‘నవయుగ’ ఎగనామం!  | Huge backlog taxes to Muthukur panchayat | Sakshi
Sakshi News home page

‘నవయుగ’ ఎగనామం! 

Published Thu, Nov 14 2019 5:01 AM | Last Updated on Thu, Nov 14 2019 5:01 AM

Huge backlog taxes to Muthukur panchayat - Sakshi

సాక్షి, నెల్లూరు: పారిశ్రామికాభివృద్ధి పేరుతో కృష్ణపట్నం పోర్టు భూములు దక్కించుకున్న ‘నవయుగ’ సంస్థ స్థానిక పంచాయితీకి రూ.400 కోట్లకు పైగా పన్నులు ఎగ్గొట్టింది! పోర్టు ఏర్పాటుతో తమ ప్రాంతం అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనే ఆశతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు గ్రామ ప్రజలు తక్కువ ధరకే నవయుగకు భూములు అప్పగించారు. రైతులిచ్చిన భూములతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకున్న పోర్టు యాజమాన్యం స్థానిక పంచాయతీకి మాత్రం మొండిచెయ్యి చూపింది.   

భూమి, భవనాల విలువ రూ.6,610.08 కోట్లు 
కృష్ణపట్నం పోర్టు నిర్మాణం జరిగి దాదాపు 11 ఏళ్లు గడుస్తున్నా స్థానిక పంచాయతీకి యాజమాన్యం రూపాయి కూడా పన్ను చెల్లించిన పాపాన పోలేదు. ఏపీ పంచాయతీరాజ్‌ 1994 చట్టం సెక్షన్‌ 61 ఐ, ఏ ప్రకారం పంచాయతీ పరిధిలోని వాణిజ్య, నివాస భవనాలకు పన్నులు వసూలు చేసే హక్కు ఉంది. ముత్తుకూరు రెవెన్యూ పరి«ధిలో పోర్టు కోసం సేకరించిన 2,625 ఎకరాల తాజా మార్కెట్‌ విలువ దాదాపు రూ.6,352 కోట్లుగా అధికారులు నిర్ణయించారు. టీటీటీ పోర్టు ట్రేడ్, ట్రాన్స్‌పోర్ట్‌ టెర్మినల్స్, స్టోరేజీ, వేర్‌హౌస్‌ భవన సముదాయాల భవనాలతో కలిపి భూమి విలువను మొత్తం రూ.6,610.08 కోట్లుగా ధ్రువీకరించారు. 

నామమాత్రంగా కూడా చెల్లించని వైనం.. 
భూములు, భవనాల మార్కెట్‌ విలువలో స్థానిక పంచాయతీకి రూపాయి చొప్పున పన్నులు చెల్లించాలి. కానీ అధికారులు మాత్రం నామమాత్రంగా రూ.0.50 చొప్పున నిర్ణయించి లెక్కలు కట్టారు. ఆ ప్రకారం చూసినా రూ.6,610.08 కోట్ల విలువ చేసే కృష్ణపట్నం పోర్టు, భూములకు అర్ధ రూపాయి చొప్పున పన్ను వేసినా పంచాయతీకి దాదాపు రూ.33.05 కోట్లు (నెట్‌ ట్యాక్స్‌) చెల్లించాలి. ఆపై ప్రభుత్వ వనరులు ఉపయోగించుకున్నందుకు 8 శాతం లైబ్రరీ సెస్‌కు రూ.2.64 కోట్లు, పది  శాతం వాటర్‌ సెస్‌కు రూ.3.30 కోట్లు, పది శాతం లైటింగ్‌ సెస్‌కు రూ.3.30 కోట్లు, 20 శాతం డ్రైనేజీ సెస్‌కు రూ.6.61 కోట్లు చొప్పున ఏడాదికి రూ.48.91 కోట్లు ముత్తుకూరు పంచాయతీకి కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం చెల్లించాల్సి ఉంది. 

కొలతలకు అనుమతి నిరాకరణ 
ముత్తుకూరు పంచాయతీకి కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం దాదాపు రూ.400 కోట్లకుపైగా పన్నులు బకాయి పడినట్లు అధికారులు తేల్చారు. పలుమార్లు పంచాయతీ ఆడిటింగ్‌ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసి పన్నులు వసూళ్లు చేయాలని ఆదేశించారు. పన్నులు చెల్లించాలని పంచాయతీ కార్యదర్శి పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్వీకరించలేదు. ఏటా మారుతున్న విలువల ప్రకారం పోర్టు భవనాల కొలతలు తీసుకునేందుకు కూడా సిబ్బందిని అనుమతించకపోవడం గమనార్హం. 

విజిలెన్స్‌ ఆరా..  
ముత్తుకూరు పంచాయతీకి కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం పన్నులు బకాయి పడటంపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఇటీవల ఆరా తీశారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. పన్నుల ఎగవేతపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అధికారులు తెలిపారు.  

నోటీసులకు  స్పందన లేదు..
కృష్ణపట్నం యాజమాన్యం ముత్తుకూరు పంచాయతీకి పన్నులు బకాయి పడింది. పోర్టు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు పన్నులు చెల్లించలేదు. పన్నులు చెల్లించాలని గతంలో పలుమార్లు 
నోటీసులు జారీ చేసినా ఎలాంటి స్పందన లేదు. 
– సుస్మితారెడ్డి, ఇన్‌చార్జి డీపీవో, నెల్లూరు 

పోర్టుకి  పన్ను  మినహాయింపు లేదు.. 
కృష్ణపట్నం పోర్టుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పన్ను మినహాయింపు లేదు. ఇప్పటి వరకు స్థానిక సంస్థలకు పన్నులు చెల్లించలేదు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 
– షేక్‌ అబ్దుల్‌ షఫీఉల్లా, రాష్ట్ర కార్యదర్శి, బీజేపీ మైనార్టీ మోర్చా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement