టన్నెళ్లలో టన్నుల్లో అవినీతి | Huge Corruption in the name of Tunnel | Sakshi
Sakshi News home page

టన్నెళ్లలో టన్నుల్లో అవినీతి

Published Wed, Mar 6 2019 3:30 AM | Last Updated on Wed, Mar 6 2019 3:30 AM

Huge Corruption in the name of Tunnel - Sakshi

సాక్షి, అమరావతి: రోజుకు ఐదారు మీటర్ల మేర మాత్రమే సొరంగం తవ్వుతున్నారనే నెపంతో పాత కాంట్రాక్టర్లపై ప్రభుత్వ పెద్దలు వేటు వేశారు. సొరంగాల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి, టెండర్‌ నిబంధనలను అడ్డుపెట్టుకుని కోటరీ కాంట్రాక్టర్లకే కట్టబెట్టారు. మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇచ్చినప్పుడు మొదటి విడత కమీషన్‌లు దండుకున్నారు. సొరంగాలను తవ్వే టీబీఎం (టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌)కు కొత్త బుష్‌లు, కన్వేయర్‌ బెల్ట్‌లు అమర్చి మరమ్మతులు చేసేందుకు రూ.245.63 కోట్లను కేటాయించేశారు. అయితే అవేమీ చేయకనే ఆ నిధులను కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన ప్రభుత్వ పెద్దలు మింగేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 43.50 టీఎంసీలను తరలించి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జి లో 4.47లక్షల ఎకరాలకు సాగునీళ్లు, 15.25లక్షల మందికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టును 2005లో రూ.5,150 కోట్లతో చేపట్టారు. తన హయాంలో రూ.3,433.84 కోట్లను ఖర్చుచేసి 75 శాతానికిపైగా పనులు పూర్తి చేశారు. డిసెంబర్‌ 2016 నాటికే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాకు నీటిని విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు జూన్‌ 2, 2016న ప్రకటించారు.

ఆ క్రమంలో సొరంగాల పనులను వేగంగా పూర్తి చేయాలంటే.. టీబీఎంలకు కొత్త బుష్‌లు, కన్వేయర్‌ బెల్ట్‌లు అమర్చాలని కాంట్రాక్టర్లు ప్రతిపాదించారు. నిబంధనలను తుంగలో తొక్కి రూ.68.44 కోట్లను జూన్‌ 5, 2016న సర్కార్‌ మంజూరు చేసింది. కానీ.. టీబీఎంలకు ఎలాంటి మరమ్మతులు చేయకుండానే చేసినట్లు చూపి ఆ నిధులను కాంట్రాక్టర్లతో కలిసి కీలక మంత్రి మింగేశారు. దాంతో రోజుకు ఐదారు మీటర్ల చొప్పున మాత్రమే సొరంగాల పనులు జరిగేవి. జనవరి, 2019 నాటికి మొదటి సొరంగం, ఆగస్టు, 2019 నాటికి రెండో సొరంగం పూర్తి చేసి వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు జూన్‌ 8, 2018న మరోసారి హామీ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్‌ను 18.8 కిమీలు తవ్వాలి. జూన్, 2018 వరకూ 15.2 కిమీల పనులు పూర్తయ్యాయి. రెండో టన్నెల్‌ను 18.787 కిమీలు తవ్వాలి. జూన్, 2018 వరకూ 10.750 కి.మీలు పూర్తయ్యాయి. రోజుకు ఐదారు మీటర్ల మేర కూడా పనులు చేయడం లేదనే నెపంతో.. పాత కాంట్రాక్టర్లపై చంద్రబాబు వేటు వేయించారు. మొదటి సొరంగం పనుల్లో రూ.116.447 కోట్లు.. రెండో సొరంగంలో రూ.299.48 కోట్ల విలువైన పనులు మిగిలిపోయాయి.

చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. మొదటి సొరంగం పనుల వ్యయాన్ని రూ.292.15 కోట్లకు, రెండో సొరంగం పనుల వ్యయాన్ని రూ.720.26 కోట్లకు పెంచేశారు. రోజుకు కనీసం సగటున పది మీటర్ల చొప్పున సొరంగం తవ్వాలనే లక్ష్యంతో టెండర్లు పిలిచారు. మొదటి టన్నెల్‌ పనులను రూ.245.39 కోట్లకు మేఘకు, రెండో టన్నెల్‌ పనులను రూ.597.11 కోట్లకు రిత్విక్‌కు గత నవంబర్‌లో కట్టబెట్టారు. మొబిలైజేషణ్‌ అడ్వాన్సుల కింద రూ.84.2 కోట్లను ఇచ్చేసి.. వాటినే తొలి విడత కమీషన్‌ల కింద వసూలు చేసుకున్నారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరును పరిశీలిస్తే మొదటి సొరంగం మార్చి 2020 నాటికి రెండో సొరంగం పనులు జనవరి, 2021 నాటికి కూడా పూర్తయ్యే అవకాశాలు లేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పాత కాంట్రాక్టర్లను కొనసాగించినా అదే సమయానికి పనులు పూర్తయ్యే అవకాశం ఉండేదని, ప్రభుత్వానికి రూ.596.36 కోట్లు ఆదా అయ్యేవని జలవనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement