సాక్షి, సంగారెడ్డి: జడివాన గడగడ లాడిస్తోంది. చేతికొచ్చిన పంటలను నాశనం చేస్తోంది. రెం డు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బతినడంతో రైతులు నిండా మునిగారు. మార్కెట్ యార్డు ల్లో ఎండ బెట్టిన మక్కల సైతం తడిసిపోయాయి. పత్తి గూడలు తడిసి రంగు మారాయి. వరి పంటలు ఒరిగి నేల కూలాయి. పంట నష్టంపై అధికారుల్లో స్పష్టత కరువైంది. రెవె న్యూ, వ్యవసాయ శాఖలు పరస్పర విరుద్ధ గణాంకాలతో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక లు సమర్పించడం ప్రధాన శాఖల మధ్య సమన్వయ లోపాన్ని ఎత్తి చూపింది. వ్యవసాయ శాఖ 827.5 ఎకరాల్లో పంట లు దెబ్బతిన్నట్లు నివేదించగా.. రెవెన్యూ శాఖ తన నివేదికలో కేవలం 178 ఎకరాల్లో మాత్రమే నష్టాన్ని చూపించింది. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా 315 గృహాలు పాక్షికంగా, 5 గృహాలు పూర్తిగా ధ్వంసం కావడంతో రూ.16.85 లక్షల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది.
ఎడ తెరిపి లేని వర్షం
బుధవారం సాయంత్రం నుంచి జిల్లాలో ఏకధాటిగా జడివాన కురుస్తోంది. గురువారం ఉదయం 8 గంటల వరకు జిల్లాలో 40.6 మి.మీటర్ల సగటు వర్షం కురిసింది. అత్యధికంగా దౌల్తాబాద్ మండలంలో 100.2 మి.మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. చిన్నశంకరంపేటలో 85.8 మి.మీ, మునిపల్లిలో 72 మి.మీ, మెదక్‌లో 63, తూప్రాన్‌లో 61, చేగుంటలో 60.6, హత్నూరలో 60.2, మిరుదొడ్డిలో 56.6, కోహీర్ 55.6, వెల్దుర్తి 53.6, శివ్వంపేటలో 52.4, రామాయంపేట 50.3, జిన్నారంలో 50.2, వర్గల్‌లో 50.4 మి.మీటర్ల వర్షం కురిసింది. కల్హేర్ మినహా అన్ని మండలాల్లో వర్షం కురిసింది. డివిజన్ల వారీగా పరిశీలిస్తే.. మెదక్‌లో 44.6 మి.మీటర్లు, సిద్దిపేటలో 651.6 మి.మీటర్లు, సంగారెడ్డిలో 27.5 మి.మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
మక్కల కొనుగోళ్లకు బ్రేక్
ఎడ తెరపి లేని వర్షాలు మొక్కజొన్న రైతులను రెండు విధాలుగా దెబ్బతీశాయి. వర్షాలతో తేమ శాతం పెరిగిందని మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు నిలిపివేసింది. మళ్లీ పొడి వాతావరణం ఏర్పడిన తర్వాతే కొనుగోళ్లు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. సిద్దిపేట మార్కెట్‌లో మక్కల కొనుగోళ్లు చేయాలని రైతులు ఆందోళన దిగినా తామేమీ చేయలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. మార్కెట్ యార్డుల్లో ఆరబెట్టిన మక్కలు తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
అధికారులు సరఫరా చేసిన టార్పాలిన్ కవర్లు సరిపడక మక్కల నిల్వలు నీటిపాలయ్యాయి. దుబ్బాక, మిరుదొడ్డి మార్కెట్ యార్డుల్లో 1,200 క్వింటాళ్లు, సిద్దిపేటలోని మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రం ప్లాట్‌ఫారాలపై ఆరబెట్టిన 500 క్వింటాళ్ల మక్కలు తడిసినట్లు సమాచారం. వర్షాలతో వరి పంటలు ఒరిగి నేల వాలాయి. పుల్కల్, అందోల్, హత్నూర, పెద్ద శంకరంపేట, రామాయంపేట, జగదేవ్‌పూర్, వర్గల్, దుబ్బాక, నంగనూరు మండలాల్లో 772.5 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. వాస్తవంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్ మార్కెట్‌లో ఉన్న వరి ధాన్యం తడిసింది. నంగనూరు మండలంలో 55 ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి పంటలు చేతికొచ్చిన తరుణంలో వర్షాలు కురుస్తుండడంతో పత్తి గూడలు రంగుమారుతున్నాయి.