పల్నాటి రైతుల కన్నీటి కష్టాలు  | Huge loses to the farmers in Palnadu region | Sakshi
Sakshi News home page

పల్నాటి రైతుల కన్నీటి కష్టాలు 

Published Sun, Dec 30 2018 4:42 AM | Last Updated on Sun, Dec 30 2018 4:43 AM

Huge loses to the farmers in Palnadu region - Sakshi

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పంటలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్న రైతులు

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడుకు చెందిన ముప్పాళ్ల నాగేశ్వరరావుకు 16 ఎకరాల భూమి ఉంది. అందులో మిర్చి, పత్తి పంటలు వేశాడు. వర్షాలు కురవకపోవడంతో ఎనిమిది బోర్లు వేశాడు. అయితే ఒక్క బోరులో కూడా నీరు పడలేదు. నిరుత్సాహపడకుండా 1200 అడుగుల లోతు వరకూ తవ్వించినా ఫలితం శూన్యం. ఎనిమిది బోర్లకు రూ.10 లక్షలు ఖర్చవడంతో అప్పులపాలై మూడెకరాల భూమిని అమ్మి అప్పు తీర్చాడు. నీరు పడకపోవడంతో 13 ఎకరాల్లోని పంటలు ఎండిపోయి మరో రూ.10 లక్షల వరకూ నష్టం వచ్చింది. అప్పులు తీర్చేందుకు తిరిగి మరో మూడెకరాలు బేరం పెట్టాడు. అయితే అప్పటికే పల్నాడులో కరువు విలయతాండవంతో భూముల ధరలు సగానికి పడిపోయాయి. పొలాలు అమ్ముకునేవారు తప్ప కొనేవారులేక వడ్డీలు పెరిగిపోతున్నాయని కన్నీటిపర్యంతమవుతున్నాడు.  

వెల్దుర్తి మండలం పాపిరెడ్డికొండ తండాకు చెందిన చిన్నా నాయక్‌ తన మూడెకరాల పొలంలో మిర్చి పంట సాగు చేశాడు. తీవ్ర వర్షాభావంతో పొలంలో ఉన్న ఒక్క బోరు ఎండిపోయింది. చేతికొచ్చిన పంటలు ఎండిపోతుండటం చూడలేక ఇటీవల రెండు కొత్త బోర్లు వేశాడు. 1000 అడుగులకు పైన తవ్వినా నీరు పడలేదు. దీనికోసం రూ.2.5 లక్షలు ఖర్చు పెట్టాడు. మరోవైపు పంట పెట్టుబడికి చేసిన అప్పులు, పిల్లల బడి ఫీజులు తడిసిమోపిడయ్యాయి. దీంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పులకు వడ్డీలు కట్టలేక పొలం అమ్మకానికి పెడితే కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని వాపోతున్నాడు. 

సాక్షి, గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పంట కుంటలు తవ్వించి భూగర్భ జలాలను పైకి తెచ్చామని, తద్వారా కరువును జయించామని సీఎం చంద్రబాబు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా పల్నాడులో భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోవడంతో రైతులు 1000–1200 అడుగుల లోతు వరకూ బోర్లు వేసినా చుక్కనీరు కూడా పడటం లేదు. మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా.. మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి, నూజెండ్ల, శావల్యాపురం, వినుకొండ, ఈపూరు మండలాల్లో భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయాయి. బోర్లు వేసినా చుక్కనీరు పడకపోవడంతో పంటలన్నీ ఎండిపోయి రైతులు తీవ్ర నష్టాలపాలై అప్పులపాలవుతున్నారు. 

ఒక్కో రైతు ఐదు బోర్లు వేసినా.. 
మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డి గూడెంలో 350 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామ రైతులు తమ పొలాల్లో ఉన్న బోర్లు ఎండిపోవడంతో ఈ ఏడాది మరో 300 వరకూ కొత్త బోర్లను వేశారు. వీటిలో 5 శాతం బోర్లలో కూడా నీరుపడలేదు. కొందరు తమ పొలాల్లో 5–10 వరకూ బోర్లు వేసినా నిరాశే ఎదురైంది. దీంతో రైతులు పంటలు ఎండిపోయి అప్పులపాలై అందినకాడికి పొలాలను తెగనమ్ముకోవాల్సి వచ్చింది. కండ్లకుంట, గుండ్లపాడు, ఉప్పలపాడు, బోదలవీడు, శిరిగిరిపాడు, వెల్దుర్తి వంటి గ్రామాల్లో సైతం వందలాది మంది రైతులు 1000–1200 అడుగుల మేర బోర్లు వేసినా చుక్క నీరూ పడకపోవడంతో అప్పులపాలై ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. ఒక్క వెల్దుర్తి మండలంలోనే బోర్లకు సుమారు రూ.20 కోట్ల వరకూ రైతులు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. వెల్దుర్తి మండలంలో 12 వేల హెక్టార్లలో పత్తి, 4 వేల హెక్టార్లలో మిర్చి, 500 ఎకరాల్లో కంది పంటలను రైతులు సాగు చేశారు. నీరందక పంటలు ఎండిపోవడంతో రూ.200 కోట్ల మేర నష్టపోయారని అంచనా. ఒక్క మండలంలోనే ఇంత నష్టం వాటిల్లితే పల్నాడు ప్రాంతంలోని మిగతా మండలాల్లో సంభవించిన నష్టం వేల కోట్లలో ఉంటుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. రైతులు ఈ స్థాయిలో నష్టాలపాలై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. 

మండిపడుతున్న రైతు సంఘాలు 
గుంటూరు జిల్లాలో సాగర్‌ చివరి ఆయకట్టు కింద ఉన్న రైతుల పరిస్థితి సైతం దుర్భరంగానే ఉంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు, పెదగొట్టిపాడు, నడింపాలెం, పాతమల్లాయపాలెం, కోయవారిపాలెం రైతులు ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలాల్లో ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని కొంటున్నారు. కృష్ణా నది నిండా నీళ్లున్నా సాగుకు నీళ్లందించలేని అసమర్థ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీడీపీ ప్రభుత్వమేనని రైతులు, రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. గత 50 ఏళ్లలో ఇంతటి దుర్భిక్షం ఎన్నడూ చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 వోల్టా చట్టంపై అవగాహన కల్పించని ప్రభుత్వం 
వోల్టా కమిటీలను ఏర్పాటు చేసి వోల్టా చట్టంపై రైతులకు అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుండటం వల్లే ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ చట్టం ప్రకారం.. రైతు బోరు వేయాలనుకుంటే ముందుగా సంబంధిత మండల తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవడంతోపాటు డీడీ చెల్లించి భూమికి సంబంధించిన వివరాలను నమోదు చేయించాలి. రెండు బోరు బావుల మధ్య కనీసం 200 మీటర్ల దూరం ఉండాలి. అలా ఉందా? లేదా? అనేది తహసీల్దార్‌ నిర్ధారణ చేసుకున్నాక క్షేత్ర స్థాయి పరిశీలన కోసం జిల్లా భూగర్భ జలశాఖకు రిఫర్‌ చేయాలి. జియోహైడ్రాలజిస్ట్‌ సదరు భూమిలో నీటి లభ్యతను సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా తెలుసుకుని.. నీటి లభ్యత ఉంటే బోరు బావి తవ్వుకోవడానికి అనుమతి ఇస్తారు. కానీ జిల్లాలో ఈ ప్రక్రియ ఎక్కడా అమలు కాకపోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా దగ్గర దగ్గర బోర్లు వేసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.  

ఇది ముప్పాళ్ల నాగేశ్వరరావు, చిన్నా నాయక్‌ల పరిస్థితే కాదు.. అక్కడ ఏ రైతును కదిల్చినా క‘న్నీటి’ గాథలే. పక్కనే కృష్ణానది పారుతున్నా పంటలకు నీరందని దుస్థితి. కనీసం బోర్లుతోనైనా పంటలు సాగు చేసుకుందామనుకుంటే అడుగంటిన భూగర్భ జలాలు పైకి రానంటున్నాయి. ఇవన్నీ కరువు జిల్లా అయిన అనంతపురంలో అనుకుంటే పొరపాటే. ‘విశ్వనగరం’ అమరావతి కొలువైన గుంటూరు జిల్లా పల్నాడులో రైతులు పడుతున్న కన్నీటి కష్టాలు. పల్నాడు ప్రాంతంలో నెలకొన్న కరువుపై ప్రత్యేక కథనం..  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement