విద్యుత్ కోతలకు నిరసనగా అన్నమేడు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను శనివారం రైతులు ముట్టడించారు. సబ్‌స్టేషన్ పరిధిలోని అన్నమేడు, మర్లపల్లి, వేముగుంటపాళెం, మడఫలం తదితర గ్రామాలకు చెందిన రైతులు మూకుమ్మడిగా సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని విధుల్లో ఉన్న ఉద్యోగులను బయటకు పంపారు.
నాయుడుపేటటౌన్, న్యూస్‌లైన్: విద్యుత్ కోతలకు నిరసనగా అన్నమేడు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను శనివారం రైతులు ముట్టడించారు. సబ్‌స్టేషన్ పరిధిలోని అన్నమేడు, మర్లపల్లి, వేముగుంటపాళెం, మడఫలం తదితర గ్రామాలకు చెందిన రైతులు మూకుమ్మడిగా సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని విధుల్లో ఉన్న ఉద్యోగులను బయటకు పంపారు. సబ్‌స్టేషన్‌కు తాళం వేసి రోడ్డుపై బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. సుమారు మూడు గంటలకు పైగా రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు మాట్లాడుతూ ఎలాంటి సమాచారం లేకుండానే విద్యుత్ కోతలు విధిస్తున్నారని, గృహ అవసరాలకు రేయింబవళ్లు 18 గంటలు విధిస్తున్నారని, వ్యవసాయానికి ఒక గంట మాత్రమే విద్యుత్ సరఫరా ఇస్తున్నారని మండిపడ్డారు. దీంతో సాగు చేసిన పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు సంఘటన స్థలానికి చేరుకున్న ఏడీఈ బాబురెడ్డిని రైతులు చుట్టుముట్టారు. వ్యవసాయానికి విద్యుత్ కోత విధించి రైసు మిల్లులకు ఇవ్వడమేమిటని వాగ్వాదానికి దిగారు. ఏడీ మాట్లాడుతూ కొంతకాలంగా కర్ణాటక, వైజాగ్ తదితర ప్రాంతాల్లోని విద్యుత్ ప్లాంట్లు పనిచేయక రోజుకు 1600 మెగా వాట్ల విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోతలు అమలు పరుస్తున్నామని సర్దిచె ప్పారు. పంటలు ఎండిపోకుండా విద్యుత్ సరఫరా మెరుగుపర్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.