inter-state gang of thieves
-
కారులో వస్తారు..కొల్లగొట్టి పోతారు!
సాక్షి, హైదరాబాద్: నకిలీ నెంబర్ ప్లేట్లు తగిలించిన తెల్లరంగు ఐ20 కారులో సంచరిస్తూ మూడు కమిషనరేట్ల పరిధిలో వరుస నేరాలు చేసిన ఘరానా అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఎట్టకేలకు చిక్కింది. ఈ ఏడాది మార్చ్ నుంచి నాలుగు దఫాల్లో సిటీకి వచ్చిన ఈ గ్యాంగ్ 13 చోరీలు చేసింది. దీనికి ముందు 2015 లోనూ ఓ దొంగతనానికి పాల్పడింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో పంజా విసిరిన ఈ మీరట్ గ్యాంగ్‌ను ఎస్సార్‌నగర్ పోలీసులు పట్టుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం వెల్లడించారు. నలుగురిని పట్టుకుని వీరి నుంచి రూ.40 లక్షల విలువైన సొత్తు రికవరీ చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, పంజగుట్ట ఏసీపీ విజయ్‌కుమార్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఢిల్లీ జైల్లో జట్టుకట్టిన ముఠా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన షంషద్ అలియాస్ భూర వృత్తిరీత్యా తాపీ మేస్త్రీ. ఇతడిపై ఇప్పటివరకు అక్కడ 22 కేసులు నమోదయ్యాయి. ఇతడికి జైల్లోనే ఢిల్లీకి చెందిన ఆరిఫ్, మహ్మద్ వసీంలతో పాటు తౌఫీఖ్, హసీమ్, డానిష్‌లు పరిచయమయ్యారు. ఈ గ్యాంగ్‌కు జైల్లో కలిసిన కొందరు దొంగలు హైదరాబాద్ వెళ్ళమని సూచించారు. అక్కడి ఇళ్లల్లో బంగారం ఎక్కువగా ఉంటుందని సూచించడంతో ఈ ముఠా కన్ను నగరంపై పడింది. కారులో వచ్చి దర్జాగా తిరుగుతూ.. మీరట్లోనే బెంజిమన్ పేరుతో ఉన్న ఓ తెల్లరంగు ఐ20 కారును ఆరిఫ్ ఖరీదు చేశాడు. ఇందులోనే ఒక్కో సందర్భంలో కొందరితో కలిసి హైదరాబాద్‌కి రావడం మొదలెట్టారు. కారులో కాలనీల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి అందినకాడికి దోచుకుపోతారు. వరుసగా కొన్ని నేరాలు చేసిన తర్వాత మీరట్ వెళ్లిపోతారు. మళ్లీ పరిస్థితులు అనుకూలంగా మారాయని భావించాక మరోసారి వస్తారు. ఇలా మార్చ్, మే, జూన్, సెప్టెంబర్‌లో హైదరాబాద్‌కి వచ్చిన ఈ గ్యాంగ్ 12 చోరీలు చేసింది. ఎస్సార్‌నగర్ పోలీసులకు కలిసొచ్చిన ‘అనుభవం’ మీరట్ నుంచి స్కార్పియో వాహనంలో వచ్చిన ఓ గ్యాంగ్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఎస్సార్‌నగర్ తదితర ప్రాంతాల్లో పంజా విసిరింది. ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలో జరిగిన చోరీ కేసును అధ్యయనం చేసిన పోలీసులు దాదాపు 70 సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను, సాంకేతిక ఆధారాలను బట్టి మీరట్ గ్యాంగ్‌గా భావించి పట్టుకున్నారు. వీరిని గత ఏడాది జూన్ 15న నగరానికి తరలించి అరెస్టు చేశారు. ఈ అనుభవమే తాజా ఐ20 గ్యాంగ్ చిక్కడానికి కారణమైంది. తాజా ముఠాకోసం రంగంలోకి దిగిన ఎస్సార్‌నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వై.అజయ్‌కుమార్, ఎస్సై జి.శ్రీనివాస్‌లతో కూడిన బృందం నేరంచేసే తీరును విశ్లేషించారు. దీనికి తోడు సాంకేతికంగానూ ముందుకు వెళ్ళిన అధికారులు ఈ అంతర్రాష్ట్ర దొంగలు మరోసారి నేరం చేయడానికి సిటీకి వస్తున్నట్లు గుర్తించారు. దీంతో వలపన్ని మధురానగర్ దగ్గర కారును ఆపి తౌఫీఖ్, హసీమ్, డానిష్ మినహా మిగిలిన వారిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.40 లక్షల విలువైన కేజీన్నర బంగారం, వెండితో పాటు ఐ20 కారును స్వాధీనం చేసుకున్నారు. జూన్ నెలలోనే 10 చోరీలు.. తాళం వేసి ఉన్న ఇళ్ళనే టార్గెట్‌గా చేసుకున్న ఈ గ్యాంగ్ ఆసిఫ్‌నగర్ ఠాణా పరిధిలోని గుడిమల్కాపూర్ నవోదయకాలనీలో ఓ ఇంట్లోకి ప్రవేశించింది. ఆ ఇంట్లో 10 తులాల బంగారం, రెండు కిలోల వెండి, రూ.లక్ష నగదు అపహరించుకుని వెళ్ళింది. ఆపై రాజేంద్రనగర్, ఎస్సార్‌నగర్, వనస్థలిపురం, నార్సింగి, మీర్‌పేటల్లో కలిపి మొత్తం 12 ఇళ్లల్లో పంజా విసిరింది. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
పెర్కిట్(ఆర్మూర్): భీంగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఏర్గట్ల మండల కేంద్రంలో గత ఫిబ్రవరి 27వ తేదీన ఎస్బీఐ బ్యాంకులో చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు ఆర్మూర్ ఏసీపీ శివకుమార్ తెలిపారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన భీంగల్ సీఐ సైదయ్య, సీసీఎస్ సీఐ నరేశ్‌కుమార్‌తో కలిసి వివరాలను వెల్లడించారు. బిహార్ రాష్ట్రం ముజాఫర్పూర్ జిల్లాకు చెందిన శివశంకర్ షా, సురేందర్ సహాని ఫిబ్రవరి 25వ తేదీన కూలిపని నిమిత్తం ఏర్గట్ల గ్రామానికి వచ్చారు. అనంతరం గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకు దోపిడీకి పన్నాగం పన్నారు. రెండు రోజులు రెక్కి నిర్వహించిన అనంతరం 27వ తేదీన ముసుగులు ధరించి బ్యాంకులో చొరబడ్డారు. సీసీ కెమెరాను ధ్వంసం చేసి లాకర్‌ను తెరిచే ప్రయత్నం చేశారు. లాకర్ తెరుచుకోకపోవడంతో అక్కడే ఉన్న ఐదు కంప్యూటర్ మానిటర్లను దొంగలించి ఉడాయించారు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ ఫణిరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీపీ కార్తికేయ ప్రత్యేక బృందాలతో కేసును దర్యాప్తు చేయించారు. భీంగల్ సీఐ సైదయ్య, సీసీఎస్ సీఐ నరేశ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు సీసీ ఫుటేజీ, సెల్‌ఫోన్, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిందితులను రెండు రోజుల క్రితం బిహార్‌లో అరెస్టు చేశారు. అనంతరం నిందితులను అక్కడి కోర్టులో హాజరు పరిచి ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఏర్గట్ల ఎస్సై హరిప్రసాద్, ఐడీ కానిస్టేబుళ్లు రాజేందర్, రమేశ్, రాములు, నరేందర్, సురేందర్, గంగాప్రసాద్, కేర్ బాజీ, గంగాధర్‌కు రివార్డులను అందజేయనున్నట్లు ఏసీపీ వెల్లడించారు. -
విమానంలో వచ్చి కొల్లగొడతారు!
మలేసియా టౌన్షిప్: ఒడిషా నుంచి విమానంలో వచ్చి నగరంలో చోరీలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. వీరు సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషరేట్ల పరిధితో పాటు విశాఖపట్నంలో గత మూడేళ్లలో 100 చోరీలకు పాల్పడి సుమారు 8 కేజీల బంగారం ఎత్తికెళ్లినట్టు పోలీసులు వెల్లడించారు. బుధవారం మాదాపూర్ డీసీపీ కార్తికేయ, కూకట్పల్లి ఏసీపీ భుజంగరావుతో కలిసి కేపీహెచ్పీ ఠాణాలో విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లాకు చెందిన ప్రశాంత కుమార్ కరాడ అలియాస్ తుల్లు (25), సుశాంతకుమార్ పాణిగ్రాహి (33), ప్రేమానంద్ ప్రధాన(27) ముగ్గురూ కలిసి తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉండగా... బుధవారం కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేన్ పరిధిలోని ప్రగతినగర్‌లో డీఐ బాలకృష్ణ, వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ప్రశాంత కుమార్ కరాడ అలియాస్ తుల్లు, సుశాంతకుమార్ పాణిగ్రాహి, ప్రేమానంద్ ప్రధాన అనుమానాస్పదంగా వాహనంలో కనిపించారు. దీంతో ముగ్గురినీ అదుపులోకి తీసుకొని సీసీఎస్ ఇన్స్పెక్టర్ హరిశ్చద్రారెడ్డి, కేపీహెచ్‌బీ ఇన్స్పెక్టర్ కుషాల్కర్ల ఆధ్వర్యంలో విచారించగా ఇళ్లలో చోరీలకు పాల్పడే అంతర్రాష్ట ముఠాగా తేలింది. హైదరాబాద్, సైబరాబాద్ జంట సర్కిళ్లల్లోతో పాటు విశాఖపట్టణంలోను చోరీలకు పాల్పడినట్టు నిందితులు ఒప్పుకున్నారు. ప్రశాంత్ కుమార్ కరాడ ఒక్కడే 15 దొంగతనాలు చేశాడు. దొంగిలించిన బంగారాన్ని ఒడిషాలో విక్రయించి, వచ్చిన డబ్బుతో అక్కడ ఇళ్లను, ప్లాట్లను కొనుగోలు చేసినట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. ఇటీవల ఒడిషాలోని ఓ అపార్టుమెంట్లో రూ.20 లక్షల విలువ చేసే ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం 100 కేసుల్లో 42 దొంగతనాలకు సంబంధించిన వివరాలను పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకోవటంతో పాటు ఒక ఆల్టో కారు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదీ వీరి చోరీ స్టైల్... తాళాలు ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రిపూట చోరీకి వెళ్తారు. ప్రధాన ద్వారం వెనుక ఉన్న గడియను తీసి ఇంట్లో వారు నిద్రిస్తున్న సమయంలోనే చోరీకి పాల్పడతారు. గడ్డపార వంటి రాడ్‌తో తాళాలను పగులగొట్టి చోరీ చేసే విధానాన్ని నిందితులు పోలీసులకు కళ్లకు కట్టినట్లు చూపించారు. వీరు ఎస్ఆర్నగర్లోని ఓ హాస్టల్లో ఉంటూ చోరీలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. ప్రశాంత్‌కుమార్ కరాడ భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు నాలుగు సార్లు విమానంలో వచ్చి చోరీలు చేసినట్టు పోలీసులు తెలిపారు. విచారణలో మరిన్ని దొంగతనాలు బయటపడే అవకాశం ఉందని, నిందితుల నుంచి మరింత సొత్తును రికవరీ చేయాల్సి ఉందని డీసీపీ కార్తికేయ తెలిపారు. విలేకరుల సమావేశంలో కెపిహెచ్పీ డీఐ బాలకృష్ణ, రవికుమార్ పాల్గొన్నారు. -
దొరికిన మరో దొంగ!
♦ ముఠా సభ్యుల్లో ఒకరి రిమాండ్ ♦ కొనసాగుతున్నవిచారణ.. ♦ నేరచరితపై ఆరా..? పరిగి: పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి అంతర్రాష్ట్ర దొంగల ముఠా కాల్పులకు యత్నించిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనలో విచారణ కొనసాగుతోంది. అర్ధరాత్రి గస్తీ తిరుగుతున్న పోలీసులపై దుండగులు కాల్పులకు యత్నించటంతో వారిలో ముగ్గురిని పోలీసులు పట్టుకోగా మరో నిందితుడు తప్పించుకుని పారిపోయిన విషయం తెలిసిందే. దొరికిన వారిని విచారణ జరిపిన పోలీసులు పరారైన మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ముందుగా దొరికిన ముగ్గురు నిందితుల్లో ఒకరైన సమద్ అనే వ్యక్తిని ఆదివారం రాత్రి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని పరిగి సీఐ ప్రసాద్ నిర్ధారించినా ఇంకా గోప్యంగానే ఉంచారు. పోలీసులు రోజు వారి కార్యక్రమాలు పక్కన పెట్టి ఈ కేసు దర్యాప్తులో తలమునకలయ్యారు. అయితే, పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు గుల్బర్గా ఆర్టీఓ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అవగా ఓనర్ ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. అయితే దొంగల ముఠా కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతంలోనే ఎక్కువగా దొంగతనాలకు పాల్పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అదుపులో ఉన్న అనుమానితులను తీసుకుని ఇప్పటికే ఓ బృందం కర్ణాటక గుల్బర్గాకు వెళ్లి రావడంతో మరిన్ని విషయాలు, దోపిడీలు వెలుగు చూసినట్లు సమాచారం. అయితే కేవలం అందరికి కనిపించిన దొంగను మాత్రమే రిమాండ్‌కు తరలించిన పోలీసులు మిగతా వారి అరెస్టు చూపలేదు -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
రెండు కిలోల బంగారం స్వాధీనం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: బెంగళూర్- హైదరాబాద్ జాతీయ రహదారిపై మూడు నెలల క్రితం బస్సులో జరిగిన దోపిడీని మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. పట్టుబడిన అంతర్రాష్ట్ర ముఠా నుంచి పోలీసులు రూ.50 లక్షల విలువైన రెం డు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను బుధవారం ఎస్పీ పి.విశ్వప్రసాద్‌తో కలసి హైదరాబాద్ రేంజ్ డీఐజీ గంగాధర్ వెల్లడించారు. జూన్ 27న వ్యాపారి లోకనాథం తన భార్య సుజారాంతో కలసి కేశినేని ట్రావెల్స్ బస్సులో తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యంలో ప్రయాణికుల కాలకృత్యాలు తీర్చుకునేందుకు బస్సు మానవపాడు మండలం ఇటిక్యాల పాడు జాతీ య రహదారిపై దాబా హోటల్ వద్ద నిలిపింది. బస్సులో సీట్లో ఉంచిన సుమారు ఆరు కిలోల బంగారం ఉన్న పెట్టెను నలుగురు దొంగలు ఉన్న ముఠా బస్సులోకి ప్రవేశించి అపహరిచింది. ఈ మేరకు వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపిన పోలీసులు బస్సుదోపిడీకి దొంగలు కారును వినియోగించారన్న సమాచారంతో టోల్గేట్ల వద్ద వీడియో ఫుటేజీలను పరిశీలించింది. కొంత సమాచారం సేకరించి మధ్యప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠాగా గుర్తించారు. కారుప్లేట్లు మార్చి దోపిడీ జులై 14న హైదరాబాద్- బెంగళూర్ జాతీయ రహదారి కుల్లూర్ గ్రామశివారులోని టోల్‌ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా (జీజే 01 ఆర్ 2468) కారును తనిఖీ చేయగా అం దులో మూడురకాల నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. అందులో ఒకటి దోపిడీ చేసిన రోజువాడిన నెంబర్ ప్లేటు (01 ఎఈ 2462) ఉండటంతో సదరుకారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ మరింత వేగవంతం చేశారు. ఈ దోపిడీకి నలుగురు వ్యక్తులు పాల్పడగా మధ్యప్రదేశ్‌కు చెందిన మహబూబ్‌ఖాన్ తమకు చిక్కాడని తన వాటాగా వచ్చిన రెండు కిలోల బంగారాన్ని హైదరాబాద్‌లో విక్రయించేందుకు వెళ్తుండగా అరెస్ట్ చేసినట్లు డీఐజీ చెప్పారు. మరో ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేయాల్సి ఉందని చెప్పారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
వరంగల్ : రాష్ట్రవ్యాప్తంగా పలు దొంగతనాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న దొంగల ముఠాను వరంగల్ సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఒక మహిళతో సహా ముగ్గురు సభ్యులు ఉన్నారు. వారి వద్ద నుంచి 21 ల క్షల విలువైన బంగారు, వెండి, ఎలక్ట్రిక్ వస్తువులతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. -
అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్, భారీ నగదు స్వాధీనం
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దృష్టి మరల్చి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాపై నిఘా పెట్టిన సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు వారి ఆట కట్టించారు. అటు పోలీసులకు ఇటు ప్రజలకు కంటిమీద కులుకు లేకుండా చేస్తున్న ఈ ముఠా ఆట కట్టించేందుకు పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న చెన్నైకు చెందిన ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
అంతర్రాష్ట్ర ముఠా పనే!
చొప్పదండి, న్యూస్‌లైన్ : చొప్పదండి ఎస్బీఐలో రెండు రోజుల క్రితం భారీ దోపిడీకి పాల్పడింది ఉత్తరాది దొంగలేనని తెలుస్తోంది. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు మాత్రమే ఇంత చాకచక్యంగా దోపిడీ చేయగలవని పోలీసులు భావిస్తున్నారు. బ్యాంకులోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు సైతం ఇదే స్పష్టం చేస్తున్నాయి. దోపిడీ జరిగిన సమయంలో బ్యాంకులో కరెంటు లేకపోవడంతో సీసీ కెమెరా ఫుటేజీల్లో నిందితులు అస్పష్టంగా కనిపిస్తున్నారు. ఈ చిత్రాలను ఎస్పీ శివకుమార్, పెద్దపల్లి డీఎస్పీ వేణుగోపాల్‌రావు మంగళవారం కరీంనగర్ పోలీస్‌హెడ్‌క్వార్టర్స్‌లో విడుదల చేశారు. అంతా ముప్పై ఏళ్లలోపు వారే.. ఈ దోపిడీలో నలుగురు యువకులు పాల్గొన్నట్టు బ్యాంకు సిబ్బంది తెలిపారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన చిత్రాల్లోనూ నలుగురే ఉన్నారు. అందరూ ముప్పై ఏళ్ల లోపు వయసువారే. ఈ పుటేజీలు 45 సెకన్లపాటు ఉండగా 10.25 గంటల తర్వాత సంఘటనలు అందులో రికార్డయ్యాయి. నలుగురు యువకుల్లో ఒకరు వైట్డ్రస్ వేసుకుని టక్ చేసుకుని చేతిలో కత్తి పట్టుకుని మేనేజర్‌ను బెదిరిస్తున్నాడు. మరో ముగ్గురు పిస్టల్స్ చేతిలో పట్టుకుని బ్యాంక్‌లో నలుదిక్కులా తిరుగుతున్నారు. మొదట బ్యాంక్ మేనేజర్‌తో ఏదో మాట్లాడిన తర్వాత మరో గదిలోకి వెళ్లి క్యాషియర్‌ను తీసుకొచ్చారు. రెండోవ్యక్తి క్యాషియర్‌ను పిస్టల్‌తో బెదిరించి ఆయన వద్దనున్న రెండో కీ తీసుకున్నాడు. మొదటి వ్యక్తితోపాటు ముగ్గురు పిస్టళ్లు పట్టుకుని మేనేజర్‌ను తీసుకొని గదిలోకి వెళ్లారు. మరో వ్యక్తి పిస్టల్‌తో క్యాషియర్‌కు గురిపెట్టి ప్రశ్నించినట్లు ఆ పుటేజీల్లో ఉన్నాయి. 30 ఏళ్లలోపువారే. ఒకరు నీట్‌గా టక్ చేసుకుని హుందాగా ఉండగా.. మరో ముగ్గురు సాధారణ దుస్తుల్లో ఉన్నారు. వీరందరూ తెల్లచొక్కాలు ధరించారు. దర్జాగా బ్యాంక్‌లో తిరుగుతూ కత్తులు, పిస్టళ్లతో బెదిరిస్తూ రూ.46 లక్షలు దోచుకుని వెళ్లిపోయారు. ఆ రోజు ఉదయం 9.15కు మేనేజర్ విశ్వేశ్వర్రావు వెనుకవైపు తలుపు తెరుచుకుని బ్యాంకులోకి వెళ్లారు. అప్పటికే మాటువేసి అంతా గమనిస్తున్న దొంగలు ఆ తర్వాత పది నిమిషాలకే బ్యాంకు లోనికి ప్రవేశించారు. ఖాతాదారుల సందడి ప్రారంభం కాకముందే బ్యాంకులో ప్రవేశించి గంట వ్యవధిలో తమ ‘ఆపరేషన్’ పూర్తి చేసుకొని వెళ్లారు. ఆ నలుగురు భూపాలపట్నం రోడ్డు వైపు పారిపోయినట్లు తెలుస్తోంది. వారి వేషభాషలు చూసిన పోలీసులు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారిగా నిర్ధారణకు వచ్చారు. బ్యాంక్‌లో నాలుగు సీసీ కెమెరాలు ఉండగా, మూడింటికి అనుసంధానంగా ఉన్న హార్డ్‌డిస్క్‌లను తీసుకున్నారు. నాలుగో కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. అయితే అది దూరంగా ఉండడం, ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో చిత్రాలు అస్పష్టంగా ఉన్నాయి. వీటిని మరింత స్పష్టంగా విశ్లేషించడం కోసం హైదారాబాద్‌కు పంపించామని పోలీసు అధికారులు తెలిపారు. రెక్కీ నిర్వహించాకే దోపిడీ.. దోపిడీ దొంగలు కనీసం పదిహేను ఇరవై రోజులుగా బ్యాంకుపై రెక్కీ నిర్వహించాకే భారీ దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారిస్తున్నారు. చొప్పదండి, దాని పరిసర ప్రాంతాల్లో గానీ, కరీంనగర్లో గాని షెల్టర్ తీసుకుని ఉంటారని, ఆయా ప్రాంతాల్లో అనుమానం రాకుండా దుస్తులు, వేషధారణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. స్థానికులు కాకున్నా బ్యాంకు పరిసరాలు పూర్తిగా గమనించడంతో పాటు, ఎటువంటి రిస్కు లేకుండా, ముఖాలకు గుడ్డలు కూడా లేకుండా గంట వ్యవధిలో తమ పని ముగించుకొని వెల్లడం ప్రొఫెషనల్ దొంగల పనేనని భావిస్తున్నారు. భారీ చోరీ చేసిన దొంగలు మొదటి రోజు ఎక్కువ దూరం పారిపోకుండా, తాము ముందుగా తీసుకున్న షెల్టర్‌లో తలదాచుకున్నారనే భావన వ్యక్తమవుతోంది. చొప్పదండి పరిసర ప్రాంతాల్లో ఇటుకబట్టీలు, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పనులు, ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్ట్ పనులు, ఇతర సంస్థల పనులు జరుగుతుండడంతో వందలాది మంది స్థానికంగా నివాసం ఉంటున్నారు. వీరిలో దొంగలు ఎవరో, కూలీలు ఎవరో తెలియని పరిస్థితి నెలకొంది. వీడియో చిత్రాలు, సెల్ఫోన్కాల్స్ ఆధారంగా దొంగలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ‘సాక్షి’ ముందే చెప్పింది.. బ్యాంకు దోపిడీ బవారియా, లేదా ఇతర అంతర్రాష్ట్ర ముఠాల పనేనని, ఆ ముఠాలు ఎలా చోరీలు చేస్తాయో గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా సాక్షి దోపిడీ జరిగిన మరునాడే కథనాన్ని ప్రచురించింది. తాజాగా పోలీసులు ఆ ముఠాలపైనే అనుమానాలు వ్యక్తం చేస్తుండడం విశేషం. రెండేళ్ల క్రితం ఎల్లారెడ్డిపేట బ్యాంక్‌లో చోరీకి ప్రయత్నాలు చేస్తుండగా అక్కడ ట్రెయినీ ఎస్సైగా ఉన్న దామోదర్‌రెడ్డి (ప్రస్తుతం ఎల్ఎండీ ఎస్సై) అనుమానితులను పట్టుకున్నారు. వారిలో కరుడుగట్టిన బవారియా ముఠా ముఖ్య నాయకుడు దొరికాడు. వెంటనే అతడిని సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. అతడిని విచారించగా హుస్నాబాద్‌తో పాటు, నల్గొండ, అదిలాబాద్ జిల్లాల్లో బ్యాంక్‌లో చోరీలు వెలుగుచుశాయి. అతడు ఇచ్చిన సమాచారం అధారంగా రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో వెతికినా ముఠా సభ్యులు దొరకలేదు. చివరకు అతడి నుంచి పెద్ద మొత్తంలో వెండి రికవరీ చేసి రిమాండ్‌కు పంపించారు. బయటకు వచ్చిన తర్వాత ఆ గ్యాంగ్ సభ్యులు అచూకీ లేకుండాపోయాడు. ఇప్పుడు తాజాగా అదే గ్యాంగ్‌పై అనుమానాలు రావడం, వీరు గతంలో చేసిన తరహాలోనే తాజా దోపిడీ జరిగింది. పట్టుకుంటే పారితోషికం జిల్లాలో సంచలనం సృష్టించిన చొప్పదండి ఎస్బీఐ దోపిడీ సంఘటనలో పాల్గొన్న నిందితులకు సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డయిన చిత్రాలను ఎస్పీ శివకుమార్ విడుదల చేశారు. పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. వారు 20 రోజుల పాటు రెకీ నిర్వహించి బ్యాంకు లోపాల గురించి పూర్తిగా తెలుసుకుని దోపిడీకి పాల్పడ్డారన్నారు. ఇంది అంతర్రాష్ట్ర ముఠా పనేనని, ఇరానీ, పార్థీ, బవారియా ముఠాలపై అనుమానం ఉందని తెలిపారు. గతంలో హుస్నాబాద్ బ్యాంక్ చోరీ సంఘటనలో పాల్గొన్న ముఠాలపై కూడా అనుమానాలున్నాయన్నారు. రెండు రోజుల క్రితం హైదారాబాద్‌లో ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారని, స్థానిక పోలీసులు అక్కడికి వెళ్లి సమాచారం సేకరిస్తున్నారని చెప్పారు. వీరు ప్పదండి చుట్టుపక్కల గ్రామాల్లో లేదా కరీంనగర్ శివారు ప్రాంతాల్లో గదులు అద్దెకు తీసుకుని ఉండవచ్చన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడంతో పాటు వారికి తగిన పారితోషికం ఇస్తామని ఎస్పీ శివకుమార్ ప్రకటించారు.