విమానంలో వచ్చి కొల్లగొడతారు! | And predates the plane ! | Sakshi
Sakshi News home page

విమానంలో వచ్చి కొల్లగొడతారు!

Published Wed, Sep 14 2016 9:35 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును చూపిస్తున్న పోలీసులు

నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును చూపిస్తున్న పోలీసులు

మలేసియా టౌన్‌షిప్‌: ఒడిషా నుంచి విమానంలో వచ్చి నగరంలో చోరీలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. వీరు సైబరాబాద్, హైదరాబాద్‌ పోలీసు కమిషరేట్ల పరిధితో పాటు విశాఖపట్నంలో గత మూడేళ్లలో 100 చోరీలకు పాల్పడి సుమారు 8 కేజీల బంగారం ఎత్తికెళ్లినట్టు పోలీసులు వెల్లడించారు.  బుధవారం మాదాపూర్‌ డీసీపీ కార్తికేయ, కూకట్‌పల్లి ఏసీపీ భుజంగరావుతో కలిసి కేపీహెచ్‌పీ ఠాణాలో విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లాకు చెందిన ప్రశాంత కుమార్‌ కరాడ అలియాస్‌ తుల్లు (25), సుశాంతకుమార్‌ పాణిగ్రాహి (33), ప్రేమానంద్‌ ప్రధాన(27) ముగ్గురూ కలిసి తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉండగా... బుధవారం కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేన్‌ పరిధిలోని ప్రగతినగర్‌లో డీఐ బాలకృష్ణ, వెహికల్‌ చెకింగ్‌ నిర్వహిస్తుండగా ప్రశాంత కుమార్‌ కరాడ అలియాస్‌ తుల్లు, సుశాంతకుమార్‌ పాణిగ్రాహి, ప్రేమానంద్‌ ప్రధాన అనుమానాస్పదంగా వాహనంలో కనిపించారు. దీంతో ముగ్గురినీ అదుపులోకి తీసుకొని సీసీఎస్‌  ఇన్‌స్పెక్టర్‌ హరిశ్చద్రారెడ్డి, కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్‌ కుషాల్‌కర్‌ల ఆధ్వర్యంలో విచారించగా ఇళ్లలో చోరీలకు పాల్పడే అంతర్రాష్ట ముఠాగా తేలింది.  హైదరాబాద్, సైబరాబాద్‌ జంట సర్కిళ్లల్లోతో పాటు విశాఖపట్టణంలోను చోరీలకు పాల్పడినట్టు నిందితులు ఒప్పుకున్నారు. ప్రశాంత్‌ కుమార్‌ కరాడ ఒక్కడే 15 దొంగతనాలు చేశాడు.  దొంగిలించిన బంగారాన్ని ఒడిషాలో విక్రయించి, వచ్చిన డబ్బుతో అక్కడ ఇళ్లను, ప్లాట్లను కొనుగోలు చేసినట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. ఇటీవల ఒడిషాలోని ఓ అపార్టుమెంట్‌లో రూ.20 లక్షల విలువ చేసే ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం 100 కేసుల్లో 42 దొంగతనాలకు సంబంధించిన వివరాలను పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకోవటంతో పాటు ఒక ఆల్టో కారు, 6 సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ వీరి చోరీ స్టైల్‌...
తాళాలు ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రిపూట చోరీకి వెళ్తారు.  ప్రధాన ద్వారం వెనుక ఉన్న గడియను తీసి ఇంట్లో వారు నిద్రిస్తున్న సమయంలోనే చోరీకి పాల్పడతారు. గడ్డపార వంటి రాడ్‌తో తాళాలను పగులగొట్టి చోరీ చేసే విధానాన్ని నిందితులు పోలీసులకు కళ్లకు కట్టినట్లు చూపించారు. వీరు ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ చోరీలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. ప్రశాంత్‌కుమార్‌ కరాడ భువనేశ్వర్‌ నుంచి హైదరాబాద్‌కు నాలుగు సార్లు విమానంలో వచ్చి చోరీలు చేసినట్టు పోలీసులు తెలిపారు. విచారణలో మరిన్ని దొంగతనాలు బయటపడే అవకాశం ఉందని, నిందితుల నుంచి మరింత సొత్తును రికవరీ చేయాల్సి ఉందని డీసీపీ కార్తికేయ తెలిపారు. విలేకరుల సమావేశంలో కెపిహెచ్‌పీ డీఐ బాలకృష్ణ, రవికుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement