అంతర్‌రాష్ట్ర ముఠా పనే! | Huge robbed by interstate gang of thieves | Sakshi
Sakshi News home page

అంతర్‌రాష్ట్ర ముఠా పనే!

Published Tue, Feb 4 2014 3:25 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

Huge robbed by interstate gang of thieves

చొప్పదండి, న్యూస్‌లైన్ : చొప్పదండి ఎస్‌బీఐలో రెండు రోజుల క్రితం భారీ దోపిడీకి పాల్పడింది ఉత్తరాది దొంగలేనని తెలుస్తోంది. అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాలు మాత్రమే ఇంత చాకచక్యంగా దోపిడీ చేయగలవని పోలీసులు భావిస్తున్నారు. బ్యాంకులోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు సైతం ఇదే స్పష్టం చేస్తున్నాయి. దోపిడీ జరిగిన సమయంలో బ్యాంకులో కరెంటు లేకపోవడంతో సీసీ కెమెరా ఫుటేజీల్లో నిందితులు అస్పష్టంగా కనిపిస్తున్నారు. ఈ చిత్రాలను ఎస్పీ శివకుమార్, పెద్దపల్లి డీఎస్పీ వేణుగోపాల్‌రావు మంగళవారం కరీంనగర్ పోలీస్‌హెడ్‌క్వార్టర్స్‌లో విడుదల చేశారు.
 
 అంతా ముప్పై ఏళ్లలోపు వారే..
 ఈ దోపిడీలో నలుగురు యువకులు పాల్గొన్నట్టు బ్యాంకు సిబ్బంది తెలిపారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన చిత్రాల్లోనూ నలుగురే ఉన్నారు. అందరూ ముప్పై ఏళ్ల లోపు వయసువారే. ఈ పుటేజీలు 45 సెకన్లపాటు ఉండగా 10.25 గంటల తర్వాత సంఘటనలు అందులో రికార్డయ్యాయి. నలుగురు యువకుల్లో ఒకరు వైట్‌డ్రస్ వేసుకుని టక్ చేసుకుని చేతిలో కత్తి పట్టుకుని మేనేజర్‌ను బెదిరిస్తున్నాడు. మరో ముగ్గురు పిస్టల్స్ చేతిలో పట్టుకుని బ్యాంక్‌లో నలుదిక్కులా తిరుగుతున్నారు. మొదట బ్యాంక్ మేనేజర్‌తో ఏదో మాట్లాడిన తర్వాత మరో గదిలోకి వెళ్లి క్యాషియర్‌ను తీసుకొచ్చారు.
 
 రెండోవ్యక్తి క్యాషియర్‌ను పిస్టల్‌తో బెదిరించి ఆయన వద్దనున్న రెండో కీ తీసుకున్నాడు. మొదటి వ్యక్తితోపాటు ముగ్గురు పిస్టళ్లు పట్టుకుని మేనేజర్‌ను తీసుకొని గదిలోకి వెళ్లారు. మరో వ్యక్తి పిస్టల్‌తో క్యాషియర్‌కు గురిపెట్టి ప్రశ్నించినట్లు ఆ పుటేజీల్లో ఉన్నాయి. 30 ఏళ్లలోపువారే. ఒకరు నీట్‌గా టక్ చేసుకుని హుందాగా ఉండగా.. మరో ముగ్గురు సాధారణ దుస్తుల్లో ఉన్నారు. వీరందరూ తెల్లచొక్కాలు ధరించారు. దర్జాగా బ్యాంక్‌లో తిరుగుతూ కత్తులు, పిస్టళ్లతో బెదిరిస్తూ రూ.46 లక్షలు దోచుకుని వెళ్లిపోయారు. ఆ రోజు ఉదయం 9.15కు మేనేజర్ విశ్వేశ్వర్‌రావు వెనుకవైపు తలుపు తెరుచుకుని బ్యాంకులోకి వెళ్లారు. అప్పటికే మాటువేసి అంతా గమనిస్తున్న దొంగలు ఆ తర్వాత పది నిమిషాలకే బ్యాంకు లోనికి ప్రవేశించారు.

 

ఖాతాదారుల సందడి ప్రారంభం కాకముందే బ్యాంకులో ప్రవేశించి గంట వ్యవధిలో తమ ‘ఆపరేషన్’ పూర్తి చేసుకొని వెళ్లారు. ఆ నలుగురు భూపాలపట్నం రోడ్డు వైపు పారిపోయినట్లు తెలుస్తోంది. వారి వేషభాషలు చూసిన పోలీసులు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారిగా నిర్ధారణకు వచ్చారు. బ్యాంక్‌లో నాలుగు సీసీ కెమెరాలు ఉండగా, మూడింటికి అనుసంధానంగా ఉన్న హార్డ్‌డిస్క్‌లను తీసుకున్నారు. నాలుగో కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. అయితే అది దూరంగా ఉండడం, ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో చిత్రాలు అస్పష్టంగా ఉన్నాయి. వీటిని మరింత స్పష్టంగా విశ్లేషించడం కోసం హైదారాబాద్‌కు పంపించామని పోలీసు అధికారులు తెలిపారు.
 
 రెక్కీ నిర్వహించాకే దోపిడీ..
 దోపిడీ దొంగలు కనీసం పదిహేను ఇరవై రోజులుగా బ్యాంకుపై రెక్కీ నిర్వహించాకే భారీ దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారిస్తున్నారు. చొప్పదండి, దాని పరిసర ప్రాంతాల్లో గానీ, కరీంనగర్‌లో గాని షెల్టర్ తీసుకుని ఉంటారని, ఆయా ప్రాంతాల్లో అనుమానం రాకుండా దుస్తులు, వేషధారణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. స్థానికులు కాకున్నా బ్యాంకు పరిసరాలు పూర్తిగా గమనించడంతో పాటు, ఎటువంటి రిస్కు లేకుండా, ముఖాలకు గుడ్డలు కూడా లేకుండా గంట వ్యవధిలో తమ పని ముగించుకొని వెల్లడం ప్రొఫెషనల్ దొంగల పనేనని భావిస్తున్నారు. భారీ చోరీ చేసిన దొంగలు మొదటి రోజు ఎక్కువ దూరం పారిపోకుండా, తాము ముందుగా తీసుకున్న షెల్టర్‌లో తలదాచుకున్నారనే భావన వ్యక్తమవుతోంది. చొప్పదండి పరిసర ప్రాంతాల్లో ఇటుకబట్టీలు, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పనులు, ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్ట్ పనులు, ఇతర సంస్థల పనులు జరుగుతుండడంతో వందలాది మంది స్థానికంగా నివాసం ఉంటున్నారు. వీరిలో దొంగలు ఎవరో, కూలీలు ఎవరో తెలియని పరిస్థితి నెలకొంది. వీడియో చిత్రాలు, సెల్‌ఫోన్‌కాల్స్ ఆధారంగా దొంగలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
 
 ‘సాక్షి’ ముందే చెప్పింది..
 బ్యాంకు దోపిడీ బవారియా, లేదా ఇతర అంతర్‌రాష్ట్ర ముఠాల పనేనని, ఆ ముఠాలు ఎలా చోరీలు చేస్తాయో గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా సాక్షి దోపిడీ జరిగిన మరునాడే కథనాన్ని ప్రచురించింది. తాజాగా పోలీసులు ఆ ముఠాలపైనే అనుమానాలు వ్యక్తం చేస్తుండడం విశేషం. రెండేళ్ల క్రితం ఎల్లారెడ్డిపేట బ్యాంక్‌లో చోరీకి ప్రయత్నాలు చేస్తుండగా అక్కడ ట్రెయినీ ఎస్సైగా ఉన్న దామోదర్‌రెడ్డి (ప్రస్తుతం ఎల్‌ఎండీ ఎస్సై) అనుమానితులను పట్టుకున్నారు. వారిలో కరుడుగట్టిన బవారియా ముఠా ముఖ్య నాయకుడు దొరికాడు. వెంటనే అతడిని సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. అతడిని విచారించగా హుస్నాబాద్‌తో పాటు, నల్గొండ, అదిలాబాద్ జిల్లాల్లో బ్యాంక్‌లో చోరీలు వెలుగుచుశాయి. అతడు ఇచ్చిన సమాచారం అధారంగా రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో వెతికినా ముఠా సభ్యులు దొరకలేదు. చివరకు అతడి నుంచి పెద్ద మొత్తంలో వెండి రికవరీ చేసి రిమాండ్‌కు పంపించారు. బయటకు వచ్చిన తర్వాత ఆ గ్యాంగ్ సభ్యులు అచూకీ లేకుండాపోయాడు. ఇప్పుడు తాజాగా అదే గ్యాంగ్‌పై అనుమానాలు రావడం, వీరు గతంలో చేసిన తరహాలోనే తాజా దోపిడీ జరిగింది.  
 
 పట్టుకుంటే పారితోషికం
 జిల్లాలో సంచలనం సృష్టించిన చొప్పదండి ఎస్‌బీఐ దోపిడీ సంఘటనలో పాల్గొన్న నిందితులకు సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డయిన చిత్రాలను ఎస్పీ శివకుమార్ విడుదల చేశారు. పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. వారు 20 రోజుల పాటు రెకీ నిర్వహించి బ్యాంకు లోపాల గురించి పూర్తిగా తెలుసుకుని దోపిడీకి పాల్పడ్డారన్నారు. ఇంది అంతర్‌రాష్ట్ర ముఠా పనేనని, ఇరానీ, పార్థీ, బవారియా ముఠాలపై అనుమానం ఉందని తెలిపారు.
 
 గతంలో హుస్నాబాద్ బ్యాంక్ చోరీ సంఘటనలో పాల్గొన్న ముఠాలపై కూడా అనుమానాలున్నాయన్నారు. రెండు రోజుల క్రితం హైదారాబాద్‌లో ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారని, స్థానిక పోలీసులు అక్కడికి వెళ్లి సమాచారం సేకరిస్తున్నారని చెప్పారు. వీరు ప్పదండి చుట్టుపక్కల గ్రామాల్లో లేదా కరీంనగర్ శివారు ప్రాంతాల్లో గదులు అద్దెకు తీసుకుని ఉండవచ్చన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడంతో పాటు వారికి తగిన పారితోషికం ఇస్తామని ఎస్పీ శివకుమార్ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement