చిట్టమూరు, న్యూస్‌లైన్: మల్లాం పంచాయతీలోని కొక్కుపాళెంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలకు గ్యాస్ సిలిండర్ పేలుడు తోడవడంతో రెండు పూరిళ్లు, రెండు ధాన్యం కూట్లు, నగదు, బంగారు ఆభరణాలు కాలిపోయాయి. గ్రామస్తుల కథనం మేరకు..గ్రామానికి చెందిన లింగారెడ్డి బాలిరెడ్డి ఓ వివాహానికి హాజరయ్యేందుకు నెల్లూరు వెళ్లారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన భార్య కూడా పక్కనే ఉన్న తన చెల్లెలి ఇంటికి వెళ్లిన సమయంలో ఇంట్లో షార్ట్‌సర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగాయి.
పూరిల్లు కావడంతో వేగంగా వ్యాపిస్తున్న మంటలను చూసి ఆర్పేందుకు స్థానికులు పరుగులు తీశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, గాలి కూడా వీస్తుండడంతో పక్కనే ఉన్న బాలిరెడ్డికే చెందిన మరో పూరింటికి కూడా మంటలు వ్యాపించాయి. ఆ ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటల తీవ్రత పెరిగింది. ఆ పక్కనే ఉన్న పెళ్లూరు భాస్కర్‌రెడ్డికి చెంది ధాన్యం కూట్లకు కూడా మంటలు అంటుకున్నాయి. దట్టంగా పొగకమ్ముకోవడంతో గ్రామంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు బిందెలతో నీళ్లు పోసి మంటలను ఆపే ప్రయత్నం చేసినా ఫలితం కరువైంది. ఇంతలో కోట అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు మరింత వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదంలో బాలిరెడ్డి ఇంట్లోని లక్ష రూపాయల నగదు, 30 సవర్ల బంగారు నగలు, గృహోపకరణ వస్తువులు, పెళ్లూరు భాస్కర్‌రెడ్డికి చెందిన సుమారు 500 బస్తాల జిలకర మసూరి ధాన్యం అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం రూ.15 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు బోరుమంటున్నారు. కట్టుబట్టలతో మిగిలిన బాలిరెడ్డి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారం క్రితమే పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో బంగారు నగలు చేయించుకున్నామని, అవి మంటల్లో కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం కాలి బూడిదవడంతో పెళ్లూరు భాస్కర్‌రెడ్డి తీవ్రంగా నష్టపోయారు.
కొక్కుపాళెంలో భారీ అగ్నిప్రమాదం
Published Thu, Mar 20 2014 3:23 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement