కృష్ణాజిల్లాలో ఘోర అగ్నిప్రమాదం
కంకిపాడు : కృష్ణాజిల్లాలో ఆదివారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కంకిపాడు మండలం మంతెన గ్రామంలో గ్యాస్ సిలిండర్ లీకై 120 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. నల్లగొండ జిల్లా రామచంద్రపురం నుంచి చెరకు నరికేందుకు నెలరోజుల కిందట 150 కుటుంబాలు మంతెనకు వచ్చాయి. ఇక్కడే చెరకు తోట పక్కన వున్న ఖాళీ స్థలంలో తాత్కాలిక గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు.
ఆదివారం ఉదయం కూలీలు పనులకు వెళ్లిన సందర్భంలో ఓ గుడిసెలోని గ్యాస్ సిలెండర్ లీకై భారీగా మంటలు చెలరేగాయి. మంటలు మిగతా గుడిసెలకు కూడా వ్యాపించడంతో 120 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. గుడిసెల్లో ఉన్న తొమ్మిది సిలెండర్లు కూడా పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ప్రమాదం జరిగినప్పుడు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.