Hudood major storms
-
రైళ్ల రద్దుతో ప్రయూణికుల అవస్థలు
పలాస: హుదూద్ పెను తుపాను ప్రభావంతో ఈస్ట్‌కోస్టు రైల్వేశాఖ అధికారులు పలురైళ్లు రద్దు చేశారు. దీం తో ప్రయూణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. పలాస రైల్వేస్టేషన్లో ప్రయాణికుల నుంచి రావాలసిన ఆదాయానికి భారీ గండి ఏర్పడింది. ప్రయాణికుల నుంచి రోజుకి రూ.3 లక్షలు ఆదాయం లభించేది. రెండు రోజుల్లో సుమారు రూ.6 లక్షలు నష్టం జరిగిందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం ట్రైల్ బేసిడ్‌గా పాసింజరు రైళ్లను అధికారులు నడిపారు. పలాస రైల్వేస్టేషన్‌కు రావాల్సిన చెన్నై-హౌరా మెయిల్, బెంగళూరు-భువనేశ్వర్ ప్రశాంతి, యశ్వంత్‌పూర్-హౌరా, కొచ్చి-గౌహతి, హౌరా-సికింద్రాబాదు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, దిబ్రుగర్-కన్యాకుమారి, సికింద్రాబాదు-భువనే శ్వర్, త్రివేండ్ర-గౌహతి తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లు డైవర్ట్ చేశారు. పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. ఇదిలా ఉండగా హుదూద్ తుపాను ప్రభావం తీవ్రత తగ్గడంతో సోమవారం సాయంత్రం పలాస రైల్వేస్టేషన్‌కు పలు రైళ్ల రాకపోకలను ప్రారంభించాయి. భువనేశ్వర్ నుంచి విశాఖ పాసింజరు రైలును సోమవారం సాయంత్రం 6 గంటలకు ట్రయల్న్‌గ్రా నడిపించారు. అలాగే భువనేశ్వర్-పలాస ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ ఉదయం 11.30 గంటలకు పలాస రాగా, సాయంత్రం 6.30 గంటలకు భువనేశ్వర్‌కు తిరిగి వెళ్లింది. భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్ వయా విజయనగరం, రాయపూర్ మీదుగా వెళ్లింది. కొవ్వొత్తుల వెలుగులో రైల్వేసిబ్బంది సేవలు ఆమదాలవలస: శ్రీకాకుళంరోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ మీదుగా ప్రయాణించే రైళ్లు రద్దవ్వడంతో ప్రయూణికులు ఇబ్బంది పడ్డారు. అరుుతే ముందస్తుగా రిజర్వేషన్లు చేయించుకొన్న ప్రయాణికులు ఆ రిజర్వేషన్లు రద్దు చేసుకునేందుకు వారి సౌకర్యార్ధం రైల్వే బుకింగ్ కౌంటర్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్ నడిపించేందుకు విద్యుత్ సేవలు లేకపోవడంతో కంప్యూటర్లు పని చేయకపోవడంతో మ్యాన్యువల్‌గా సేవలు అందించేందుకు కౌంటర్లో రైల్వేసిబ్బంది కొవ్వొత్తివెలుగులో పనిచేస్తూ సేవలు అందించారు. పలాస వరకు నడిచిన రెండు రైళ్లు ఇచ్ఛాపురం: రైల్వే అధికారులు సోమవారం భువనేశ్వర్ నుంచి పలాస వరకు రెండు రైళ్లను నడిపారు. భువనేశ్వర్ - విశాఖ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ప్యాసింజర్‌గా మార్చి భువనేశ్వర్- పలాస మధ్య నడిపారు. ఉదయం పదిన్నర గంటలకు రైలు ఇచ్ఛాపురం చేరుకుంది. పలాస- పూరి మధ్య మరో రైలును కూడా ప్యాసింజర్‌గా నడిపారు. దీంతో పలాస వరకు ప్రయాణం చేసే వారి ఇబ్బందులు కొంతమేరకు తగ్గాయి. పూర్తి స్థాయిలో రైళ్ల రాకపోకలు ఎప్పటి నుంచి సాగుతాయో ఇంకా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల రావలసి ఉందని స్థానిక స్టేషన్ మేనేజర్ కె.డి.పట్నాయక్ చెప్పారు. -
చేతులెత్తేసిన అధికార యంత్రాంగం
దిక్కులేని స్థితిలో బాధితులు అంచనాలకు మించిన రీతిలో హుదూద్ పెను తుపాను విరుచుకుపడటంతో అధికార యంత్రాంగం దాదాపుగా చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులుగా చేస్తున్న ముందస్తు కసరత్తు కీలక సమయంలో ఎందుకూ కొరగాకుండా పోయింది. శనివారం రాత్రికి ఎన్ఎండీఆర్ఎఫ్, సైనిక బలగాలు ఎంత మందిని పునరావాస కేంద్రాలకు తరలించారో అంతవరకే అధికార యంత్రాంగం సఫలమైంది. కానీ.. తుపాను విరుచుకుపడిన తరువాత యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక ఆచరణలో ఏమాత్రం కనిపించ లేదు. హుదూద్ తుపాను దాటికి ప్రజలు విలవిలలాడుతుంటే కంట్రోల్ రూంలు పని చేయకుండాపోయాయి. ముందస్తు వైద్య సదుపాయాల ఏర్పాట్లు గానీ.. సమాచార, రవాణా వ్యవస్థలను సరిచేయాలన్న కార్యాచరణ ప్రణాళిక గానీ ఏమాత్రం అమలు కాలేదు. అసలు తుపాను తీరం దాటిందా లేదా అన్నది తెలియక విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజలు ఆదివారం సాయంత్రం వరకూ అయోమయంలోనే ఉండిపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నంలో ఓ హాస్టల్లో విద్యార్థి అస్వస్థతకు గురై కంట్రోల్ రూంలను సంప్రదించాలని ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. అనకాపల్లి సమీపంలోని కశింకోట రైల్వే క్వార్టర్లు ధ్వంసమై ప్రజలు హాహాకారాలు చేశారు. కానీ వారిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. విశాఖపట్నంతో పాటు అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి, విజయనగంర జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం, శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, ఎచ్చెర్ల, సంతబొమ్మాలి, పొలాకి, గార, తూర్పుగోదావరి జిల్లాలోని తొండంగి, కొత్తపల్లి తదితర మండలాల్లో ప్రజలు సహాయం కోసం రోజంతా నిరీక్షించినా ప్రభుత్వ యంత్రాంగం నుంచి స్పందన శూన్యం. ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం పూర్తిగా చేష్టలుడిగి చూస్తుండిపోయింది. పనిచేయని టోల్ ఫ్రీ నంబరు... సమాచార వ్యవస్థ కుప్పకూలి సెల్ఫోన్లు పనిచేయకపోవడంతో వేరే ప్రాంతాల్లో ఉన్న బంధుమిత్రులు ఉత్తరాంధ్రలోని తమ వారి సమాచారం తెలుసుకునేందుకు, వర్షం పరిస్థితి కనుక్కునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఉచిత ఫోన్ కాల్ ద్వారా తుపాను సమాచారం తెలుసుకోవచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టోల్ ఫ్రీ నంబరు 180042500002 మూగబోయింది. ఎలాంటి సమాచారం కావాలన్నా ఈ నంబరుకు ఫోన్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చాలా సెల్ఫోన్లకు మెసేజ్‌లు పంపింది. అయితే ఈ నంబరుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇది పనిచేయలేదని రంగారెడ్డి జిల్లా బాచుపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీరు సత్యప్రసాద్ వాపోయారు. ‘మా భార్యా పిల్లలు విశాఖపట్నంలో ఉన్నారు. వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలని ఆదివారం ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నా అక్కడ సెల్‌టవర్లు కూలిపోవడంవల్ల ఫోన్లు పనిచేయడంలేదు. ప్రభుత్వం ఇచ్చిన నంబరూ పనిచేయలేదు..’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇదిలవుంటే.. తుపాను నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఏపీ డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వివరాల కోసం 040-23237817, 23237941, 23237958 నంబర్లను సంప్రదించాలి. -
దూసుకొస్తున్న హుదూద్
ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు పొంచి ఉన్న పెను తుపాను ముప్పు 12న విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరాన్ని తాకే అవకాశం విశాఖపట్నం/హైదరాబాద్/ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలపైకి హుదూద్ పెను తుపాను దూసుకొస్తోంది. అతి తీవ్రమైన ఈ తుపాను ఈ నెల 12న ఏపీ, ఒడిశాల తీరాన్ని తాకే అవకాశాలున్నాయి. రెండు రోజుల క్రితం బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా రూపం దాల్చి పెను తుపానుగా మారుతోంది. ఇది బుధవారం అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్‌బ్లెయిర్, లాంగ్ ద్వీపాలను దాటింది. అంతకంతకూ తీవ్ర రూపం దాలుస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాలవైపు వస్తోంది. ఏపీ, ఒడిశాల్లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు, పెను గాలులతో బీభత్సం సృష్టించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, ఒడిశాలోని గంజాం, పూరి, ఖుద్రా జిల్లాలపై 11వ తేదీ నుంచి దీని ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. విశాఖకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో.. హుదూద్ తుపాను ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో విశాఖపట్నానికి తూర్పు, ఆగ్నేయ దిశగా వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ రాగల 24 గంటల్లో తీవ్ర తుపానుగా, 36 గంటల్లో పెను తుపానుగా మారనుంది. 12వ తేదీ మధ్యాహ్నానికి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, ఒడిశాలోని గోపాల్పూర్ మధ్య తీరం దాటనుంది. ఇది తీరం దాటే సమయంలో తీవ్రమైన వర్షాలు, గంటకు 155 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డెరైక్టర్ జనరల్ లక్ష్మణ్ సింగ్ రాథోర్ చెప్పారు. అయితే, కచ్చితంగా ఎక్కడ తీరం దాటుతుందో ఇంకా అంచనాకు రాలేకపోతున్నారు. అయితే, విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య 200 కిలోమీటర్లలో ఎక్కడైనా తీరాన్ని తాకవచ్చని ఐఎండీ తుపాను హెచ్చరికల విభాగం శాస్త్రవేత్త ఎం.మహాపాత్ర చెప్పారు. కాగా, తుపాను ముప్పు నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. మరోవైపు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులూ రెండు రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. పైలీన్ తర్వాత మళ్లీ తీవ్ర తుపాను గత ఏడాది సంభవించిన పైలీన్ తుపాను తర్వాత హుదూద్ అంత్యంత తీవ్రమైన రెండో తుపానుగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పైలీన్ తుపాను వచ్చిన సమయంలో గంటకు 210 నుంచి 220 కిలోమీటర్ల వేగంతా గాలులు వీచాయి. హుదూద్ ఇంత తీవ్రమైన తుపాను కాకపోయినప్పటికీ, భారీ నుంచి అతి భారీ వర్షాలు, పెను గాలులతో తీవ్రంగా ప్రభావాన్ని చూపే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ‘హుదూద్’.. ఒమన్ పక్షి రెండు రోజుల క్రితం అండమాన్ సమీపంలో ఏర్పడిన ఈ తుపానుకు హుదూద్గా నామకరణం చేశారు. హుదూద్ ఒమన్ దేశానికి చెందిన ఓ పక్షి. దాని పేరుతోనే ఈ తుపానును పిలుస్తున్నారు.