చేతులెత్తేసిన అధికార యంత్రాంగం
దిక్కులేని స్థితిలో బాధితులు
అంచనాలకు మించిన రీతిలో హుదూద్ పెను తుపాను విరుచుకుపడటంతో అధికార యంత్రాంగం దాదాపుగా చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులుగా చేస్తున్న ముందస్తు కసరత్తు కీలక సమయంలో ఎందుకూ కొరగాకుండా పోయింది. శనివారం రాత్రికి ఎన్‌ఎండీఆర్‌ఎఫ్, సైనిక బలగాలు ఎంత మందిని పునరావాస కేంద్రాలకు తరలించారో అంతవరకే అధికార యంత్రాంగం సఫలమైంది. కానీ.. తుపాను విరుచుకుపడిన తరువాత యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక ఆచరణలో ఏమాత్రం కనిపించ లేదు. హుదూద్ తుపాను దాటికి ప్రజలు విలవిలలాడుతుంటే కంట్రోల్ రూంలు పని చేయకుండాపోయాయి. ముందస్తు వైద్య సదుపాయాల ఏర్పాట్లు గానీ.. సమాచార, రవాణా వ్యవస్థలను సరిచేయాలన్న కార్యాచరణ ప్రణాళిక గానీ ఏమాత్రం అమలు కాలేదు. అసలు తుపాను తీరం దాటిందా లేదా అన్నది తెలియక విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజలు ఆదివారం సాయంత్రం వరకూ అయోమయంలోనే ఉండిపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నంలో ఓ హాస్టల్లో విద్యార్థి అస్వస్థతకు గురై కంట్రోల్ రూంలను సంప్రదించాలని ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. అనకాపల్లి సమీపంలోని కశింకోట రైల్వే క్వార్టర్లు ధ్వంసమై ప్రజలు హాహాకారాలు చేశారు. కానీ వారిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. విశాఖపట్నంతో పాటు అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి, విజయనగంర జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం, శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, ఎచ్చెర్ల, సంతబొమ్మాలి, పొలాకి, గార, తూర్పుగోదావరి జిల్లాలోని తొండంగి, కొత్తపల్లి తదితర మండలాల్లో ప్రజలు సహాయం కోసం రోజంతా నిరీక్షించినా ప్రభుత్వ యంత్రాంగం నుంచి స్పందన శూన్యం. ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం పూర్తిగా చేష్టలుడిగి చూస్తుండిపోయింది.
పనిచేయని టోల్ ఫ్రీ నంబరు...
సమాచార వ్యవస్థ కుప్పకూలి సెల్‌ఫోన్లు పనిచేయకపోవడంతో వేరే ప్రాంతాల్లో ఉన్న బంధుమిత్రులు ఉత్తరాంధ్రలోని తమ వారి సమాచారం తెలుసుకునేందుకు, వర్షం పరిస్థితి కనుక్కునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఉచిత ఫోన్ కాల్ ద్వారా తుపాను సమాచారం తెలుసుకోవచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టోల్ ఫ్రీ నంబరు 180042500002 మూగబోయింది. ఎలాంటి సమాచారం కావాలన్నా ఈ నంబరుకు ఫోన్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చాలా సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు పంపింది. అయితే ఈ నంబరుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇది పనిచేయలేదని రంగారెడ్డి జిల్లా బాచుపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరు సత్యప్రసాద్ వాపోయారు. ‘మా భార్యా పిల్లలు విశాఖపట్నంలో ఉన్నారు. వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలని ఆదివారం ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నా అక్కడ సెల్‌టవర్లు కూలిపోవడంవల్ల ఫోన్లు పనిచేయడంలేదు. ప్రభుత్వం ఇచ్చిన నంబరూ పనిచేయలేదు..’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇదిలవుంటే.. తుపాను నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఏపీ డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వివరాల కోసం 040-23237817, 23237941, 23237958 నంబర్లను సంప్రదించాలి.