కలెక్టరేట్, న్యూస్‌లైన్ : నీటిృబొట్టు.. బొట్టు.. కలిసి ప్రవాహమైనట్టు జనం.. జనం.. ప్రభంజనమై సమైక్యాంధ్రోద్యమంలోకి కదిలివస్తున్నారు. కాంగ్రెస్ విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉప్పెనలా తరలివస్తున్నారు. ఉద్యమమై ఉరికివస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత, మహిళలు, వ్యాపారులు ఇలా ఒకరేమిటి సహస్రవృత్తుల సమస్త జనులు భుజం భుజం కలిపి కదం తొక్కుతూ పదం పాడుతూ స్వచ్ఛందంగా తరలివస్తున్నారు.ఆందోళనకారులంతా కలెక్టరేట్ వైపునకు దూసుకువస్తున్నారు. ఏడవ రోజైన మంగళవారం కూడా కలెక్టరేట్ ప్రాంతం జన జాతరలా మారింది.
సోనియా.. క్విట్ ఇండియా :
రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి బరి తెగించిన కాంగ్రెస్ అధినేత్రి ‘సోనియా.. క్విట్ ఇండియా’ అంటూ ఉపాధ్యాయులు నినదించారు. పిల్లలకు పాఠాలే కాదు- స్వార్థ రాజకీయాలకు గుణపాఠాలు సైతం చెప్పగలమన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం రెండవ రోజుకు చేరాయి. వివిధ సంఘాలకు చెందిన వందలాది మంది ఉపాధ్యాయులు దీక్షా శిబిరానికి తరలివచ్చారు. మహిళా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో దీక్షల్లో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ నేతలు ప్రసంగిస్తూ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోకపోతే అధికార పీఠాలను కదిలించే స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఉద్యమం ఉరకలెత్తడంతో జడిసిన నాటి బ్రిటీష్ ప్రభుత్వమే బెంగాల్ విభజనను ఉపసంహరించుకుందన్నారు. బెర్లిన్ గోడ కుప్పకూలడానికి సమైక్యతావాదానికున్న బలమే కారణమని విశ్లేషించారు.
సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం వల్లే హై లెవల్ కమిటీ ఏర్పాటు చేస్తామంటూ కేంద్రంలోని కాంగ్రెస్ నేతలు అంటున్నారని పేర్కొన్నారు.బీజేపీ మద్దతుతో విభజన బిల్లు పార్లమెంటులో నెగ్గుతుందని చెబుతున్నారన్నారు. ఇందుకు విరుగుడుగా సీమాంధ్ర ఎంపీలు రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభాన్ని సృష్టించాలన్నారు. రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు కాకుండా గవర్నర్‌కు సమర్పించడం ద్వారా తమ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ రాదని భయపడాల్సిన అవసరం లేదని, తామే చందాలు పోగుచేసి గెలిపించుకుంటామని స్పష్టంచేశారు.
దిష్టిబొమ్మలతో నిత్యాగ్నిహోమం
ప్రదర్శనగా వస్తున్న వివిధ వర్గాల ప్రజలు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. దహనాలతో రహదారులు మసిబారుతుండగా, ఆకాశం దట్టమైన పొగలతో నిండిపోతోంది. దిష్టిబొమ్మలు, మానవహారాలు, ప్రదర్శనలు, పిండ ప్రదానాలు ఇలా తమకు తోచిన రీతిలో ప్రజలు నిరసనలతో హోరెత్తిస్తున్నారు.
మేము సైతం..
మేము సైతం ఉద్యమానికి సమిధనొక్కటి ఆహుతిస్తాము... మేము సైతం సమైక్యోద్యమ బావుటాలై పైకి లేస్తామంటూ ఆర్తీ హోం ఉపాధ్యాయ సంఘం, యోగి వేమన విశ్వ విద్యాలయ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్, కడప నగర వ్యాపారుల సంఘం, డ్వాక్రా మహిళలు, కనక మహాలక్ష్మి విద్యా మందిర్ హైస్కూల్ విద్యార్థులు, గురుకుల్ విద్యాపీఠ్ విద్యార్థులు, నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు, కడప జిల్లా ఎలక్ట్రానిక్ యజమానుల సమాఖ్య, వైద్య, ఆరోగ్య శాఖ తదితరులుదీక్షలకు సంఘీభావం ప్రకటించారు.
జనం... జనం.. ప్రభంజనం
Published Wed, Aug 7 2013 3:15 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement