్నానికి తూర్పు, ఆగ్నేయ దిశగా వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ రాగల 24 గంటల్లో తీవ్ర తుపానుగా, 36 గంటల్లో పెను తుపానుగా మారనుంది. 12వ తేదీ మధ్యాహ్నానికి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, ఒడిశాలోని గోపాల్‌పూర్ మధ్య తీరం దాటనుంది. ఇది తీరం దాటే సమయంలో తీవ్రమైన వర్షాలు, గంటకు 155 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డెరైక్టర్ జనరల్ లక్ష్మణ్ సింగ్ రాథోర్ చెప్పారు. అయితే, కచ్చితంగా ఎక్కడ తీరం దాటుతుందో ఇంకా అంచనాకు రాలేకపోతున్నారు. అయితే, విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య 200 కిలోమీటర్లలో ఎక్కడైనా తీరాన్ని తాకవచ్చని ఐఎండీ తుపాను హెచ్చరికల విభాగం శాస్త్రవేత్త ఎం.మహాపాత్ర చెప్పారు. కాగా, తుపాను ముప్పు నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. మరోవైపు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులూ రెండు రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
పైలీన్ తర్వాత మళ్లీ తీవ్ర తుపాను
గత ఏడాది సంభవించిన పైలీన్ తుపాను తర్వాత హుదూద్ అంత్యంత తీవ్రమైన రెండో తుపానుగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పైలీన్ తుపాను వచ్చిన సమయంలో గంటకు 210 నుంచి 220 కిలోమీటర్ల వేగంతా గాలులు వీచాయి. హుదూద్ ఇంత తీవ్రమైన తుపాను కాకపోయినప్పటికీ, భారీ నుంచి అతి భారీ వర్షాలు, పెను గాలులతో తీవ్రంగా ప్రభావాన్ని చూపే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
‘హుదూద్’.. ఒమన్ పక్షి
రెండు రోజుల క్రితం అండమాన్ సమీపంలో ఏర్పడిన ఈ తుపానుకు హుదూద్‌గా నామకరణం చేశారు. హుదూద్ ఒమన్ దేశానికి చెందిన ఓ పక్షి. దాని పేరుతోనే ఈ తుపానును పిలుస్తున్నారు.