సాక్షి, అమరావతి : పోలవరం నిర్మాణాన్ని ప్రభుత్వ పెద్దలు కమీషన్లు కురిపించే అక్షయపాత్రలా మార్చుకున్నారనేందుకు ఇది మరో తార్కాణం! ఎడమ కాలువ నాలుగో ప్యాకేజీ కింద మిగిలిపోయిన రూ.102.39 కోట్ల పనులను పాత కాంట్రాక్టర్ నుంచి తప్పించిన ముఖ్యనేత తన సన్నిహితుడికి నామినేషన్‌పై కట్టబెట్టిన అనంతరం అంచనా వ్యయాన్ని నాలుగు రెట్లకుపైగా అదనంగా పెంచేయటం గమనార్హం.
పాత ధరలతో పనులు అంటూ...
పోలవరం ఎడమ కాలువ నాలుగో ప్యాకేజీలో మిగిలిన పనులను ఆరెస్సార్–సాగిట్టాల్ సంస్థ పాత ధరలతోనే చేపడుతుందని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు నామినేషన్ పద్ధతిలో జలవనరుల శాఖ అధికారులు పనులను అప్పగించారు. అయితే మిగిలిపోయిన పనుల అంచనా వ్యయాన్ని రూ.440.53 కోట్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్ నుంచి కమీషన్ల రూపంలో ముఖ్యనేతకు రూ.200 కోట్ల మేర దక్కనున్నట్లు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
బిల్లులు రాక ఆగిన పనులు..
పోలవరం ఎడమ కాలువ నాలుగో ప్యాకేజీ (69.145 కి.మీ. నుంచి 93.70 కి.మీ. వరకూ కాలువ తవ్వకం, లైనింగ్, 1,243 మీటర్ల పొడవున అక్విడెక్టుల నిర్మాణ పనులను రూ.206.80 కోట్లతో పూర్తి చేసేలా తొలుత సాబీర్‌డ్యామ్ అండ్ వాటర్ వర్క్స్ కన్‌స్ట్రక్షన్ కంపెనీతో 2005 మార్చి 23న ఒప్పందం కుదిరింది. అయితే రూ.104.41 కోట్ల విలువైన (50.49 శాతం) పనులు మాత్రమే పూర్తి చేసింది. 2009 తర్వాత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఎడమ కాలువ పనులను కాంట్రాక్టర్లు ఆపేశారు.
నామినేషన్‌పై పనులు...
పోలవరం ఎడమ కాలువ పనులపై 2017 మే 21న సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాలుగో ప్యాకేజీలో మిగిలిన పనులను పాత ధరలకే పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన ఆరెస్సార్–సాగిట్టాల్ సంస్థకు నామినేషన్ పద్ధతిలో అప్పగించాలని ఆదేశించారు. ఆర్థిక, జలవనరులశాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చుతూ సర్కార్ ఆ సంస్థకే పనులు కట్టబెట్టింది. పాత ధరలకే పూర్తి చేస్తామన్న ఆ సంస్థకు ఆ తర్వాత ధరల సర్దుబాటు (జీవో 22) కింద, పనుల పరిమాణం పెరిగితే ఆ మేరకు అదనపు బిల్లులు(జీవో 63) చెల్లించాలని సర్కార్ ఆదేశించింది. 36 కాంక్రీట్ నిర్మాణాలకు జీవో 22, జీవో 63లను వర్తింపజేయడం వల్ల రూ.51.22 కోట్లు అదనంగా ఇవ్వాల్సి ఉంటుందని ఎడమ కాలువ అధికారులు లెక్క కట్టారు. ఉన్నత స్థాయి నుంచి తీవ్ర ఒత్తిళ్లు రావడంతో చేసేది లేక రూ.51.22 కోట్లు అదనంగా ఇచ్చేందుకు స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్‌ఎల్‌ఎస్‌సీ) ఆమోద ముద్ర వేసింది.
కాలువ తవ్వకం, లైనింగ్ పనులకూ..
కాంక్రీట్ నిర్మాణాలకు జీవో 22, జీవో 63ల కింద అదనపు బిల్లులు ఇచ్చేందుకు ఎస్‌ఎల్‌ఎస్‌సీ అంగీకరించాక 4.70 కి.మీ. మేర కాలువ తవ్వకం, లైనింగ్ పనులకూ తాజా ధరలను వర్తింపజేసి అదనపు బిల్లులు ఇవ్వాలని జలవనరుల శాఖ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. నామినేషన్ పద్ధతిలో అప్పగించే సమయంలో పాత ధరలకే పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ అంగీకరించారని గుర్తు చేసిన అధికారులపై ముఖ్యనేత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో చేసేదిలేక తాజా ధరల మేరకు మిగిలిన కాలువ తవ్వకం, లైనింగ్ పనులకు రూ.389.32 కోట్లను అదనంగా చెల్లించాలంటూ పోలవరం ఎడమ కాలువ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడి రావడంతో ఆ ప్రతిపాదనలపై ఎస్‌ఎల్‌ఎస్‌సీ ఆమోద ముద్రవేసింది.
మిగిలిన పనుల విలువ రూ.102.39 కోట్లు
కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకున్నాక పోలవరం ఎడమ కాలువ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,954.74 కోట్ల నుంచి రూ.3,645.15 కోట్లకు పెంచుతూ 2016 డిసెంబర్ 6న ఉత్తర్వులు ఇచ్చింది. ఆ వెంటనే పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను 60 సీ నిబంధన కింద తొలగించింది. ఈ క్రమంలో నాలుగో ప్యాకేజీ కాంట్రాక్టర్‌పై కూడా వేటు వేసింది. అప్పటికే నాలుగో ప్యాకేజీలో రూ.104.41 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. మరో రూ.102.39 కోట్ల పనులు మాత్రమే మిగిలిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment